Olive oil: ఆలివ్ ఆయిల్ తినడం వల్లే కాదు జుట్టుకు రాయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు
ఆలివ్ ఆయిల్ ను (Olive oil) ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. అలాగే సలాడ్ లలో వేసుకొని తింటారు. జుట్టుకు రాయడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఆలివ్ ఆయిల్ ను జుట్టుకు ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

జుట్టుకు ఆలివ్ ఆయిల్
ఈరోజుల్లో జుట్టు సంరక్షణ పెద్ద సమస్యగా మారిపోయింది. జుట్టు ఊడిపోవడం, చివర్లు చిట్లిపోవడం, రంగు మారడం వంటివన్నీ ఎంతోమందికి ఎదురవుతున్న ప్రధాన సమస్యలు. అయితే రకరకాల నూనెలను వాడతారు గానీ అందుబాటులో ఉన్న ఆలివ్ నూనెను మాత్రం ఎవరూ జుట్టుకు ఉపయోగించరు. నిజానికి జుట్టును మృదువుగా, బలంగా, మెరిసేలా చేసే శక్తి ఆలివ్ ఆయిల్ కు ఉంది. ఆలివ్ నూనెను వంటల్లోనే కాదు జుట్టుకు అప్లై చేయడం ద్వారా కూడా వెంట్రుకలు పొడవుగా, బలంగా పెరిగేలా చేసుకోవచ్చు.
ఆలివ్ నూనె ప్రత్యేకతలు
జుట్టుకు ఆలివ్ ఆయిల్ పట్టించడం వల్ల తగినంత పోషణ అందుతుంది. తలపై ఉన్న చర్మాన్ని తేమవంతం చేస్తుంది. ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఆలివ్ నూనె అప్లై చేయడం వల్ల ఎన్నో రకాలుగా జుట్టుకు బలం లభిస్తుంది. జుట్టు వెంట్రుకల మూలల నుంచి బలోపేతం చేసే శక్తి ఆలివ్ నూనెకు ఉంది.
ఆలివ్ నూనెతో మసాజ్
క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఆలివ్ నూనె మీ తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలిపోవడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. వెంట్రుకలు కూడా చాలా మృదువుగా మారుతాయి. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు మెరుపును పెంచుతాయి. వాటిని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి
ఇలా వాడాలి
ఆలివ్ నూనెను తలకు ఎలా ఉపయోగించాలో చాలామందికి తెలియదు. ఇందుకోసం మీరు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెను తీసుకొని గోరువెచ్చగా వేడి చేయండి. తర్వాత ఆ నూనెతో తలకు మసాజ్ చేసి అరగంట పాటు అలా వదిలేయండి. తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి. వారానికి ఒకటి నుంచి రెండుసార్లు ఇలా చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఆలివ్ నూనెలో కలబంద జెల్, కొబ్బరి నూనె, ఆముదం నూనె వంటివి కూడా కలిపి తలకు పట్టిస్తే ఇంకా ఆరోగ్యం.
అందరూ ఉపయోగించకూడదు
కొందరికి తలపై ఇన్ఫెక్షన్లు లేదా అలెర్జీలు వంటివి ఉంటాయి. అలాంటివారు వైద్యుని సంప్రదించాకే ఆలివ్ నూనెను ఉపయోగించడం మంచిది. ఇక జిడ్డు చర్మం కలవారు, జిడ్డు జుట్టును ఉన్నవారు కూడా ప్రతిరోజు ఆలివ్ ఆయిల్ ని వినియోగించకూడదు. మీరు వారానికి ఒకసారి మాత్రమే వినియోగించుకోవడం మంచిది. ఏదేమైనా ఆలివ్ నూనె జుట్టుకు అద్భుతమైన ఔషధంగానే చెప్పుకోవాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ ఆలివ్ నూనెను జుట్టుకు వాడడం ద్వారా వెంట్రుకలు బలంగా ఆరోగ్యంగా మెరిసేలా చేయవచ్చు.