- Home
- Life
- Hair Oil: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాయండి.. ఈ చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఒత్తుగా ఉంటుంది
Hair Oil: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాయండి.. ఈ చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఒత్తుగా ఉంటుంది
Hair Oil: చలికాలంలో చర్మంతో పాటు జుట్టూ పొడిబారుతుంది. చిట్లిపోవడం, చిక్కులు, రాలడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. దీని కోసం ఖరీదైన ఆయిల్స్, షాంపూల కంటే ఇంట్లోనే నేచురల్ హెయిర్ ఆయిల్ చేసుకోండి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం.

చలికాలంలో జుట్టు సంరక్షణకు ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారీ
చలికాలం వచ్చిందంటే చర్మంతో పాటు జుట్టు కూడా పొడిబారిపోతుంది. తలలో దురద, జుట్టు చివర్లు చిట్లిపోవడం, వెంట్రుకలు గరుకుగా మారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొందరిలో జుట్టు రాలడం కూడా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తుల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే దొరికే కొబ్బరి నూనె, ఉసిరి, మెంతులు, కరివేపాకుతో ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారుచేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారుచేయాలి? ఎలా ఉపయోగించాలి? తెలుసుకుందాం.
హెయిర్ ఆయిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- కొబ్బరి నూనె – ఒక కప్పు
- ఆముదం – 2 టేబుల్ స్పూన్లు
- ఎండిన ఉసిరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు
- మెంతులు – ఒక టేబుల్ స్పూన్
- కరివేపాకు – 10 నుంచి 12 ఆకులు
- నల్ల జీలకర్ర (కలోంజి) – ఒక టీస్పూన్
హెయిర్ ఆయిల్ తయారుచేసే విధానం
ముందుగా ఒక చిన్న గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని స్టవ్‌పై పెట్టాలి. మెంతులు, కలోంజి గింజలను కొద్దిగా దంచి నూనెలో వేయాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని పదార్థాలు నూనెలో కలవడానికి వీలవుతుంది.
తర్వాత ఎండిన ఉసిరి ముక్కలు, కరివేపాకు వేసి చాలా తక్కువ మంటపై వేడి చేయాలి. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు నూనెను మరిగించకుండా నెమ్మదిగా వేడి చేయాలి. కరివేపాకు కాస్త క్రిస్పీగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
నూనె పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రమైన పలుచటి వస్త్రంతో వడకట్టాలి. ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కలిపి బాగా మిక్స్ చేయాలి. అంతే.. ఇంట్లోనే తయారుచేసుకున్న హెయిర్ ఆయిల్ సిద్ధం.
దీన్ని పూర్తిగా పొడిగా ఉన్న శుభ్రమైన గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. నీళ్లు పడకుండా చూసుకోవాలి. వాసన లేదా రంగులో మార్పులు కనిపిస్తే ఉపయోగించకూడదు. ఎక్కువ రోజులకు సరిపడా తయారుచేసుకోకుండా కొద్ది మొత్తంలోనే చేసుకోవడం మంచిది.
ఈ నూనెను ఎలా ఉపయోగించాలి?
నూనెను నేరుగా వేడి చేయకుండా గోరువెచ్చగా చేసుకోవాలి. తర్వాత జుట్టును పాయలుగా విడదీసి వేలి చివర్లతో నెమ్మదిగా తలకు పట్టించాలి. గోళ్లతో గట్టిగా రుద్దకూడదు. జుట్టు చివర్లకు కూడా కొద్దిగా నూనె రాసుకోవాలి.
సుమారు 30 నుంచి 60 నిమిషాల పాటు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయవచ్చు. రాత్రంతా నూనె ఉంచాల్సిన అవసరం లేదు.
జుట్టు పెరుగుదల విషయంలో ఈ విషయం గుర్తుంచుకోండి
ఈ నూనె జుట్టును మృదువుగా మార్చడానికి, పొడిబారడాన్ని తగ్గించడానికి ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా కొబ్బరి నూనె జుట్టులో ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. జుట్టు ఆరోగ్యం అనేది జీన్స్, ఆహారం, హార్మోన్లు, ఇలా మొత్తం ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అకస్మాత్తుగా ఎక్కువగా జుట్టు రాలుతున్నా, అక్కడక్కడా జుట్టు పలుచబడుతున్నా చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించాలి. అలాగే కొత్తగా తయారుచేసిన నూనెను తలకు రాసుకునే ముందు చేతి లోపలి భాగంలో కొద్దిగా రాసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.





