Bad Breath: నోటి దుర్వాసనకు మంతెన చెప్పిన బెస్ట్ చిట్కా, ఇదొక్కటి చేస్తే చాలు
Bad Breath: నోటి దుర్వాసన అనేది కేవలం దంతాల సమస్య మాత్రమే కాదు.. అది మన అంతర్గత ఆరోగ్యానికి ఒక సంకేతం అని డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు వివరించారు. కేవలం సింపుల్ చిట్కాలతో ఈ నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు.

Bad Breath
ప్రస్తుత కాలంలో చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యతో నలుగురిలోకి వెళ్లాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు. బ్రష్ చేసినా, మౌత్ వాష్ లు వాడినా ఈ సమస్య తగ్గడం లేదని బాధ పడేవారు చాలా మంది ఉన్నారు. అలాంటివారు ప్రకృతి చికిత్సా నిపుణులు మంతెన గారు చెప్పిన ఈ బెస్ట్ చిట్కాలు ఫాలో అయితే చాలు.
నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది..?
మనం తిన్న ఆహారం దంతాల సందుల్లో ఇరుక్కుపోయి కుళ్లిపోవడం వల్ల ఒక రకమైన వాసన వస్తుంది. అయితే, నోటి దుర్వాసనకు నోరు మాత్రమే ప్రధాన కారణం కాదు, మన పొట్టకూడా. పొట్ట శుభ్రంగా లేకపోతే ఆ గ్యాస్ నోటి ద్వారా బయటకు వచ్చి దుర్వాసన కలిగిస్తుంది.
మంచి నీరే పరిష్కారం...
నోటి దుర్వాసన తగ్గాలంటే మన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దీని కోసం రోజుకీ కనీసం తక్కువలో తక్కువ 4 నుంచి 5 లీటర్ల మంచినీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల నోరు ఎండిపోదు. బ్యాక్టీరియా వృద్ధి చెందదు. నోటి దుర్వాసన కూడా క్రమంగా తగ్గుతుంది.
మల విసర్జన - అంతర్గత శుభ్రత
శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతే ఆ ప్రభావం శ్వాసపై పడుతుంది. అందుకే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ మల విసర్జన సాఫీగా జరిగితే, రక్తంలోని టాక్సిన్స్ తగ్గి శ్వాస స్వచ్ఛంగా మారుతుంది.
మ్యాజికల్ డిన్నర్: రాత్రి పండ్లు మాత్రమే
మంతెన గారు చెప్పిన అతి ముఖ్యమైన రూల్ ఇది. నోటి దుర్వాసనతో బాధపడేవారు తమ రాత్రి భోజనాన్ని మార్చుకోవాలి.రాత్రిపూట అన్నం లేదా చపాతీలు మానివేసి, కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి.
పండ్లలో ఉండే పీచు పదార్థం (Fiber) దంతాలనే కాకుండా, ప్రేగులను కూడా శుభ్రం చేస్తుంది. ఒక నెల లేదా రెండు నెలల పాటు వరుసగా రాత్రి పండ్లు మాత్రమే తింటే, ఆశ్చర్యకరంగా మీ నోటి దుర్వాసన మాయమవుతుంది.
సహజమైన మౌత్ ఫ్రెషనర్: యాలకులు
మార్కెట్లో దొరికే కెమికల్ మౌత్ ఫ్రెషనర్ల కంటే యాలకులు (Cardamom) ఎంతో మేలు. నోటిలో ఒక యాలక్కాయ వేసుకుని నములుతూ ఉంటే, అందులోని సుగంధ తైలాలు దుర్వాసనను కంట్రోల్ చేస్తాయి. ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

