- Home
- Life
- Software Employees: ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా ఈ తీవ్ర వ్యాధికి గురవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
Software Employees: ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా ఈ తీవ్ర వ్యాధికి గురవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
Software Employees: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఎలాంటి చెడు అలవాట్లు లేకున్నా కూడా తీవ్రమైన వ్యాధులు బారినపడుతున్నారు. ముఖ్యంగా వారిలో కొన్ని రకాల ఆరోగ్యసమస్యలు వస్తున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి.

ఈ విటమిన్ లోపం వల్లే సమస్యే
మన దేశంలో చాలా మంది యువ ఉద్యోగులు, ముఖ్యంగా ఐటి ఉద్యోగులు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. వారు ఆరోగ్యంగా కనిపించినా కూడా నాడీ సమస్యలను ఎదుర్కొంటున్నారని న్యూరాలజిస్ట్‌లు చెబుతున్నారు. చేతులు, కాళ్లలో తిమ్మిరి, నిస్పృహ, అలసట, బ్రెయిన్ ఫాగ్, కొన్నిసార్లు జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలతో చాలామంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. పొగ తాగడం, లిక్కర్ వంటి అలవాట్లు లేకపోయినా కూడా ఐటీ ఉద్యోగులు ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వారిలో విటమిన్ B12 లోపం కనిపించింది.
ఏం తినాలి?
వైద్యులు చెబుతున్న ప్రకారం నేటి యువత జీవనశైలే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఉదయం అల్పాహారం చేయకపోవడం, రోజంతా టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, బయట ఆహారం మీద ఆధారం పెరగడం, లాంగ్ షిఫ్ట్స్ కారణంగా ఎక్కువసేపు కూర్చోవడం వంటివన్నీ B12 శోషణను తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శాకాహారులు B12 రిచ్ ఆహారాలు తక్కువగా తీసుకోవడం వల్ల ఈ లోపం ఎక్కువగా కనిపిస్తోంది. అదనంగా ఎసిడిటీ మందులు లేదా మధుమేహ మందులు ఎక్కువకాలం వాడే వారిలో కూడా ఈ లోపం వేగంగా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. B12 మన శరీరం స్వయంగా తయారు చేయదు. ఆహారం ద్వారా మాత్రమే అందుతుంది. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసం లాంటి ఆహారాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా మంది తగ్గించి తినడంతో లోపం పెరుగుతోంది.
B12 తగ్గితే ఏమవుతుంది?
విటమిన్ B12 శరీరంలోని నాడులు బలంగా ఉండేందుకు చాలా ముఖ్యం. ఇది నాడులను కప్పి రక్షించే మైయెలిన్ షీథ్ అనే పొరను కాపాడుతుంది. B12 తగ్గితే ఆ రక్షణ కవచం బలహీనమవుతుంది. అప్పుడే తిమ్మిరి, మంట, నొప్పి, కాళ్లలో బలహీనత, బ్యాలెన్స్ కోల్పోవడం, చిటికెలకు స్పందన తగ్గడం వంటి సమస్యలు మొదలవుతాయి. మొదట్లో చిన్నగా కనిపించినా, దాన్ని పట్టించుకోకపోతే నాడులు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కొంతమందికి జ్ఞాపకశక్తి తగ్గడం, దృష్టి కేంద్రీకరించలేకపోవడం, డిప్రెషన్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నేరుగా మెదడు పనితీరుపైనా ప్రభావం చూపుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ సమస్యను చిన్నదిగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. చేతులు, కాళ్లలో తిమ్మిరి, తరచూ అలసట, నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోవడం, మైండ్ బ్లాంక్ అయ్యే అనుభూతి ..ఇవన్నీ శరీరం మనకు ఇస్తున్న హెచ్చరికలు. ఒకసారి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్తపరీక్ష చేయించి విటమిన్ బి12 లెవెల్స్ చెక్ చేయాలని నిపుణుల సూచిస్తారు. చాలామంది హెల్త్ చెకప్ ప్యాకేజీల్లో B12 టెస్టు ఉండదు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ టెస్టును అడిగి తెలుసుకోవాలి. విటమిన్ B12 ఉన్న ఆహారాలు అధికంగా తీసుకోవాలి. శాకాహారులు అయితే ఫోర్టిఫైడ్ ఆహారాలు లేదా సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. టీ, కాఫీ తగ్గించడం, రోజుకి కొద్దిసేపు అయినా వ్యాయామం, సరైన నిద్ర, ఒత్తిడి తగ్గించే అలవాట్లు ద్వారా విటమిన్ బి12 లోపాన్ని తగ్గించుకోవచ్చు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసే ఉద్యోగులు, లాంగ్ వర్క్ అవర్స్ ఉన్నవారు, సమయానికి నిద్రపోని వారు, శాకాహారులలో విటమిన్ బి12 లోపం వచ్చే అవకాశం ఎక్కువ. చాలా మంది దీన్ని సాధారణ అలసటే అని పట్టించుకోరు. కానీ నాడీ వైద్యులు మాత్రం లక్షణాలు కనిపించగానే తగిన చికిత్స తీసుకోవాలి. అందుకే యువత, ముఖ్యంగా ఐటి, కార్పొరేట్ రంగంలో పనిచేసే వారు తమ B12 లెవెల్స్‌ను తరచూ చెక్ చేయించుకొని అవసరమైన మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

