Mango : మామిడి పండ్లలో కెమికల్స్ ని నిమ్మకాయతో కనిపెట్టేయండి.. 2 నిమిషాల్లోనే క్లారిటీ
ఈ కలికాలంలో ప్రతీదీ కల్తీయే… చివరకు సహజంగా పండే మామిడి పండ్లను కూడా కెమికల్స్‌తో కల్తీ చేస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సహజంగా పండిన మామిడిపండ్లను తినాలి. మరి మార్కెట్లో దొరికేవి కెమికల్ తో పండిచనవో, కావో తెలుసుకోవడం ఎలా..?

కార్బైడ్ మామిడి పండ్లు..
Mango Ripening : సాధారణంగా మామిడి కాయలు పక్వానికి రాగానే తెంపి సహజంగా వరిగడ్డి వంటివాటిలో వేసి మక్కబెట్టేవారు. కానీ ఇప్పుడు మామిడి కమర్షియల్ పంటగా మారింది… వెంటనే కాయలను పండ్లుగా మార్చి అమ్మేయాలని వ్యాపారులు భావిస్తున్నారు. అందుకు రైతుల నుండి కాయలను కొనుగోలు చేసిన వెంటనే కెమికల్స్ సాయంతో పండ్లుగా మారుస్తున్నారు.
మామిడి కాయలు మంచి రంగుతో సహజంగా పండినట్లుగా కనిపించేందుకు అనేక కెమికల్స్ ఉషయోగిస్తారు వ్యాపారులు. ఇందుకోసం చాలామంది కాల్షియం కార్బైడ్ వాడుతున్నారు. ఇది ఆకుపచ్చని మామిడి కాయలను నిగనిగలాడే పసుపు రంగులోకి మారుస్తుంది… తక్కువ సమయంలో పండేలా చేస్తుంది. ఇలాంటి పండ్లను తాజాగా, నాణ్యమైనవిగా భావించి కస్టమర్లు ఆకర్షితులవుతారు… వెంటనే కొనేస్తారు. అందుకే పండ్ల వ్యాపారులు ఈ ట్రిక్ ను ఫాలో అవుతున్నారు.

కాల్షియం కార్బైడ్ పండ్లను ఎలా పండిస్తుంది..?
కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ ఎసిటిలీన్ అనే గ్యాస్‌ను విడుదల చేస్తుంది. ఇదే కాయలుగా ఉండే ఫలాలను పండ్లుగా మారుస్తుంది… ఎలాంటి అనుమానం రాకుండా సహజంగా పండినట్లుగా పండ్లు ఉంటాయి. అయితే ఈ పండ్లను కెమికల్ తో మగ్గబెట్టడం వల్ల ప్రమాదకరమైన విషపూరిత అవశేషాలు వాటిలొ మిగిలిపోతాయి. ఇలాంటి పండ్లను తరచూ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
నిమ్మకాయతో మామిడి పండ్ల నాణ్యతా పరీక్ష...
అయితే మనం మార్కెట్ నుండి మామిడి కాయలను తీసుకురాగానే వాటిని కెమికల్స్ తో పండించారా లేక సాధారణంగా పండించారో తెలుసుకునే సింపుల్ చిట్కాలున్నాయి. వాటిలో ఒకటే ఈ నిమ్మకాయ చిట్కా… అవును వింటున్నది నిజమే… కేవలం రెండు నిమిషాల్లోనే నిమ్మకాయతో మామిడి పండ్లను టెస్ట్ చేయవచ్చు… ఇందులో కెమికల్స్ లేవని తేలితే హ్యాపీగా టేస్ట్ చేయవచ్చు.
ముందుగా మీరు మార్కెట్ నుండి మామిడి పండ్లను తేగానే ఓ గిన్నెలోకి తీసుకొండి. ఓ నిమ్మకాయను కట్ చేసి మామిడి పండ్ల తొడిమ భాగంలొ ఈ నిమ్మకాయను రుద్దాలి. ఇలా దాదాపు ఐదు నుండి పది సెకన్ల పాటు నిమ్మరసం మామిడి తొడిమకు అంటుకునేలా రుద్దుతూనే ఉండాలి. ఇలా చేస్తుంటే రంగులో ఏదైనా మార్పు వస్తే కచ్చితంగా మామిడిపండులో కెమికల్స్ వాడినట్లే.
మామిడి పండు తొడిమను నిమ్మకాయ రుద్దినప్పుడు నీలం లేదా ఊదా రంగులోకి మారితే, అందులో కెమికల్ వాడినట్టు అర్థం. రంగు మారకపోతే అది సహజంగా పండిన పండు అని, ఎలాంటి కెమికల్ వాడలేదని తెలుసుకోవచ్చు. ఆ పండును మీరు ఎలాంటి భయం లేకుండా తినొచ్చు.
సహజంగా పండిన మామిడి పండు
సహజంగా పండిన మామిడి పండును రుచి చూడాల్సిన పనిలేదు… కేవలం వాసన చూసినా తియ్యగా, ముధురంగా వస్తుంది. ఇలాంటి పండ్ల నుండి ఎలాంటి రసాయన వాసన రాదు. నొక్కి చూస్తే మెత్తగా ఉంటుంది. ఒకవేళ బయట రంగు పచ్చగా ఉన్నా పండు గట్టిగా ఉంటే అది కెమికల్స్ తో పండించిందని గుర్తించాలి.
మామిడి పండు తినే ముందు జాగ్రత్తలు
మార్కెట్లో మామిడి పండ్లను కొనుగోలు చేయగానే ఇంటికితెచ్చి శుభ్రంగా కడుక్కోవాలి… అలాగే అస్సలు తినకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి… శుభ్రమైన నీటిలో బాగా కడిగాకే వాళ్లకు ఇవ్వాలి. పండు తొడిమ భాగాన్ని కొద్దిగా కట్ చేసి, ఓ అరగంట పాటు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత తింటే పండులో ఉండే వేడి తగ్గుతుంది.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.
కెమికల్స్ తో పండించిన మామిడిపండ్లు దరిచేరకూడదంటే రైతుల వద్ద కాయలు కొనుగోలుచేసి సొంతంగా మగ్గబెట్టడం ఉత్తమం. లేదంటే బాగా తెలిసిన, నమ్మకస్తులైన వ్యాపారుల దగ్గర పండ్లను కొనుగోలు చేయాలి. కార్బైడ్ పండ్లను తిని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు.

