Relationship Psychology : 50% కార్పొరేట్ మహిళలకు వివాహేతర సంబంధాలుంటాయా..? కారణాలేంటి?
Relationship Psychology : కార్పోరేట్ ఉద్యోగుల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉంటాయనే భావన ప్రజల్లో ఉంది. ఇందులో నిజమెంత..? ఇందుకు కారణమైన అంశాలేమిటి..?

వర్క్ రిలేషన్ ఉంటే చాలు... ఇల్లీగల్ రిలేషన్ కాదు
Relationship Psychology : భర్తను చంపిన భార్య... భార్యను హత్యచేసిన భర్త... ఇటీవలకాలంలో ఇలాంటి దారుణాల గురించి ఎక్కువగా వింటున్నాం. కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను వదిలి చాలామంది పరాయివారిపై మోజుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు అయినవారిని దూరం చేస్తాయి, బయటపడితే సమాజంలో పరువు పోతుంది, తలెత్తుకుని తిరగలేరు... ఇవన్నీ తెలిసికూడా కొందరు ఏదో తెలియని అట్రాక్షన్ తో మాయలో పడుతున్నారు... పచ్చని జీవితాల్లో చేజేతులా నిప్పులు పోసుకుంటున్నారు.
అయితే ఈ వివాహేతర సంబంధాల ట్రెండ్ ప్రస్తుతం మరో టర్న్ తీసుకుంది. కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల మధ్య వర్క్ రిలేషన్ చాలా ముఖ్యం... కానీ ఇటీవల కాలంలో ఇది ఇల్లీగల్ రిలేషన్ స్థాయికి చేరుకుంది. ఇటీవల ఆస్ట్రోనోమర్ సీఈవో, హెచ్ఆర్ హెడ్ వ్యవహారం... నెస్లే సంస్థ సీఈవో అదే కంపెనీ ఉద్యోగితో ప్రేమాయణం... ఇలాంటి ఘటనలు కార్పోరేట్ కంపెనీల్లో పరిస్థితిని తెలియజేస్తున్నాయి. ఇదే సమయంలో కార్పోరేట్ కంపెనీ ఉద్యోగుల్లో 50 శాతంమంది వివాహేతర సంబంధాల్లో ఉంటారంటూ ఓ మహిళా ఉద్యోగి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కార్పోరేట్ ఉద్యోగులకు హద్దులు దాటడానికి కారణాలివే...
అయితే కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగుల మధ్య ప్రెండ్లీ రిలేషన్ ఎందుకు ఇల్లీగల్ రిలేషన్ గా మారుతోంది..? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. వర్క్ కల్చర్ తో పాటు మరికొన్ని అంశాలు కార్పోరేట్ ఉద్యోగులను వివాహేతర సంబంధాలకు కారణం అవుతున్నాయనే వాదన బలంగా ఉంది. ఒకేదగ్గర పనిచేసే ఉద్యోగుల మధ్య సాన్నిహిత్యం పెరగడం సహజమే... కానీ అది హద్దులు దాటి వివాహేతర సంబంధంగా మారడం అసహజమైంది. ఇలా జరగడానికి కారణాలేంటో ఇక్కడ చర్చిద్దాం.
కార్పోరేట్ వాతావరణం..
సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఆఫీసు లేదంటే స్థానికంగా ఉండే చిన్నచిన్న ప్రైవేట్ కార్యాలయాలను పరిశీలించండి. అక్కడ మహిళా ఉద్యోగులు పురుషులకు ఆమడ దూరంలో ఉండటం కనిపిస్తుంది... కుదిరితే వేరువేరు క్యాబిన్లు ఉంటాయి. కానీ కార్పోరేట్ సంస్థల్లో అలాకాదు... ఆడామగా అనే తేడా ఉండదు, అందరూ ఒకేచోట పనిచేయాల్సి ఉంటుంది. ఈ సంస్థల్లో పనిగంటలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుటుంబసభ్యులతో కంటే సహోద్యోగులతోనే ఎక్కువ సమయం కలిసుంటారు. ఇది వారిమధ్య సాన్నిహిత్యం పెంచి కొన్నిసార్లు వివాహేతర సంబంధాలకు దారితీస్తోంది.
వర్క్ ప్రెజర్
కార్పొరేట్ ఉద్యోగంలో రోజంతా కలిసి పనిచేయడం, ఒకే రకమైన ఒత్తిడి, లక్ష్యాలు, అనుభవాలు పంచుకోవడం వల్ల సహోద్యోగుల మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. ఈ భావోద్వేగ సాన్నిహిత్యం కొన్నిసార్లు ప్రేమ లేదా వ్యక్తిగత సంబంధాలుగా మారవచ్చు. అంటే వర్క్ ప్రెజర్ కూడా కార్పోరేట్ ఉద్యోగుల వివాహేతర సంబంధాలకు ఓ కారణంగా మారుతోంది.
మానసిక అంశాలు...
కొందరు కార్పోరేట్ ఉద్యోగుల్లో మానసిక అంశాలు వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. తమ వ్యక్తిగత జీవితంలో దొరకని భావోద్వేగ సపోర్ట్, గౌరవం లేదా శ్రద్ధ పని ప్రదేశంలో దొరుకుతుందనే భావన కలుగుతుంది. దీంతో వారు ఆ సంబంధాల వైపు ఆకర్షితులవుతారు.
వృత్తిపరమైన లాభాలు..
ఇక కొన్నిసార్లు సామాజిక లేదా వృత్తిపరమైన లాభాలు కూడా ఉద్యోగుల మధ్య సంబంధాలకు కారణం కావచ్చు. హోదా, పరిచయాలు లేదా కెరీర్ ఎదుగుదలకు సాయపడుతుందనే భావన కూడా వివాహేతర సంబంధాలకు దారితీయవచ్చు.
నిస్సహాయత...
కొన్ని సందర్భాల్లో ఉన్నత ఉద్యోగుల ఒత్తిడి, ఉద్యోగం పోతుందేమోనన్న భయం కూడా వివాహేతర సంబంధాలకు దారితీయవచ్చు. అయితే ఇది ఎక్కువగా మహిళా ఉద్యోగులకు ఎదురవుతుంటుంది. ఇలా పని ప్రదేశాల్లో అధికారాలను అడ్డు పెట్టుకుని జరుగుతున్న లైంగిక వేధింపులపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇంకా కొందరు అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి.
కార్పోరేట్ ఉద్యోగులందరూ ఒకేలా కాదు..
అయితే పని ప్రదేశంలో సంబంధాలు చాలా సంక్లిష్టమైనవి. ఉద్యోగుల పరిస్థితి, మనస్తత్వం, వ్యక్తిగత కారణాలపై ఆధారపడి ఉంటాయి. అన్నింటినీ ఒకేలా చూడటం సరికాదు. చాలామంది కార్పోరేట్ ఉద్యోగులు తమ పనేంటో చూసుకుని వెళ్లిపోతారు... కొందరు మాత్రమే ఇతర సంబంధాలతో కెరీర్ ను నాశనం చేసుకుంటారు. కాబట్టి 50శాతం కార్పోరేట్ ఉద్యోగులు వివాహేతర సంబంధాలను కలిగివుంటారే వాదన సరైనది కాదు.. ఇది మహిళల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నంగా భావించవచ్చు.

