Wife Psychology: భర్తతో తరచూ గొడవపడే భార్య గురించి సైకాలజీ ఏం చెప్తోందో తెలుసా?
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కానీ భార్య, భర్తతో ఎక్కువగా గొడవపడుతున్నప్పుడు.. చాలామంది ఆమె స్వభావాన్ని తప్పుపడుతారు. కానీ నిజంగా ఆమె గొడవల వెనుక కారణం ఏంటి? భార్యలు తరచూ భర్తలతో ఎందుకు గొడవపడతారు. అలాంటి వారి గురించి సైకాలజీ ఏం చెబుతోందో తెలుసా?

భర్తలతో గొడవపడే భార్యల సైకాలజీ
సాధారణంగా ఒక భార్య, భర్తతో తరచూ గొడవ పడుతుంటే.. “ఆమె స్వభావమే అంతా”, “సర్దుకోలేని వ్యక్తిత్వం” అంటూ తేలికగా లేబుల్ చేస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, తరచూ గొడవలు పడటం వెనుక కోపం లేదా మొండితనం మాత్రమే ఉండదు. చాలా సందర్భాల్లో అది లోతైన భావోద్వేగ అవసరాలు, అనుభవాలు, మానసిక ఒత్తిళ్ల ప్రతిఫలం కావొచ్చు. మనిషి ప్రవర్తన వారి అంతర్గత భావోద్వేగ స్థితికి అద్దం లాంటిదని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.
కోరుకున్నవి దక్కనప్పుడు..
సైకాలజీ ప్రకారం భర్తతో ఎక్కువగా వాగ్వాదానికి దిగే భార్యలో ప్రధానంగా కనిపించే అంశం “ఎమోషనల్ అన్‌ఫుల్ ఫిల్మెంట్”. ఆమె తన భర్త నుంచి తనను అర్థం చేసుకునే మాటలు, గౌరవం, శ్రద్ధ లేదా ప్రేమను ఆశిస్తుంది. అవి దక్కనప్పుడు ఆ లోటు మాటల రూపంలో, గొడవల రూపంలో బయటపడుతుంది. నిజానికి ఆమెకు కావాల్సింది గొడవ కాదు, భర్త తన మనసు తెలుసుకోవడం మాత్రమే.
నిర్లక్ష్యం, విమర్శలు
బాల్యంలో లేదా గత జీవిత అనుభవాల్లో నిర్లక్ష్యం, విమర్శలు, భయాలు ఎదుర్కొన్న అమ్మాయిలు.. సంబంధాల్లో ఎక్కువ సున్నితంగా స్పందిస్తారు. సైకాలజీలో దీన్ని “ఎమోషనల్ ట్రిగ్గర్స్” అంటారు. భర్త ఒక చిన్న మాట అన్నా, లేదా పట్టించుకోకపోయినా అది గతంలో తాను అనుభవించిన బాధలను గుర్తు చేసి తీవ్రంగా స్పందించేలా చేస్తుంది.
ఉనికిని చాటుకునే ప్రయత్నం
మరొక విషయం ఏంటంటే తనని తాను విలువైన వ్యక్తిగా భావించని కొందరు మహిళలు, లేదా తమ పాత్రను ఇంట్లో గుర్తించట్లేదని అనుకునే మహిళలు కూడా తరచూ గొడవల ద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారు. “నన్ను కూడా పట్టించుకోండి” అని వారిలో ఉండే భావన తెలియకుండానే భర్తతో గొడవలకు దారితీస్తుందని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.
ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే..
కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా ప్రధాన కారణం అవుతుంది. ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ, ఉద్యోగ భారం, ఆర్థిక సమస్యల వల్ల మహిళ మానసికంగా అలిసిపోతుంది. అలాంటి సమయంలో సరైన ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే, ఆ ఒత్తిడి భర్తపై కోపంగా బయటపడుతుంది. నిజానికి ఆమె కోపం భర్తపై కాదు.. పరిస్థితులపై ఉంటుంది. కానీ దగ్గరగా ఉన్న వ్యక్తి కాబట్టి.. భర్తపై ఆ కోపాన్ని చూపిస్తుంది.
కమ్యూనికేషన్ లోపం
భార్యా భర్తల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల కూడా కొన్నిసార్లు గొడవలు వస్తాయి. తన భావాలను ప్రశాంతంగా, స్పష్టంగా వ్యక్తపరచడం రాని మహిళలు, మాటల ద్వారా కాకుండా వాదనల ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి భార్య ఎందుకు గొడవపడుతోంది? అనుకునే బదులు.. ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. గొడవపడే భార్యను తప్పుబట్టడం కన్నా, ఆమె భావోద్వేగ స్థితిని అర్థం చేసుకోవడం అవసరం. పరస్పర గౌరవం, ఓపికతో వినే మనసు, స్పష్టమైన కమ్యూనికేషన్ ఉంటే భార్యాభర్తల మధ్య చాలా సమస్యలు తగ్గుతాయి.

