ప్రెగ్నెన్సీ సమయంలో నడవడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
గర్భాధారణ సమయంలో వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాలు బలోపేతం అవుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం పొందుతారు.

pregnancy
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. శరీర శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఇతరులతో పాటుగా గర్భిణులు కూడా కొన్ని సులువైన వ్యాయామాలను ఖచ్చితంగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వెన్నునొప్పి, అలసట వంటి అసౌకర్యాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు
గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం వల్ల గుండె, రక్త నాళాలు బలోపేతం అవుతాయి. మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం వల్ల ప్రెగ్నెన్సీ డయాబెటీస్, ప్రీక్లాంప్సియా, సిజేరియన్ డెలివరీ, వెన్నునొప్పి వంటి ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి.
గర్భిణీ స్త్రీలు చేయగలిగిన ఉత్తమ వ్యాయామాల్లో నడక ఒకటి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం.. ఒకవేళ మీరు గర్భిణులు అయితే ప్రతి వారం 150 నిమిషాలు పక్కాగా నడవండి. దీనివల్ల పిల్లల బరువు తక్కువగా ఉండే అవకాశం ఉండదు. ముందుగా డెలివరీ అయ్యే అవకాశం తగ్గుతుంది. గర్భస్రావం వంటి సంక్లిష్టతల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
pregnancy
అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ఎసిఒజి) ప్రకారం.. గర్భధారణ సమయంలో నడవడం, ఇతర సులువైన వ్యాయామాలు చేయడం వల్ల సిజేరియన్ డెలివరీ, ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మధుమేహం, ప్రీక్లాంప్సియా, ముందస్తు ప్రసవ ప్రమాదం తగ్గుతుంది.
అయితే గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కానీ నడక ఇమ్యూనిటీని పెంచడానికి మీకు సహాయపడుతుంది. మహిళల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడితే.. అది పుట్టబోయే బిడ్డను కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ఇలాంటి సమస్యలతో పోరాడటానికి మీకు నడక ఎంతో సహాయపడుతుంది.
pregnancy
డెలివరీ సమయం దగ్గరకొస్తున్న కొద్దీ.. ఆడవారిలో మానసిక ఒత్తిడి పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని సులువుగా తగ్గించుకోవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో నడవడం వల్ల ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు ఇది గర్భధారణను సౌకర్యవంతంగా చేయడానికి కూడా సహాయపడుతుంది.
గర్భిణులల్లో మలబద్ధకం సమస్య రావడం సర్వ సాధారణం. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం నడక. నడవడం వల్ల గర్భిణుల్లో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అయితే ఇందుకోసం వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది శిశువు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. నడక రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. గర్భిణులు స్త్రీలు తరచుగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు. దీనిని తగ్గించడానికి మీకు నడక సహాయపడుతుంది.