డెలివరీ తర్వాత బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇదిగో ఈ చిట్కాలు మీకోసమే..!
డెలివరీ తర్వాత పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్లే మీ బిడ్డకు కావాల్సిన పాలు ఉత్పత్తి అవుతాయి. అయితే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చాలా మంది విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. అయితే బిడ్డ పుట్టాక కొన్ని చిట్కాలను పాటిస్తే సులువుగా బరువు తగ్గొచ్చు.

ప్రెగ్నెన్సీ టైం లో పోషకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మంది బరువు పెరుగుతారు. అయితే డెలివరీ తర్వాత బరువ అలాగే ఉంటుంది. ఇక దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో శరీర బరువును సులువుగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డెలివరీ తర్వాత పోషకాహారాన్నే తినాల్సి ఉంటుంది. వీటివల్లే మీ బిడ్డకు కావాల్సిన పాలు ఉత్పత్తి అవుతాయి. అలాగే వారిని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు అందుతాయి. లేదంటే మీ బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. సరిగ్గా ఎదగలేరు కూడా.
డెలివరీ తర్వాత బెల్లీ ఫ్యాట్ ను కరిగించడం అంత సులువు కాదు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గాలంటే మాత్రం రోజూ మరువకుండా వ్యాయామాలు చేయాలి. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ఏమేం చేయాలంటే..
బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ముందుగా మీరు చేయాల్సిన పని మీ ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్ నే ఎక్కువగా తినండి. అలాగే చక్కెర పదార్థాలను తినడం మానేయండి. నూనెలో వేయించిన, ఫ్రైడ్ ఫుడ్స్ ను కూడా తినకండి. ఇవి మీ బెల్లీ ఫ్యాట్ ను మరింత పెంచుతాయి. వీటిని తగ్గిస్తేనే మీ పొట్టచుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
బరువు తగ్గాలనుకునేవారు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అన్నాన్ని తినడం చాలా వరకు తగ్గించాలి. దీనికి బదులుగా మీ ఆహారంలో కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి.
ఫైబర్ కంటెంట్ కూడా బరువు తగ్గడానికి సహాయపడతుంది. అందుకే మీరు తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఫైబర్ కంటెంట్ ఆకలిని నియంత్రిస్తుంది. అంటే వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.
గ్రీన్ టీ తాగితే కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ గ్రీన్ టీ లో కేలరీలు ఐదు కంటే తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ డ్రింక్ అనే చెప్పాలి. ఉదయాన్నే పరిగడుపున దీన్ని తాగితే ఆరోగ్యం బాగుంటుంది. బరువు కూడా త్వరగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
ప్రసవం తర్వాత చాలా మంది ఆడవారు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. కానీ నిద్రపోకపోతే బరువు విపరీతంగా పెరిగిపోతారని నిపుణులు చెబుతున్నారు. నిద్ర కు, బరువు పెరగడానికి మధ్య సంబంధం ఉందని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. కంటినిండా నిద్రపోకపోతే మీకు ఎక్కువగా ఆకలి అవుతుంది. దీంతో మోతాదుకు మించి తినే అవకాశం ఉంది. దీంతో మీరు బరువు పెరుగుతారు. సరిగా నిద్రపోని వ్యక్తుల్లో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడం చాలా కష్టం. అందుకే కనీసం 7 నుంచి 8 గంటలైనా నిద్రపోయేలా చూసుకోండి. వ్యాయామం లేకుండా బరువు తగ్గడం, బెల్లీ ఫ్యాట్ కరగడం అనేది అసాధ్యం. అందుకే బరువు తగ్గేందుకు చేయాల్సిన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయండి.