Parenting: పిల్లలకు రోజుకో కథ చెప్తే వారిలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
Parenting: పిల్లల భవిష్యత్ కోసం పేరెంట్స్ ఎంతగానో కష్టపడతారు. కానీ పిల్లల జీవితాన్ని మార్చగలిగే చిన్న చిన్న అలవాట్లను మాత్రం కొందరు పేరెంట్స్ మర్చిపోతుంటారు. నిపుణుల ప్రకారం రోజుకో కథ చెప్పడం వల్ల పిల్లల్లో వచ్చే అద్భుతమైన మార్పులేంటో ఇక్కడ చూద్దాం.

కథలు చెప్పడం వల్ల పిల్లల్లో వచ్చే మార్పులు
చాలామంది తల్లిదండ్రులు పిల్లల చదువు, ఆటలు, క్లాసులపై మాత్రమే ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు. కానీ ఒక చిన్న అలవాటును మాత్రం కొంతమంది పేరెంట్స్ మరిచిపోతున్నారు. అదే పిల్లలకు ప్రతిరోజూ ఒక కథ చెప్పడం. ఇది వినోదం కోసం చేసే పని మాత్రమే కాదు. దీనివల్ల చాలా లాభాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. రోజుకో కథ చెప్పడం వల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో వివరంగా తెలుసుకుందాం.
ఊహాశక్తి పెరగడం
కథలు పిల్లల ఊహాశక్తిని పెంచుతాయి. కథలో వచ్చే పాత్రలు, అడవులు, జంతువులు, రాజులు, సాధారణ మనుషులను పిల్లలు తమ మనసులో చిత్రాలుగా ఊహించుకుంటారు. ఈ ప్రక్రియ వారి సృజనాత్మకతను పెంచుతుంది. తద్వారా వారు బొమ్మలు గీయడం, కొత్త ఆలోచనలు చెప్పడం లేదా సమస్యలకు వినూత్న పరిష్కారాలు ఆలోచించడం వంటివి చేస్తుంటారు.
రోజూ కథలు వినే పిల్లల్లో భాషా పరిజ్ఞానం కూడా వేగంగా పెరుగుతుంది. కొత్త పదాలు, వాక్య నిర్మాణం, సరైన ఉచ్చారణ, భావాన్ని వ్యక్తపరిచే తీరు సహజంగానే అలవడతాయి. పుస్తకాలు చదవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఇది వారికి బాగా ఉపయోగపడుతుంది.
నైతిక విలువలు
కథలు పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నిజాయతీ, దయ, సహాయం చేసే గుణం, క్రమశిక్షణ, బాధ్యత, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలను నేరుగా బోధించడం కంటే, ఒక మంచి కథ ద్వారా చెప్పినప్పుడు పిల్లలు వాటిని ఈజీగా అర్థం చేసుకుంటారు. కథలో హీరో చేసిన మంచి పని లేదా విలన్ చేసిన తప్పు ద్వారా ఏది సరైంది, ఏది తప్పు అనే అవగాహన వారికి సహజంగా ఏర్పడుతుంది.
అలాగే భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా కథల ద్వారా పెరుగుతుంది. కథలో ఒక పాత్ర బాధపడితే, సంతోషపడితే లేదా భయపడితే పిల్లలు కూడా ఆ భావాలను అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల ఇతరుల భావాలను గౌరవించడం, సానుభూతితో ఆలోచించడం వంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
బంధం మరింత బలంగా..
రోజూ కథ చెప్పడం వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం మరింత బలపడుతుంది. కథ చెప్పే సమయంలో మొబైల్, టీవీ వంటి డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండి ఒకరితో ఒకరు సమయం గడుపుతారు. ఈ కాస్త సమయం పిల్లలకు భద్రత, ప్రేమ, ఆప్యాయత అనే భావాలను కలిగిస్తుంది.
కథలు వినే పిల్లల్లో ఏకాగ్రత మెరుగుపడుతుంది. ఒక కథను పూర్తిగా వినాలంటే శ్రద్ధగా వినడం అవసరం. ఈ అలవాటు క్రమంగా చదువులో కూడా ఉపయోగపడుతుంది. పాఠాలను వినడం, అర్థం చేసుకోవడం, గుర్తుంచుకోవడం వంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఈ అలవాటు ఏర్పడితే, అది వారి చదువుకు మంచి బలం అవుతుంది.
ప్రశాంతమైన నిద్ర
స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉన్న ఈ కాలంలో కథలు ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. నిద్రకు ముందు మొబైల్ లేదా టీవీ చూడడం బదులుగా కథ వినడం వల్ల పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతారు. కళ్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, మెదడు కూడా రిలాక్స్ అవుతుంది. దీనివల్ల నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంటుంది.
అయితే కథలు చెప్పేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. పిల్లల వయసుకు తగిన కథలు ఎంచుకోవాలి. భయపెట్టే లేదా హింసను ఎక్కువగా చూపించే కథల కంటే కూడా ప్రేరణ కలిగించే, సరదాగా ఉండే, విలువలను నేర్పే కథలను చెప్పడం మంచిది. కథ చెప్పడం పూర్తయ్యాక "ఈ కథలో నీకు ఏం నచ్చింది?", "నువ్వు ఆ ప్లేస్ లో ఉంటే ఏం చేసేవాడివి?" వంటి చిన్న ప్రశ్నలు అడిగితే పిల్లల్లో ఆలోచనా శక్తి మరింత పెరుగుతుంది.

