Overthinking Psychology: ఎప్పుడూ ఆలోచనల్లో మునిగిపోయే వారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా?
కొంతమంది బయటకు నార్మల్ గా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. జరిగిన విషయాన్నే మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటారు. లేదా జరగబోయే విషయాల గురించి ఆందోళన పడుతుంటారు. ఇలా ఓవర్ గా ఆలోచించే వాళ్ల గురించి సైకాలజీ ఏం చెప్తోందో తెలుసా ?

Psychology About Overthinkers
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే ప్రధాన మానసిక సమస్యల్లో ఓవర్ థింకింగ్ ఒకటి. చిన్న విషయం నుంచి పెద్ద నిర్ణయం వరకు, గతంలో జరిగిన సంఘటనల నుంచి భవిష్యత్తులో జరగవచ్చని ఊహించే పరిస్థితుల వరకు ఎన్నో ఆలోచనలు వీరి మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఇలా ఎక్కువగా ఆలోచించే వారి గురించి సైకాలజీ ఏం చెప్తోందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మానసిక ఒత్తిడికి..
సైకాలజీ ప్రకారం, ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు సాధారణంగా చాలా సున్నితమైన, విశ్లేషణాత్మక స్వభావం కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని, ఏ చిన్న తప్పు కూడా జరగకూడదని భావిస్తారు. ఈ లక్షణం కొన్నిసార్లు వారిని తెలివైనవారిగా, ముందుచూపు ఉన్నవారిగా మార్చినా, అదే సమయంలో మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతుంది.
గత అనుభవాలు
మానసిక నిపుణుల ప్రకారం, ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఆందోళన, భయంతో ముడిపడి ఉంటుంది. గతంలో ఎదురైన చేదు అనుభవాలు, విమర్శలు, అపజయాల వంటివి మనసులో ముద్రపడితే, మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో మెదడు అధికంగా ఆలోచించడం ప్రారంభిస్తుంది. ఇది ఒక రకంగా మనసు తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసినట్లే. కానీ ఈ ప్రయత్నమే చివరికి మనసును అలసిపోయేలా చేస్తుంది.
నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది
ఎక్కువగా ఆలోచించే వారు సాధారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారని సైకాలజీ చెబుతుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు అన్ని అవకాశాలు, ఫలితాలు, నష్టాలు, లాభాలు అన్నింటినీ తూకం వేసే ప్రయత్నంలో వీరు చిక్కుకుపోతారు. సైకాలజీలో దీన్నిఅనాలిసిస్ పెరాలిసిస్ అంటారు. అంటే, ఎక్కువగా విశ్లేషించడం వల్ల ఏ నిర్ణయమూ తీసుకోలేని స్థితి ఏర్పడటం. దీనివల్ల సమయం వృథా అవుతుంది, అవకాశాలు చేజారిపోతాయి, చివరికి ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది.
తమను తాము నిందించుకోవడం
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎక్కువగా ఆలోచించేవారు తమతో తాము కఠినంగా వ్యవహరిస్తారు. వారు చేసిన చిన్న తప్పును కూడా పెద్దదిగా భావిస్తారు. “నేను అలా చేసి ఉండకూడదు”, “నాకే ఇలా ఎందుకు జరిగింది” అంటూ తమను తాము నిందించుకుంటారు. దీర్ఘకాలంలో ఇది డిప్రెషన్, నిద్రలేమి, మానసిక అలసటకు దారి తీస్తుంది.
పూర్తిగా ప్రతికూలం కాదు
సైకాలజీ ప్రకారం ఎక్కువగా ఆలోచించడం పూర్తిగా ప్రతికూలం కాదు. సరైన నియంత్రణ ఉంటే ఇదే లక్షణం వ్యక్తిని క్రియేటివ్ గా, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉన్నవాడిగా మార్చుతుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించే వారు బలహీనులు కాదు. వారు లోతుగా ఆలోచించే శక్తి ఉన్నవారు. కానీ ఆ శక్తిని సరైన దిశలో ఉపయోగించకపోతే, అదే వారి శత్రువుగా మారుతుంది.

