Telugu Proverb: ‘పండగ పూట పాత మొగుడేనా’..
మనం చాలా సామెతలు వింటుంటాం. చిన్ననాటి నుంచి మన పెద్దలు, ఇరుగుపొరుగు వారు రకకరాల సామెతలను చెబుతుంటారు. చిన్నగా సింపుల్‌గా ఉండే సామెతల్లో ఎంతో అర్థం దాగి ఉంటుంది. వందల పదాల్లో కూడా చెప్పలేని భావాన్ని ఒక చిన్న లైన్ సామెతలో చెప్పొచ్చు. ఇలాంటి సామెతల్లో ఒకదాని గురించి, దాని వెనకాల ఉన్న అసలు అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

‘పండగ పూట పాత మొగుడేనా’ ఈ సామెత గురించి మనలో ప్రతీ ఒక్కరం వినే ఉంటాం. కాస్త డార్క్ షేడ్‌తో కూడుకుని ఉండే ఈ సామెతను తరచూ ఉపయోగిస్తుంటారు. పండరోజైనా కాస్త కొత్తగా ఉండొచ్చు కదా అన్న అర్థం వచ్చేందుకు ఈ సామెతను ప్రయోగిస్తుంటారు. అయితే మనం ఇన్నేళ్లుగా వింటున్న ఈ సామెత అసలు కరెక్ట్ కాదని మీలో ఎంత మందికి తెలుసు.?
అవును మీరు విన్నది నిజమే.. అసలు ‘పండగ పూట పాత మొగుడేనా’ అనే సామెతే లేనే లేదు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్న ఈ సామెత వాడకంలోనే లేదు. హిందూ సంప్రదాయానికి, ఆ మాటకొస్తే నైతిక విలువలకు వ్యతిరేకంగా ఉన్న ఈ సామెత మనం పొరపాటుగా పలకడం ద్వారా ఇలా స్థిరపడిపోయింది.
పండగ పూట కొత్త మొగుడు కావాలి” అన్న అర్థం వచ్చేలా ఉన్న ఈ సామెత శుద్ధ అబద్ధం. ఇంతకీ అసలు సామెత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సామెత అసలు.. పండగ పూట పాత మడుగేనా. ఒకసారి మళ్లీ బాగా చదవండి. మొగుడేనా కాదు, మడుగేనా.. అయితే కాలక్రమేణ మడుగేనా అన్న పదం మొగుడేనా అన్నట్లు మారింది. నిజానికి మడుగు అంటే వస్త్రం అని అర్థం. కాబట్టి పండగ రోజు కూడా పాత దుస్తులే ధరిస్తారా.? కొత్త దుస్తులు ధరించవచ్చు కదా అన్న అర్థం వచ్చేలా దీనిని ఉపయోగిస్తూ వచ్చారు.
అయితే మడుగు అన్న పదానికి చాలా మందికి అర్థం తెలియకపోవడం, సరిగ్గా పలకలేకపోవడం కారణంతో మడుగును కాస్త మొగుడుగా మార్చేశారు. ఇదండీ ఈ సామెత వెనకాల ఉన్న అసలు అర్థం. కాబట్టి ఇక నుంచైనా ఈ సామెతను సరిగ్గా పలకడం అలవాటు చేసుకుందాం, మన సంప్రదాయలను కాపాడుకుందాం.