ఒక చెంచా పెరుగుతో ముఖాన్ని, జుట్టును ఇలా సులువుగా షైనీగా మార్చేసుకోండి
Curd for Hair: ఇంట్లో ఉన్న పెరుగుతోనే చర్మం, జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. మీ ముఖాన్ని, జుట్టును మెరిపించేందుకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగుతో చేసే రెమెడీల గురించి తెలుసుకోండి.

పెరుగును ఇలా వాడొచ్చు
పెరుగు తింటే ఎంత ఆరోగ్యమో… ముఖం, జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా అంతే మంచిది. ఎందుకంటే పెరుగులో ఎన్నో పోషకాలు ఉంటాయిి. ఇవి చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పెరుగును ఉపయోగించి జుట్టుకు, ముఖానికి ఎలా వాడాలో తెలుసుకోండి. దీనివల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ ఇచ్చాము.
ముఖానికి పెరుగు
ముఖానికి మెరుపు ఇచ్చేందుకు పెరుగు ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో కప్పు పెరుగు తీసుకుని, అందులో చిటికెడు పసుపు, కొద్దిగా శనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం మెరిసిపోవడం ఖాయం.
పెరుగు స్క్రబ్
జిడ్డు చర్మం ఉన్నవారికి పెరుగుతో చేసిన స్క్రబ్ చాలా మంచిది. ఈ స్క్రబ్ చేయడానికి, పెరుగులో బియ్యం పిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించి, నెమ్మదిగా మసాజ్ చేయాలి. కాసేపు ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
జిడ్డు చర్మం ఉన్నవారు రోజూ ముఖానికి పెరుగును ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, ముఖ సమస్యలు ఉన్నవారికి పెరుగు చాలా మంచిది. పెరుగు చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
జుట్టుకు పెరుగు వాడకం
తలస్నానం చేసేటప్పుడు షాంపూకి ముందు జుట్టుకు పెరుగు బాగా పట్టించాలి. దీనివల్ల జుట్టుకు ప్రోటీన్ అందుతుంది. ముఖ్యంగా పొడి జుట్టు ఉన్నవారికి పెరుగు చాలా మంచిది. పెరుగు జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.
జుట్టుకు ఇంకెన్నో ప్రయోజనాలు
జుట్టు కోసం ఖరీదైన షాంపూలకు బదులుగా పెరుగును ఉపయోగించడం అన్ని విధాలా ఉత్తమం. ఇది జుట్టును మృదువుగా మార్చడమే కాకుండా, తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన చిట్కాలను పాటించండి. మీకు మంచి మార్పులు కనిపిస్తాయి.