Covid 19: కోవిడ్ తర్వాత చాలా మందిలో ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..
Covid 19: కరోనా కేవలం సోకినప్పుడు మాత్రమే కాదు.. దాని నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా కాలం పాటు దాని సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు.

covid
కనిపించని కరోనాతో ఇప్పటికీ ప్రపంచ దేశాల పోరాటం చేస్తూనే ఉన్నాయి. కాగా కొంతకాలం తర్వాత మన దేశంలో కూడా కోవిడ్ -19 కేసులు (Covid 19) మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
covid 19
భారతదేశంలో కోవిడ్ -19 యొక్క నాల్గవ వేవ్ ఎప్పుడైనా స్టార్ట్ కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ.. రోజువారీ కోవిడ్ -19 గణాంకాలు.. మూడు నెలల్లో మొదటిసారి 4,000 మార్కును దాటాయి. కోవిడ్ మరణాలు కూడా పెరిగినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. కేరళతో పాటు, మహారాష్ట్ర కూడా కోవిడ్ గణాంకాల్లో ముందంజలో ఉంది.
కోవిడ్ -19 కేవలం రోగులకు సోకినప్పుడు మాత్రమే కాదు..దాని నుంచి బయటపడ్డ తర్వాత కూడా జనాలను పట్టి పీడిస్తోంది. అంటే దీని సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఈ పరిస్థితిని లాంగ్ కోవిడ్ అంటారు. ఈ ఆరోగ్య సమస్యలు వారాల నుంచి నెలలు, సంవత్సరాల వరకు కూడా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్ నుంచి బయటపడ్డవారు ఆ తర్వాత ఈ నాలుగు దీర్ఘకాలిక సమస్యలను ఫేస్ చేస్తున్నారు.
1. అన్ని వైరల్ వ్యాధుల లక్షణాలలో అలసట ఒకటి. ఇది కోవిడ్ లక్షణంగా కూడా ఉంది. కానీ కోవిడ్ తర్వాత కూడా ఇది చాలా కాలం ఉంటుంది. దీంతో శరీరం చాలా అలసిపోతుంది. దీని వల్ల ఎలాంటి పనులను చేయలేరు. ఎప్పుడూ పడుకోవాలనే అనిపిస్తుంది. రోజు వారి పనులను చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. విషయాలను అర్థం చేసుకోలేరు. ఆలోచించలేరు. విషయాలను గుర్తుంచుకోకపోవడం వంటి సమమస్యలు ఎదురవుతాయి.
2. కోవిడ్ నుంచి కోలుకున్న వారు చాలా మందికి నిద్ర సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత దీర్ఘకాలిక కోవిడ్ లో సాధారణంగా నివేదించబడిన సమస్యలలో నిద్ర సమస్యలు ఒకటి. వీరికి తగినంత నిద్ర రాకపోవడం, గాఢంగా నిద్రపట్టపోవడం, నిద్రపోయినా.. ఉన్నట్టుండి అకస్మత్తుగా మేల్కొవడం వంటి సమస్య వల్ల వీరు నిద్రలేమి సమస్యలను ఫేస్ చేస్తున్నారు.
3. కోవిడ్-19 అనేక అవయవాలను ప్రభావితం చేస్తుందని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కాగా దీనివల్ల ఊపిరితిత్తులు కూడా కొద్దిగా ప్రభావితమవుతాయి. కరోనా నుంచి కోలుకున్నాక చాలా మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య కొన్నిసార్లు దీర్ఘకాలం పాటు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీళ్లు సాధారణంగా ఎక్కువ దూరం నడవలేకపోవడం, వ్యాయామం చేయలేకపోవడం, రోజువారీ పనులను చేసేటప్పుడు అలసిపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి.
4. కోవిడ్-19 కేవలం శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సును కూడా ప్రభావితం చేస్తుందని మనందరికీ తెలుసు. దీర్ఘకాలిక కోవిడ్ -19 లో భాగంగా ప్రజలలో నిరాశ, ఆందోళన ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. చైనాలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం కూడా దీనిని నొక్కి చెప్పింది.
ఈ విధంగా దీర్ఘకాలిక కోవిడ్ సమస్యలు రోజువారీ జీవితాన్ని బాధించే సమస్యగా మారితే.. పరిష్కారం కోసం నిపుణుల సహాయం తీసుకోవచ్చు. నిద్ర సమస్యలు, నిరాశ, ఆందోళన మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి చికిత్స తీసుకోవచ్చు. ఆహారం, జీవనశైలిని మెరుగుపరచడం ద్వారా కూడా అలసట నుంచి బయటపడొచ్చు.