Father's Day: తండ్రి త్యాగం, కూతురి ప్రేమకు నిదర్శనం..!
ప్రతి సంవత్సరం మనమందరం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాం. అసలు, దీని వెనక ఉన్న కథేంటో తెలుసా?

ఫాదర్స్ డే
తల్లి కడుపున పెట్టుకొని 9 నెలలు మోస్తే, తండ్రి మాత్రం జీవితాంతం భుజాలపై మోస్తూనే ఉంటాడు. ప్రతి పిల్లవాడి జీవితం సవ్యంగా సాగాలి అంటే, తల్లి ఎంత ముఖ్యమో, తండ్రి కూడా అంతే ముఖ్యం. పిల్లలకు మార్గదర్శిగా, మొదటి స్నేహితుడిగా, తండ్రి ఎన్నో విషయాల్లో ఆదర్శంగా నిలుస్తారు.
ప్రేమ అంటే తల్లి గుర్తుకు వస్తే, త్యాగం అంటే తండ్రి గుర్తుకు వస్తాడు. వారి త్యాగాన్ని, అంకిత భావాన్ని, వ్యక్తపరచలేని బాధలను గుర్తు చేసుకునేందుకే ప్రతి సంవత్సరం ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం.
జూన్ 3వ ఆదివారం
ప్రతి జూన్ నెలలో 3వ ఆదివారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటారు. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఇండియాతో పాటు యూరప్, ఆసియా దేశాల్లో తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 15న తండ్రుల దినోత్సవం వచ్చింది.
తండ్రుల దినోత్సవం ఎలా వచ్చింది?
20వ శతాబ్దం ప్రారంభంలో తండ్రుల దినోత్సవాన్ని జరుపుకునే సంస్కృతి ఆరంభమైంది. వాషింగ్టన్‌కు చెందిన సోనోరా ఈ దినోత్సవానికి కారణం. 1910లో తన తండ్రిని గౌరవించే ఉద్దేశంతో తండ్రుల దినోత్సవాన్ని ప్రారంభించింది. తన తండ్రి త్యాగాన్ని ప్రపంచం తెలుసుకోవాలని, ప్రపంచంలోని ప్రతి తండ్రిని గౌరవించాలని ఆమె భావించింది. సోనోరా తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ ఒక పౌర యుద్ధ వీరుడు. భార్య మరణించిన తర్వాత ఆయన ఆరుగురు పిల్లలను ఒంటరిగా పెంచారు. పిల్లలకు తల్లి లేని లోటు తెలియకుండా ప్రేమను పంచారు. అతని ప్రేమ, శ్రద్ధే ఆయన కూతురును ఆలోచింపజేసింది. తన తండ్రిని గౌరవించేందుకు తండ్రుల దినోత్సవాన్ని ప్రారంభించింది.
ఎందుకు జూన్ నెల?
సోనోరా స్మార్ట్ డాడ్ తండ్రుల దినోత్సవాన్ని తన తండ్రి పుట్టినరోజైన జూన్ 5న జరుపుకోవాలని కోరింది. కానీ దీన్ని జూన్ నెల 3వ ఆదివారానికి మార్చారు. దీనివల్ల చర్చిలు ప్రార్థనలు చేసేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని చెబుతారు.
ప్రత్యేక దినం
తల్లి ప్రేమను గౌరవించుకునేందుకు అమ్మల దినోత్సవాన్ని జరుపుకున్నట్లే తండ్రుల దినోత్సవాన్ని కూడా చాలా సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు. 1914లో దీన్ని అధికారికంగా గుర్తించారు. ఇది తండ్రులకు ప్రత్యేకమైన దినం. మొదటిసారిగా 1910, జూన్ 19న స్పోకేన్‌లో తండ్రుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం జూన్ నెల 3వ ఆదివారం ఎంచుకోవడం అమెరికా సంప్రదాయం.
అధికారిక గుర్తింపు ఎప్పుడు?
అమెరికా జూన్ నెలలో తండ్రుల దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయాన్ని ప్రారంభించింది. దీన్ని అనుసరించి చాలా దేశాలు ఒకే తేదీన జరుపుకోవడం మొదలుపెట్టాయి. కొన్ని దేశాలు వారి స్వంత సంప్రదాయాలను అనుసరించి వేర్వేరు తేదీల్లో జరుపుకుంటున్నాయి.
1966లో అమెరికా అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ తండ్రులను గౌరవించే ఉద్దేశంతో మొదటి అధ్యక్ష ప్రకటన విడుదల చేశారు. జూన్ నెల 3వ ఆదివారాన్ని తండ్రుల దినోత్సవంగా నిర్ణయించారు. ఆ తర్వాత 1972లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అధికారికంగా ప్రకటనపై సంతకం చేశారు. దీంతో అమెరికాలో తండ్రుల దినోత్సవం శాశ్వత జాతీయ సెలవుదినంగా మారింది.