Father's Day: నాన్న కోసం గిఫ్ట్ కాదు.. ఈ ఒక్కరోజైనా ఇలా చేయండి.!
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన అవసరాల గురించే ఆలోచించే నాన్న ప్రేమను చాలా మంది అర్థం చేసుకోరు. ఆయన కృషిని అస్సలు గుర్తించరు.

Father's Day
పిల్లలందరికీ తమ తల్లిదండ్రులపై ప్రేమ ఉంటుంది. కానీ.. తల్లితో ఉన్న చనువు తండ్రి దగ్గర ఉండదు. తల్లిని ఏదైనా కావాలి అని అడిగే హక్కు, స్వేచ్ఛ.. తండ్రి దగ్గర ఉండదు. ఎందుకు అంటే..‘నాన్న మంచివాడే కానీ, కోపం ఎక్కవ.ఏది చేసినా కోప్పడతాడు. అన్నింటికీ స్ట్రిక్ట్ గా ఉంటాడు’ ఇలా చాలా కారణాలు చెబుతూ ఉంటారు. కానీ..మనల్ని కడుపున మోసేది తల్లి అయినా జీవితాంతం నాన్న మనల్ని భుజాలపై మోస్తాడు.
నాన్నకు ప్రేమతో..
మన జీవితానికి నాన్న ఒక దిక్సూచి లాంటివాడు. మనకు ప్రతి విషయంలోనూ భద్రత కల్పించే వ్యక్తి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన అవసరాల గురించే ఆలోచించే నాన్న ప్రేమను చాలా మంది అర్థం చేసుకోరు. ఆయన కృషిని అస్సలు గుర్తించరు. కానీ, ఫాదర్స్ డే రాగానే.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. కానీ, అలా కాకుండా.. ఈ ఫాదర్స్ డే రోజు అయినా.. మీ నాన్న ప్రేమను గుర్తించి వారి కోసం కొన్ని పనులు చేయండి. మరి ఈ ఫాదర్స్ డే (జూన్ 15) రోజున పిల్లలు..తమ తండ్రి కోసం ఏం చేయాలో చూద్దామా..
1.తండ్రిపై ఉన్న ప్రేమను ఇలా తెలియజేయండి...
తండ్రిపై ప్రేమ ఉన్నా, ఆయనతో చెప్పడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. కేవలం వాట్సాప్, ఫేస్ బుక్ లో ఫోటోలు, స్టేటస్ లతో సరిపెడుతూ ఉంటారు. అలా కాకుండా.. మీ చేతితో మీ నాన్న పై ఉన్న ప్రేమను ఓ లేఖ రూపంలో రాయండి. చిన్నతనం నుంచి నాన్న కు చెప్పాలి అనుకొని చెప్పలేకపోయిన విషయాలను అందులో ఉంచితే చాలు. ఆయన కోసం మీరు గర్వపడే విషయాలు, మీరు ఆయనతో గడిపిన ప్రత్యేక క్షణాలు… ఇలా నాన్న హృదయాన్ని తాకే మాటలతో చిన్న లేఖ రాయండి. అది ఆయనకు జీవితాంతం గుర్తుండే బహుమతి అవుతుంది.
2. ఆశ్చర్యపరిచే బహుమతి ఇవ్వండి
బహుమతి ఖరీదైనదై ఉండాల్సిన అవసరం లేదు. మీ నాన్నకు అవసరమైన చిన్న చిన్న వస్తువులు..ఒక మంచి డైరీ, పుస్తకం, ఓ క్లాసిక్ పెన్, చేతితో తయారుచేసిన కప్పు లాంటి సాధారణమైనవైనా — ఆయనను ఆనందింపజేస్తాయి. ఇది మీరు ఆయన అభిరుచిని గమనిస్తారన్న సంకేతం.
3. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోండి
ఫాదర్స్ డే రోజున మీ నాన్నతో కలిసి కూర్చుని, పాత ఫోటోల ఆల్బమ్ తెరిచి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేయండి. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తించాలి.ఇవి మీరిమధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయి.
4. వారితో సమయం గడపండి
ఈ ప్రత్యేక రోజున పనుల్ని పక్కన పెట్టి, మీ నాన్నతో సమయం గడపండి. ఆయనకు ఇష్టమైన పని చేయండి — ఉదాహరణకి, ఆయనతో కలిసి క్రికెట్ చూడండి, కలసి వాకింగ్ చేయండి, కాఫీ తాగండి లేదా ఒక చిన్న టూర్ ప్లాన్ చేయండి.
5. నాన్న చేసే పనులు మీరు చేయండి
నాన్న నిత్యం చేస్తున్న పనుల నుంచి ఒక్కరోజు అతనికి విశ్రాంతినివ్వండి. ఇంటి కొన్ని బాధ్యతలు (బిల్లు చెల్లింపు, బజారు వెళ్లడం, తను చేసే పనులు) మీరే చేపట్టండి. ఇది చిన్న విషయం అనిపించవచ్చు కానీ, ఆయనను ఎంతో సంతోషపెడుతుంది.
ఫైనల్ గా...
ఫాదర్స్ డే అనేది ఖరీదైన బహుమతుల కన్నా ఎక్కువ. అది మన ప్రేమను వ్యక్తపరచే రోజు. ఒక్క రోజు అయినా మన తండ్రిని స్పెషల్‌గా భావించండి. మీరు చేసే చిన్న పని, చెప్పే చిన్న మాట ,ఆయన హృదయాన్ని తాకుతాయి.