Chia Seeds: ఈ 4 ఆరోగ్య సమస్యలు మీకుంటే చియా సీడ్స్ దూరం పెట్టాల్సిందే
Chia Seeds: చియా విత్తనాల్లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. కానీ కొన్ని సమస్యలు ఉన్న వారు మాత్రం వీటిని తినకూడదు.

చియా విత్తనాలు ఆరోగ్యానికి మంచివే కానీ..
చిన్నగా కనిపించే చియా విత్తనాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. నీటిలో నానబెట్టిన చియా విత్తనాలు ఉబ్బి ఎక్కువసేపు ఆకలి వేయకుండా అడ్డుకుంటాయి. వాటిని తినడం వల్ల బరువు కూడా తగ్గుతాము. చియా విత్తనాల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల జీర్ణక్రియను మెరుగుపడడంతో పాటూ, గుండె ఆరోగ్యానికి, బరువును నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. అయితే చియా విత్తనాలు అందరికీ పడవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు చియా విత్తనాలకు దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
లోబీపీ ఉన్నవాళ్లు
అధికరక్తపోటుతో పాటూ తక్కువ రక్తపోటు ఉన్నవాళ్లు కూడ జాగ్రత్తగానే ఉండాలి. లోబీపీతో బాధపడేవారు చియా విత్తనాలను ఆహారంలో చేర్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చియా విత్తనాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మీకు ఇప్పటికే రక్తపోటు తక్కువగా ఉంటే, చియా విత్తనాలు తినడం వల్ల అది మరింత తీవ్రమవుతుంది. మీకు తలతిరగడం, బలహీనత లేదా అలసట కలగవచ్చు.
పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు
పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు చియా విత్తనాలు తినడం ఏమాత్రం మంచిది కాదు. వీరికి కడుపులో అల్సర్లు, అసిడిటీ, అధిక గ్యాస్ వంటి జీర్ణ సమస్యలుంటే చియా విత్తనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటిని వారి సమస్య మరింత పెరుగుతుంది కానీ తగ్గదు. చియా విత్తనాలు తీసుకోవడం వల్ల వీరికి మరిన్ని సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉంది.
రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడేవారు
కొందరు కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతూ ఉంటారు. అలాంటి వారు చియా విత్తనాలను తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని మరింత పలుచగా చేస్తాయి. ఆస్పిరిన్ లాంటి మందులు వాడేవారు కూడా చియా విత్తనాలు తింటే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీరేవరూ కూడా చియా విత్తనాలు తినకూడదు.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. వారు చియా విత్తనాలు తినడం ఏమాత్రం మంచిది కాదు. చియా విత్తనాల్లో పొటాషియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలపై అదనపు భారాన్ని మోపుతాయి. దీని వల్ల కిడ్నీలకు మరింత సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వీరు చియా విత్తనాలను దూరంగాప పెట్టాల్సిందే.

