Telugu Samethalu: ఆయనే ఉంటే మంగలి ఎందుకు.. ఈ సామెత వెనుక అసలు కథ ఇదే
Telugu Samethalu: మన తెలుగు భాషలో సామెతలు ఎక్కువే. ఆ సామెతల వెనుక ఎన్నో జీవిత కథలు, బాధలు, అనుభవాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఆయనే ఉంటే మంగలి ఎందుకు అనే సామెత కూడా ఒకటి. దీని వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

సామెత వెనుక కథ
ఎవరైనా అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటే ఆయనే ఉంటే మంగలి ఎందుకు అనే సామెత ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. దీని వెనుక పూర్వకాలంలో ఉన్న పరిస్థితులే కారణం. ఆ పరిస్థితుల వల్లే ఈ సామెత పుట్టిందని చెబుతారు. పూర్వం బాల్యవివాహాలు అధికంగా జరిగేవి. చిన్నవయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు. కానీ వారి భర్తలకు మాత్రం వయసు ఎక్కువగా ఉండేది. దీంతో ఎక్కువ వయసు ఉన్న భర్తలు... భార్యల కన్నా ముందుగానే మరణించేవారు. దీనివల్ల ఎంతో మంది మహిళలు చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి వితంతువుగా మారిపోయేవారు.
అదొక ఆచారం
పూర్వకాలంలో ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో వితంతువులపై ఎన్నో కఠినమైన నియమాలు ఉండేవి. వితంతువులు తెల్ల రంగు చీరలే కట్టుకోవాలని, పూలు పెట్టుకోకూడదని, ఆభరణాలు ధరించకూడదని, బొట్టు పెట్టుకోకూడదని, తలపై జుట్టు కూడా ఉండకూడదు అని నియమాలు పెట్టేవారు. దీనివల్ల ప్రతినెలా వితంతువులు గుండు చేయించుకోవాల్సి వచ్చేది. ఇది వారికి ఇష్టం లేకపోయినా సమాజం విధించిన కట్టుబాట్లను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు అంటే వీధికో సెలూన్ ఉంది. అప్పట్లో మాత్రం మంగలి వీధి వీధి తిరుగుతూ అవసరమైన వారికి గుండు చేసేవాడు.
ఇలా పుట్టింది
ఓసారి ఒక వితంతు మహిళకు గుండు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంగలి ఆ వీధి చివరన ఎక్కడో ఉన్నాడని ఆమెకి తెలుస్తుంది. దీంతో ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్లి పిలిచే పరిస్థితి లేదు. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి పక్కింటి అబ్బాయిని పిలిచి ‘బాబూ ఆ వీధి చివర ఉన్న మంగలి ఉన్నడట.. మా ఇంటికి రమ్మని పిలవవా’ అని అడుగుతుంది. దానికి ఆ అబ్బాయి విసుక్కుంటూ ‘నాకు ఖాళీ లేదు. మీ ఆయనకు ఆ పని చెప్పు’ అని అంటాడు. దానికి ఆ మహిళ ‘ఆయన ఉంటే మంగలి ఎందుకు’ అని అంటుంది. అంటే భర్త ఉంటే ఆమెకు గుండు చేయించుకోవాల్సిన పరిస్థితి లేదు కదా అని చెప్పడమే. ఎలాంటి అనవసర సలహాలు ఇవ్వద్దని కూడా ఈ సామెత అర్థం. ఈ సంఘటన అలా ఒక సామెతగా మారిపోయింది. ఈరోజు మనం ఆ సామెతను అనేక అర్థాలలో వినియోగిస్తున్నాము.

