మహిళలూ.. మీలో ఈ లక్షణాలు గమనించారా? లేదా?
ఇంటి పనులు, ఆఫీసు పనులు, పిల్లల సంరక్షణ అంటూ అనేక పనులతో తలమునకై తమ ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోరు ఆడవారు. ఇంటిపట్టునుండే ఆడవారి నుంచి మొదలు పెడితే ఆఫీసులకు వెళ్లే వారు కూడా పూర్తిగా తమ ఆరోగ్యాన్ని గాలికివదిలేస్తున్నారు. మాకేమైంది అంటూ ఆరోగ్యం పట్ల కేరింగ్ లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది ఆడవారు ఇంట్లోని అందరి బాగోగులను చూస్తూ వారి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కానీ.. తమ ఆరోగ్యం ఎట్లుంది అనేది ఎవ్వరూ పట్టించుకోరు. అంతెందుకు నాకేమైందని తేలిగ్గా జవాబిస్తుంటారు. అందులోనూ జ్వరం వచ్చినా, దగ్గు, జలుబు చేసినా..అదే తగ్గుతుందంటూ వాటిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. అందులో ఉద్యోగినులైతే పూర్తిగా తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. ఒక వైపు ఇంటి పనులు, మరో వైపు ఆఫీసు పనుల్లో పూర్తిగా మునిగిపోయి..తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇదే మిమ్మల్ని ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే భవిష్యత్ లో వచ్చే ప్రమాదకరమైన వ్యాధులకు సూచికగా మీ శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. వాటిని మీరు ముందే గుర్తిస్తే.. వాటి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. అవేంటంటే..
హఠాత్తుగా మీ బరువులో మార్పులు కన్పిస్తే అది తీవ్ర అనారోగ్య సమస్యే అని గుర్తించాలి. ఉన్నట్టుండి బరువు తగ్గినా, పెరిగినా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటికి కారణం మీ జీవన శైలిలో, మీ ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. అందులోనూ బరువులో ఇలాంటి మార్పులు కనిపిస్తే హార్మోన్లు హెచ్చు తగ్గులు అవడం, హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం పొంచి ఉంది.
hair falling
రోజుకు వంద వరకు వెంట్రుకలు రాలడం సాధారణ విషయమే. కానీ అంతకంటే ఎక్కువ జుట్టు రాలితే ప్రమాదమే. ఎందుకంటే ఇలా జుట్టు విపరీతంగా రాలితే.. థైరాయిడ్ సమస్యలు, ఆటోఇమ్యూన్ డిజార్డర్లు , విటమిన్ లోపాలు ఏర్పడ్డాయని అర్థం చేసుకోవాలి.
రోజంతా ఎడతెరిపి లేకుండా పనిలో మునిగిపోతే నీరసంగా అనిపించడా, అలసటకు గురవడం సర్వసాధారణం. కానీ ఏ పనిచేయకుండా ఊరికనే అలసటకు, నీరసానికి గురైనా అది తీవ్ర అనారోగ్యానికి సూచిక. అయితే మహిళలు ఎక్కువగా తేలిగ్గా తీసిపడే విషయం కూడా ఇదే. కానీ ఈ లక్షణాలు గుండె సంబంధిత వ్యాధులు, రక్త హీనత, మూత్రపిండాలు వంటి ప్రమాదకర సమస్యలకు లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.
రుతుక్రమం సరిగ్గా రావడం లేదా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే ఈ సమస్య గర్భకోశ సమస్యలు, ధైరాయిడ్ డిజార్డర్స్ వంటి రోగాలకు సంకేతం కాబట్టి. రుతు క్రమం తప్పితే వెంటనే డాక్టర్లను సంప్రదించండి.
breast cancer
పాలిండ్లలో దురదగా అనిపించడం, గడ్డలు అవడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు వస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ కు దారి తీసే లక్షణాలు కాబట్టి. అందుకే ఇటువంటి లక్షణాలు కనిపిస్తే.. అది ఎందుకు వచ్చిందో మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి స్క్రీనింగ్ చేయించుకోండి. ఇలాంటి వాటిని మొదట్లోనే గుర్తించడం మంచిది. ఎందుకంటే ప్రమాదకర ఈ క్యాన్సర్ నుంచి తొందరగా బయటపడొచ్చు. క్యాన్సర్ కాకపోతే దేని కారణంగా అలా అయ్యిందో తెలుస్తుంది. అవి తగ్గడానికి సరైన వైద్యం చేయించుకోవడానికి వీలుంటుంది.