Train Ticket Booking Tips: ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ 5 ఫాలో అయితే చాలా డబ్బులు ఆదా!
Train Ticket Booking Tips: రోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే IRCTC ద్వారా టికెట్ బుక్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంటాం. కొన్ని సింపుల్ చిట్కాలతో ట్రైన్ టికెట్ బుకింగ్‌లో డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం

ట్రైన్ టికెట్ బుకింగ్ టైంలో ఉపయోగపడే టిప్స్
తక్కువ ఖర్చుతో కంఫర్ట్ గా ప్రయాణం చేయడానికి రైల్వేలు బెస్ట్ ఆప్షన్. అయితే టికెట్ బుకింగ్ సమయంలో కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా ప్రయాణ ఖర్చును మరింత తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసే వారు కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో చూద్దాం.
ముందుగా టికెట్ బుక్ చేసుకోవడం
జర్నీ తేదీ ఖరారైన వెంటనే టికెట్ బుక్ చేసుకోవడం మంచిది. చాలామంది చివరి నిమిషంలో టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలా చేస్తే కన్ఫర్మ్ టికెట్ దొరకకపోగా, తత్కాల్ టికెట్లను బుక్ చేయాల్సి రావచ్చు. తత్కాల్ టికెట్లపై అదనపు ఛార్జీలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణానికి కొన్ని వారాల ముందే టికెట్ బుక్ చేసుకోవడం మంచిది. దానివల్ల మనకు తెలియకుండానే డబ్బు ఆదా అవుతుంది.
సరైన క్లాస్ ఎంచుకోవడం
చాలామంది ప్రయాణికులు అవసరం లేకపోయినా ఉన్నత తరగతులను ఎంచుకుంటారు. తక్కువ దూరం ప్రయాణాలకు స్లీపర్ క్లాస్ సరిపోతే, 3AC లేదా 2AC టికెట్లు బుక్ చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది. మీ ప్రయాణ సమయం, సౌకర్య అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన క్లాస్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు.
IRCTC ఆఫర్లు
IRCTC తరచుగా వివిధ బ్యాంకులు, డిజిటల్ వాలెట్లు, ఇతర చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లతో కలిసి ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, UPI లేదా వాలెట్ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు క్యాష్‌బ్యాక్ లేదా తక్షణ తగ్గింపు లభించే అవకాశాలు ఉంటాయి. టికెట్ బుక్ చేసే ముందు అందుబాటులో ఉన్న ఆఫర్లను పరిశీలించడం మంచిది. చిన్న మొత్తంగా కనిపించినా, తరచుగా ప్రయాణించే వారికి దీనివల్ల డబ్బు ఎక్కువగా ఆదా అవుతుంది.
సరైన టైంలో టికెట్ క్యాన్సిల్ చేయడం
టికెట్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితులు వస్తే సరైన సమయంలో క్యాన్సిల్ చేయడం అవసరం. ప్రయాణం చేయలేనని ముందుగానే తెలిసినప్పుడు చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా టికెట్‌ను క్యాన్సిల్ చేయాలి. రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ క్యాన్సిల్ చేసే సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తం మారుతుంది. ముందుగానే క్యాన్సిల్ చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
ప్రత్యేక సౌకర్యాలను ఉపయోగించుకోవడం
రైల్వేలు అందించే ప్రత్యేక కోటాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని వర్గాల ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు, దివ్యాంగులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు కొన్ని సందర్భాల్లో ప్రత్యేక రాయితీలు లేదా ప్రయోజనాలు లభించవచ్చు. అలాగే తక్కువ దూర ప్రయాణాలకు సీజన్ టికెట్లు లేదా ఇతర ప్రత్యేక ప్రయాణ పాస్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. తరచుగా ప్రయాణించే వారికి ఇవి ఖర్చును గణనీయంగా తగ్గిస్తాయి.

