Biotin Rich Foods: జుట్టును బలంగా, ఒత్తుగా, పొడవుగా మార్చే బయోటిన్ ఫుడ్స్ ఇవన్నీ
Biotin Rich Foods: జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో ఆహారం ఎంతో ముఖ్యమైనది. జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి కూడా పోషకాలు చాలా అవసరం. ఇక్కడ మేము బయోటిన్ నిండిన ఆహారాల గురించి చెప్పాము. ఇవి తింటే ఎంతో ఆరోగ్యం.

జుట్టును బలంగా మార్చే బయోటిన్ ఫుడ్స్
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లలో బయోటిన్ ఒకటి. దీన్ని విటమిన్ బి7 అని కూడా పిలుస్తారు. శరీరంలో ఆహారం నుంచి శక్తిని తయారు చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, చర్మం, గోర్లు బలంగా ఉండటానికి బయోటిన్ అవసరం. ముఖ్యంగా జుట్టు రాలడం, గోర్లు త్వరగా విరిగిపోవడం వంటి సమస్యలు ఉన్నవారు బయోటిన్ గురించి తెలుసుకోవాలి. అయితే శరీరంలో బయోటిన్ లోపం ఉన్నవారిలోనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే బయోటిన్ సప్లిమెంట్లు వాడటం కంటే ముందుగా ఆహారం ద్వారా ఈ విటమిన్ అందేలా చూసుకోవడం మంచిది. మన రోజువారీ ఆహారంలోనే బయోటిన్ లభించే ఎన్నో పదార్థాలు ఉన్నాయి.
ఏం తినాలి?
గుడ్లు బయోటిన్ అందించే మంచి ఆహారం. ముఖ్యంగా ఉడికించిన గుడ్లలో ఈ విటమిన్ ఉంటుంది. అయితే గుడ్డులోని తెల్లసొనను పచ్చిగా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. అందులో ఉండే అవిడిన్ అనే ప్రోటీన్ బయోటిన్ శరీరానికి అందకుండా చేస్తుంది. ఉడికించడం వల్ల ఈ ప్రభావం తగ్గుతుంది. బాదం, వేరుశెనగ, వాల్నట్స్ వంటి గింజల్లో కూడా బయోటిన్ ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో పరిమితంగా చేర్చుకోవచ్చు. చిలగడదుంపలోనూ బయోటిన్ లభిస్తుంది. ఇందులో ఉండే ఇతర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. అవకాడో, అరటిపండు కూడా బయోటిన్ అందించే పండ్లలో ఉన్నాయి. వీటితో పాటు పుట్టగొడుగుల్లోనూ ఈ విటమిన్ లభిస్తుంది.
చేపలు
చేపలు, మాంసం తినేవారికి కూడా బయోటిన్ అందించే ఆహార పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా సాల్మన్ వంటి చేపల్లో బయోటిన్ లభిస్తుంది. కాలేయంలోనూ ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పాలు, పెరుగు వంటి పాల పదార్థాల ద్వారా కూడా కొంత బయోటిన్ అందుతుంది. ఓట్స్, గోధుమలు, ఇతర తృణధాన్యాల్లోనూ ఇది ఉంటుంది. అయితే బయోటిన్ ఎక్కువగా తీసుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుందని భావించడం సరికాదు. అవసరానికి మించి సప్లిమెంట్లు వాడితే కొన్ని రక్త పరీక్షల ఫలితాలపై ప్రభావం పడవచ్చు. కాబట్టి సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యం. జుట్టు ఎక్కువగా రాలుతుంటే బయోటిన్ లోపమే కారణమని అనుకోకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.















