Curly Hair: ఉంగరాల జుట్టు చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Curly Hair: ఉంగరాల జుట్టు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ దాన్ని మెయింటెయిన్ చేయడం మాత్రం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఉదయం నిద్రలేచేసరికి జుట్టంతా చిక్కులు పడి ఉంటుంది. మరి రింగుల జుట్టు చిక్కు పడకూడదంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు
ఉంగరాల జుట్టు ముఖ అందాన్ని మరింత పెంచుతుంది. చాలామంది అమ్మాయిలు ప్రత్యేకంగా జుట్టును కర్ల్స్ చేయించుకుంటూ ఉంటారు. అయితే కర్లీ హెయిర్ చూడడానికి బాగున్నా, దాన్ని మెయింటెయిన్ చేయడం మాత్రం చాలా కష్టం. రాత్రి పడుకునే ముందు చక్కగా ఉన్న జుట్టు, ఉదయం లేచేసరికి చిక్కులమయంగా మారిపోతుంది. గట్టిగా దువ్వితే జుట్టు తెగిపోతుంది. మరి ఈ ఉంగరాల జుట్టు చిక్కులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కర్లీ హెయిర్ ఎందుకు ఎక్కువగా చిక్కులు పడుతుంది?
కర్లీ హెయిర్, స్ట్రెయిట్ హెయిర్ తో పోలిస్తే చాలా త్వరగా పొడిబారుతుంది. జుట్టులో తగినంత తేమ లేకపోవడం, వెంట్రుకలు ఒకదానితో మరొకటి అంటుకోవడం, జుట్టును సరిగ్గా దువ్వకపోవడం వంటి కారణాలతో చిక్కులు ఏర్పడతాయి. ముఖ్యంగా పొడవైన జుట్టు ఉన్నవారిని ఈ సమస్య మరింత ఇబ్బంది పెడుతుంది. జుట్టు చివర్లు బలహీనంగా ఉండటం, చిట్లిపోవడం కూడా చిక్కులు పెరగడానికి కారణం కావచ్చు.
జుట్టు చిక్కులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఉంగరాల జుట్టు చిక్కులను తగ్గించడానికి ముందుగా జుట్టుకు తగినంత తేమ అందించాలి. జుట్టు పొడిగా ఉన్నప్పుడు దువ్వెనతో బలంగా లాగడం వల్ల వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే జుట్టు చిక్కుగా అనిపించినప్పుడు కొద్దిగా నీటిని స్ప్రే చేయడం, అవసరమైతే లీవ్-ఇన్ కండీషనర్‌ను ఉపయోగించడం మంచిది. ఆ తర్వాత జుట్టును చిన్న చిన్న భాగాలుగా విడదీసి, వేళ్లతో లేదా వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో చిక్కులను నెమ్మదిగా తొలగించాలి. ఫస్ట్ జుట్టు చివర్ల దగ్గర నుంచి చిక్కులను విడదీయడం మొదలుపెట్టి ఆ తర్వాత పైవైపు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల జుట్టుపై ఒత్తిడి తగ్గుతుంది.
తలస్నానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఉంగరాల జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తలస్నానం చేసే పద్ధతి కూడా ముఖ్యమే. జుట్టు రకానికి సరిపోయే మైల్డ్ షాంపూను ఉపయోగించాలి. జుట్టును గట్టిగా రుద్దకూడదు. తలస్నానం చేసిన తర్వాత కండీషనర్‌ను జుట్టు మధ్య భాగం నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇది జుట్టు మృదువుగా మారడానికి, చిక్కులను సులభంగా విడదీయడానికి సహాయపడుతుంది. అలాగే తడి జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దకూడదు. అలా చేయడం వల్ల జుట్టు గజిబిజిగా మారి, వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మృదువైన టవల్‌తో నెమ్మదిగా ఒత్తుతూ నీటిని తొలగించాలి.
రాత్రి పడుకునేముందు...
ఉదయం లేచేసరికి జుట్టు చిక్కులుగా కనిపిస్తుంటే, పడుకునే ముందు జుట్టును సున్నితంగా సర్దుకుని, వదులుగా ఉండే జడ వేసుకోవచ్చు. జుట్టును మరీ బిగుతుగా కట్టకూడదు. అలాగే శాటిన్ లేదా సిల్క్ పిల్లోకవర్ ఉపయోగించడం మంచిది. జుట్టు పొడిగా ఉన్నప్పుడు పదేపదే దువ్వడం, చిక్కులను బలవంతంగా లాగడం, తడి జుట్టును గట్టిగా రుద్దడం వంటి పనులు చేయకూడదు.





