Poori: నూనె పీల్చకుండా పూరీలు బాగా పొంగాలా? పిండిలో ఇదొక్కటి కలిపి చూడండి..!
Poori: మీకు పూరీలు తినడం ఇష్టమా? కానీ, నూనె హెవీగా పీల్చిన పూరీ తినడం వల్ల కడుపు హెవీగా అనిపిస్తోందా? అయితే, పిండి కలిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. నూనె పీల్చుకోకుండానే పూరీ చేసుకోవచ్చు.

నూనె పీల్చకుండా పూరీ చేయాలా?
వేడి వేడిగా, క్రిస్పీగా ఉండే పూరీలను బంగాళదుంప కూర, లేదంటే.. చోలే కర్రీతో తింటే వచ్చే మజానే వేరు. కానీ, పూరీ చేసిన ప్రతిసారీ అవి నూనె చాలా ఎక్కువగా పీల్చుకుంటాయి. దీని వల్ల పూరీ రుచి సరిగా ఉండకపోగా, తిన్నప్పుడు కడుపులో హెవీగా కూడా ఉంటుంది. ఇలాంటి సమస్య లేకుండా తక్కువ నూనెతో పూరీలు రుచిగా రావడమే కాకుండా, పర్ఫెక్ట్ గా పొంగాలి అంటే.. సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.
తక్కువ నూనెతో క్రిస్పీ పూరీలు చేయడానికి చిట్కాలు..
పిండిని కాస్త గట్టిగా కలపాలి: తక్కువ నూనెతో పూరీలు రావాలంటే మొదటి నియమం పిండిని గట్టిగా కలుపుకోవడం. చపాతీ పిండిలాగా పూరీ పిండి మరీ మెత్తగా ఉండకూడదు. పిండి కలిపేటప్పుడు తక్కువ నీటిని ఉపయోగిస్తూ, పిండి ముద్ద గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
2. బొంబాయి రవ్వ లేదా శనగపిండి కలపండి: గోధుమ పిండి కలిపేటప్పుడు అందులో కాస్త బొంబాయి రవ్వ లేదా శనగపిండి కలపండి. ఉదాహరణకు, మీరు రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటే.. అందులో రెండు టేబుల్ స్పూన్ల రవ్వ లేదా శనగపిండి కలపండి. ఇది పూరీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా చేయడమే కాకుండా, మంచి క్రిస్పీ టెక్చర్ ఇస్తుంది.
3. ఒత్తేటప్పుడు పొడి పిండి వాడకండి: పూరీలు రుద్దేటప్పుడు పొడి పిండి చల్లడం మానెయ్యండి. పొడి పిండి నూనెలో పడి మాడిపోయి, నూనె నల్లగా మారడమే కాకుండా పూరీలు ఎక్కువ నూనెను పీల్చుకునేలా చేస్తుంది. పొడి పిండికి బదులుగా, పూరీ ఉండలకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి ఒత్తుకోండి.
4. ఫ్రిజ్‌లో పెట్టిన పాత పిండిని వాడకండి:
ఫ్రిజ్‌లో పెట్టిన లేదా మిగిలిపోయిన పాత పిండితో పూరీలు చేయకూడదు. పాత పిండి నూనెను ఎక్కువగా పీల్చుకోవడమే కాకుండా, పూరీలు సరిగ్గా పొంగవు. ఎప్పుడూ కూడా అప్పటికప్పుడు తాజా పూరీ పిండిని కలుపుకుని చేసుకోవడమే మంచిది.
5. నూనె ఉష్ణోగ్రత సరైన స్థాయిలో ఉండాలి: పూరీలు వేయించేటప్పుడు నూనె సరైన వేడిలో ఉండటం చాలా ముఖ్యం. నూనె మరీ ఎక్కువ కాగితే పూరీలు త్వరగా మాడిపోతాయి. ఒకవేళ నూనె వేడి సరిపోకపోతే పూరీలు నూనెను బాగా పీల్చేస్తాయి. అందుకే నూనెను బాగా కాగనిచ్చి, ఆ తర్వాత మీడియం-హై ఫ్లేమ్‌లో పూరీలను కాల్చుకోవాలి.
6. పూరీని పదే పదే తిప్పకూడదు: పూరీని కాగుతున్న నూనెలో వేసిన తర్వాత.. చిల్లుల గరిటెతో మెల్లగా పైన నొక్కితే అది బాగా పొంగుతుంది. ఒక వైపు కాలిన తర్వాత మాత్రమే రెండో వైపునకు తిప్పాలి. పదే పదే అటూ ఇటూ తిప్పడం వల్ల పూరీ ఎక్కువ నూనెను పీలుస్తుంది.
7. టిష్యూ పేపర్ వాడండి: కాల్చిన పూరీలను నూనెలోంచి తీసాక కిచెన్ టవల్ లేదా టిష్యూ పేపర్‌పై వేయండి. ఇది పూరీలపై ఉన్న అదనపు నూనెను పీల్చుకుని, పూరీలు జిడ్డుగా లేకుండా చేస్తుంది.
ఈ చిన్న చిట్కాలను పాటిస్తే తక్కువ నూనెతో, ఎంతో రుచికరమైన క్రిస్పీ పూరీలను సులభంగా తయారు చేసుకోవచ్చు.

