Chicken Quality: పచ్చి చికెన్ తాజాగా ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
Chicken Quality: పచ్చి చికెన్ షాపు నుంచి కొని తెచ్చే ముందు దాని నాణ్యత చూసుకోవాలి. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చికెన్ తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.

చికెన్ తాజాగా ఉందో లేదో చెకింగ్
ఆదివారం వస్తే ప్రతి ఇంట్లో చికెన్ కూరలు ఘుమఘుమలాడిపోతాయి. చికెన్ ను దగ్గరలోని దుకాణాల నుంచి కొని తెచ్చుకుంటారు. స్థానిక దుకాణాల్లో పచ్చి చికెన్ ను నిల్వ చేసి ఉంచే అవకాశం ఉంది. సూపర్ మార్కెట్లలో చికెన్ ప్రాసెస్ చేసి, ఫ్రోజెన్ లేదా ప్యాక్ చేసి ఉండటంతో దాన్ని తనిఖీ చేయడం కష్టం. చికెన్ నాణ్యతను గుర్తించడంలో మీకు ఇబ్బంది ఉంటే ఈ 5 చిట్కాలు మీకు సహాయపడతాయి. నిజానికి చికెన్ అప్పటికప్పుడు తాజాగా తెచ్చుకుంటేనే మంచిది. మన కళ్ల ముందే కోడిని శుభ్రపరిచి కోసిన చికెన్ ను తెచ్చుకుంటే ఇంకా మంచిది.
రంగును చూడండి
1. చికెన్ తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా దాని రంగును చూడాలి. రంగు మారడం అంటే చికెన్ పాడైందని చెప్పడానికి ఒక మార్గం. తాజా చికెన్ ఎప్పుడైనా గులాబీ రంగులో ఉంటుంది. చికెన్ రంగు లేత బూడిద రంగులో లేదా పాలిపోయి ఉంటే అది మంచిది కాదని అర్థం. అలాంటి చికెన్‌ను తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వాసన చూడండి
2. ప్యాక్ చేసిన లేదా ఫ్రోజెన్ చికెన్‌ను తనిఖీ చేయడం కష్టం, కానీ వండడానికి ముందు ఒకసారి చెక్ చేయండి. కడిగేటప్పుడు ఇంకా సులభంగా చెక్ చేయవచ్చు. అదే తాజాగా తెచ్చిన చికెన్ అయితే కొద్దిగా మెరుస్తూ, నునుపుగా ఉంటుంది. కడిగిన తర్వాత కూడా జిగటగా లేదా మెత్తగా అనిపిస్తే అది పాడైపోయిందని అర్థం చేసుకోవాలి.
3. తాజా పచ్చి చికెన్ నుంచి చాలా తక్కువగా వాసన వస్తుంది. లేదా వాసన రాదు. కానీ, పాడైన చికెన్ నుండి మాత్రం దుర్వాసన వస్తుంది. పుల్లగా లేదా కుళ్లిన గుడ్ల వాసన వస్తే ఆ చికెన్ ఏ మాత్రం మంచిది కాదు. వెంటనే పడేయండి. బ్యాక్టీరియా పెరగడం వల్లే ఈ వాసన వస్తుంది.
మచ్చలు ఉంటే
4. ఫ్రోజెన్ చికెన్‌పై మందపాటి మంచు పొరలాంటిది కనిపిస్తే అది మంచి చికెన్ కాదని అర్థం. ఫ్రీజర్‌లో తేమ తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది చికెన్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. చికెన్‌పై అసాధారణంగా మందపాటి మంచు పొర ఉంటే దాన్ని పడేయడమే మంచిది.
5. చికెన్ కొనేటప్పుడు లేదా వండేటప్పుడు దానిపై ఏవైనా మచ్చలు ఉన్నాయేమో చెక్ చేయండి. చికెన్ రంగు మారినా దానిపై తెలుపు, ఎరుపు, పసుపు లేదా ఏదైనా ముదురు రంగు మచ్చలు కనిపిస్తే ఆ చికెన్ నిల్వ చేసినది అని తెలుసుకోవాలి. అలాంటి చికెన్ తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.

