- Home
- Entertainment
- Silk Smitha: చనిపోయే ముందు సిల్క్ స్మిత ఫోన్ చేసింది, నేను వెళ్లి ఉంటే బతికేదేమో.. సీనియర్ నటి ఆవేదన
Silk Smitha: చనిపోయే ముందు సిల్క్ స్మిత ఫోన్ చేసింది, నేను వెళ్లి ఉంటే బతికేదేమో.. సీనియర్ నటి ఆవేదన
Silk Smitha: హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సిల్క్ స్మితకు ఉంది. ఎనభైల కాలంలో బాక్సాఫీసును ఏలిన భారతీయ నటి ఆమె. సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే మిగిలిపోయింది. ఆమె దగ్గరి స్నేహితురాలు అనురాధ ఒక ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి చెప్పుకొచ్చారు.

సిల్క్ స్మిత మరణం
దక్షిణ భారత సినీ లోకాన్ని ఊపేసిన ఒక నటి సిల్క్ స్మిత. ఆమె మరణం ఇప్పటికే ఒక మిస్టరీనే. సెప్టెంబర్ 23, 1996న సిల్క్ స్మిత చెన్నైలోనే తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని మరణించింది. ఆమెది ఆత్మహత్య గానే చెప్పారు. ఆర్థిక సమస్యలు, ప్రేమలో ఓటమి, మద్యపానం వంటివన్నీ కలిసి ఆమెకు డిప్రెషన్ తెచ్చిపెట్టాయని.. దానివల్ల ఆత్మహత్య చేసుకుందని వివరించారు. అయితే ఇప్పటికీ ఆ మరణం పై ఎన్నో వివాదాలు, వాదనలు ఉన్నాయి. సిల్క్ స్మిత చనిపోయే ముందు ఒక లేఖను కూడా రాసింది.
ఆ లేఖలో ‘నేను నటిగా మారడానికి ఎంతో కష్టపడ్డాను. ఎవరూ నన్ను ప్రేమించలేదు. ఒక్కరు మాత్రమే నన్ను కొంత ప్రేమగా చూసుకున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా శాంతి లేదు. అందుకే మరణం నన్ను పిలుస్తోంది. నేను బాబును నిజాయితీగా ప్రేమించాను. అతడు నన్ను ఎప్పుడూ మోసం చేయడని నమ్మాను. కానీ అతను అలాగే చేశాడు. గత ఐదేళ్లుగా ఒకరు నాకు జీవితాన్ని ఇస్తానని చెబుతున్నారు. కానీ అవన్నీ మాటలు మాత్రమే అని నేను గ్రహించాను. ఇక అలసిపోయాను. ఇకపై దాన్ని భరించలేను’ అని రాసుకొచ్చింది. ఈ లేఖను బట్టి ప్రేమలో ఓటమి ఆమె మరణానికి కారణమని అర్థం చేసుకున్నారంతా.
స్కిల్ స్మిత ఫ్రెండ్
సిల్క్ స్మితకు మంచి ఫ్రెండ్ నటి, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ అనురాధ. ఈమె కూడా సిల్క్ స్మిత లాగే ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా చేసేవారు. ఈమె ఎవరో కాదు ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం పాటకు డ్యాన్స్ వేసిన అభినయశ్రీ తల్లి. ఎనభైలలో అనురాధకు కూడా ఫ్యాన్స్ ఎక్కువ. అప్పట్లోనే పాటకు లక్ష రూపాయలు దాకా ఛార్జి చేసేవారు. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. వీరిద్దరూ ఎంతో మంచి స్నేహితులు. సిల్క్ స్మితకు ఉన్న మంచి ఫ్రెండ్ అనూరాధ.
చనిపోయే ముందు ఫోన్
‘సిల్క్ స్మిత చాలా మంచిది. తన విషయాలను ఎక్కువగా బయటకు చెప్పదు. అన్ని విషయాలు మాట్లాడుతుంది గాని వ్యక్తిగత విషయాలను మాత్రం ఎవరి దగ్గరా నోరు విప్పదు. అందుకే మాకు చాలా విషయాలు తెలియలేదు. మేమందరం ఎన్నో సినిమాల్లో కలిసిన నటించాం. సంతోషంగా గడిపాము. కానీ ఆమె మరణానికి కారణం మాత్రం తెలుసుకోలేకపోయాము’ అని నటి అనురాధ బాధపడుతూ చెప్పారు.
సిల్క్ స్మిత చనిపోవడానికి ముందు తనకు ఫోన్ చేసిందని, ఒకసారి ఇంటికి రమ్మని చెప్పిందని వివరించారు. కానీ అప్పటికే రాత్రవ్వడంతో తన భర్త అప్పుడే ఇంటికి వస్తున్నట్టు ఫోన్ చేయడంతో సిల్క్ స్మితకు రాలేనని చెప్పినట్టు తెలిపారు. ఉదయం లేచాక వార్తల్లో చూస్తే సిల్క్ స్మిత మరణించినట్టు తెలిసిందని, వెంటనే ఆమెను తీసుకెళ్లిన ఆసుపత్రికి వెళ్ళానని చెప్పారు. అప్పటికే సిల్క్ స్మిత దేహాన్ని నేల మీదే పడుకోబెట్టి వదిలేశారని, ఈగలు ముసురుతూ ఉంటే చూడలేక ఒక పుస్తకం పట్టుకొని విసురుతూ ఉన్నానని చెప్పారు. ఎంతోమంది కలల రాణి సిల్క్ స్మిత.. మరణించాక ఆమెను నేలపై అలా పడుండడం చూసి తట్టుకోలేకపోయాను అని అన్నారు అనురాధ.
ఈ పేరు ఎవరు పెట్టారు
సిల్క్ స్మితది ఏలూరు. అసలు పేరు విజయలక్ష్మి. నాలుగవ తరగతిలో ఉన్నప్పుడే సినీనటి కావాలని నిశ్చయించుకుంది. పద్నాలుగేళ్ల వయసులో బాల్య వివాహం చేసినప్పటికీ ఆ పెళ్లి బయటికి వచ్చి చెన్నైలో తన అత్తతో కలిసి నివసించేది. దర్శకుడు వినూ చక్రవర్తి ఆమెకు స్మిత అనే పేరును పెట్టాడు. 1979లో తమిళ చిత్రం ‘వండి చక్రం’తో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఆ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్ కావడంతో సిల్క్ స్మితగా పేరు మారిపోయింది.

