బీపీ మన శరీరంలో ఇన్ని అవయవాలను దెబ్బతీస్తుందా?
పిల్లలు, పెద్దలు అంటూ తేడా లేకుండా అన్ని వయసుల వారు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. నిజానికి అధిక రక్తపోటు మన శరీరంలో ఎన్నో అవయవాలను దెబ్బతీస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది హృదయ సంబంధ వ్యాధులతోనే చనిపోతున్నారు. దీనికి అతిపెద్ద కారణాల్లో అధిక రక్తపోటు ఒకటి. అధిక రక్తపోటులో రక్తనాళాల్లో ప్రవహించే రక్తం శక్తి స్థిరంగా, ఎక్కువగా ఉంటుంది. దీనికి చికిత్స తీసుకోకుండా ఉంటే.. ఈ అధిక రక్తపోటు ఒక్క మీ గుండెపైనే కాదు మీ మొత్తం శరీరంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన ప్రసరణ వ్యవస్థలో గుండె, ధమనులు, సిరలు, రక్తంతో సహా నాలుగు భాగాలుంటాయి. అధిక రక్తపోటు ధమనులను దెబ్బతీస్తే.. గుండెకు రక్తం, ఆక్సిజన్ ప్రవాహం తగ్గుతుంది. అయితే గుండెకు రక్తాన్ని చేరవేయడానికి రక్తనాళాలు బాగా కష్టపడతాయి. దీంతో మీ రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కణజాలం లేదా అవయావానికి నష్టం కలిగిస్తుంది. ఇది కాస్త గుండె జబ్బులకు దారితీస్తుంది.
మెదడుపై ప్రభావాలు
అధిక రక్తపోటు వల్ల మెదడుతో సహా శరీరంలోని వివిధ భాగాలకు రక్తప్రవాహం, ఆక్సిజన్ తగ్గుతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి , ఆలోచనకు సంబంధించిన సమస్యలు వస్తాయి. హై బీపీ గుండెలోని రక్తనాళాలకు, ధమనులనే కాదు మెదడులోని ధమనులకు కూడా నష్టం కలిగిస్తుంది. మెదడుకు అనుసంధానించబడ్డ ధమనులలో ఎక్కువ అడ్డంకి ఉంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. మెదడులోని సగనభాగానికి తగినంత రక్తం లేదా ఆక్సిజన్ అందకపోతే కణాలు నశించడం ప్రారంభవుతుంది. దీనివల్ల తలనొప్పి, వికారం, చూపులో సమస్యలు, మూర్చ వంటి సమస్యలు వస్తాయి.
kidney health
మూత్రపిండాలు దెబ్బతింటాయి
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి శరీరం నుంచి వ్యర్థాలను, ఆమ్లం, అదనపు ద్రవాలను తొలగిస్తాయి. ఇవి మీ రక్తంలో నీరు, లవణాలు, కాల్షియం, సోడియం, భాస్వరం, పొటాషియం వంటి ఖనిజాలు సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. కాగా అధిక రక్తపోటు మీ మూత్రపిండాల పెద్ద రక్తనాళాలను, మీ మూత్రపిండాల లోపల ఉన్న చిన్న నాళాలను దెబ్బతీస్తుంది. దీంతో మూత్రపిండాల పని సామర్థ్యం తగ్గుతుంది. ఇది మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది.
కళ్లపై ప్రభావం
అధిక రక్తపోటు కళ్లకు రక్తాన్ని సరఫరా చేసే చిన్న రక్తనాళాలను కూడా దెబ్బతీస్తుంది. ఇది రెటినోపతికి కారణం అవుతుంది. ఇది కంటి వెనుక భాగంలోని కాంతి.. సున్నితమైన కణజాలం (రెటీనా) లోని రక్తనాళాలకు నస్టం కలిగిస్తుంది. దీనివల్ల చూపు సరిగ్గాలేకపోవడం, పూర్తిగా కంటిచూపును కోల్పోవడం కంటిలో రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి. హై బీపీ వల్ల కళ్లకు రక్తప్రవాహం నిలిచిపోతుంది. దీంతో ఆప్టిక్ నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల కంటి లోపల రక్తస్రావం అవ్వడమో.. లేకపోతే చూపు తగ్గడమో వంటి సమస్యలు వస్తాయి.
ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం
మాయో క్లీనిక్ ప్రకారం.. అధిక రక్తపోటుతో బాధపడే పురుషులు అంగస్తంభన లోపం సమస్యను ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అధిక రక్తపోటు వల్ల రక్తప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల పురుషాంగానికి రక్తప్రవాహం జరగదు. పురుషుల మాదిరిగానే మహిళలు కూడా అధిక రక్తపోటు వల్ల లైంగిక సమస్యలను ఫేస్ చేస్తారు. హై బీపీ వల్ల యోనికి రక్తప్రవాహం తగ్గుతుంది. దీంతో సెక్స్ పై కోరికలు తగ్గుతాయి. ముఖ్యంగా యోని పొడిబారుతుందని మాయో క్లినిక్ వెల్లడిస్తోంది.