Bus Tickets: బస్ టికెట్లు, కరెంట్ బిల్లులు చేతితో పట్టుకుంటున్నారా?
BPA Chemical In Receipts: ఇప్పుడు మరో ముప్పు పొంచుకొస్తోంది. మనం రోజూ పట్టుకునే కరెంట్ బిల్, స్లిప్పులు, బస్ టికెట్ల వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందంటే నమ్ముతారా? కానీ వీటిపై హానికరం అని కెమికల్స్ గురించి వైద్యులు షాకింగ్ విషయాలు చెబుతున్నారు. అదెంటంటే..

ప్రాణాంతక వ్యాధులకు కారణం
మనం రోజూ కరెంట్ బిల్లులని, షాపింగ్ బిల్స్ అని, బస్ టికెట్స్, హాస్పిటల్ బిల్స్….ఇలా పట్టుకుంటాం. అవి కూడా చాలా మంది చేతులు మారి మన చేతిలోకి వస్తాయి. అందరి చేతులు మారి మన చేతిలోకి వస్తేనే…ఎన్నో క్రిములు అంటుకుంటాయని, దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఫీలై…పది సార్లు చేతులు కడుక్కుంటాం. కానీ ఇదెప్పుడైనా ఆలోచించారా? బిల్స్ మీద ఉండే కెమికల్. ఇవి ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి 'థర్మల్ పేపర్' రసీదుల్లో ఉండే హానికరం అని రసాయనాలు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని చెబుతున్నారు.
బిల్స్ లో ఉండే ఆ డేంజర్ కెమికల్ ఏంటి?
మనం రోజూ తీసుకునే బస్ టికెట్లు, ఏటీఎం స్లిప్పులు, మాల్స్ లేదా సూపర్ మార్కెట్లలో ఇచ్చే బిల్లులు…కేవలం కాగితాలు మాత్రమే కావు. వీటిని 'థర్మల్ పేపర్' అంటారు. వీటిపై అక్షరాలు ప్రింట్ అవ్వడానికి 'BPA' (బిస్ఫినాల్-ఏ) లేదా 'BPS' (బిస్ఫినాల్-ఎస్) అనే విషపూరితమైన రసాయనాన్ని పూస్తారు. ఈ కాగితాలను మనం చేతులతో పట్టుకున్నప్పుడు, ఆ కెమికల్ చర్మం ద్వారా నేరుగా శరీరంలోకి, రక్తంలోకి చేరుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యంపై పడే తీవ్రమైన దుష్ప్రభావాలు
ఈ కెమికల్ శరీరంలోకి చేరడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.
బీపీ, షుగర్: రక్తంలో ఈ రసాయనం స్థాయి పెరిగేకొద్దీ హై బీపీ (High BP), మధుమేహం (Diabetes) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
సంతానలేమి (Infertility): BPA రసాయనం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీనివల్ల స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గి, పిల్లలు పుట్టకపోవచ్చు.
క్యాన్సర్ ముప్పు: ఈ రసీదులను రోజూ, ఎక్కువ కాలం పాటు వాడటం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
బస్ కండక్టర్లకు డాక్టర్ ప్రత్యేక విజ్ఞప్తి
రోజూ వందలాది మంది ప్రయాణికులకు చేత్తో టికెట్లు చించి ఇచ్చే బస్ కండక్టర్లకు ఈ ముప్పు చాలా ఎక్కువ. రోజంతా థర్మల్ టికెట్లను చేతులతోనే పట్టుకోవడం వల్ల వారి శరీరంలోకి ఈ కెమికల్ భారీగా చేరుతుంది. అందుకే, కండక్టర్లు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డ్యూటీలో ఉన్నప్పుడు కచ్చితంగా గ్లౌజులు (Gloves) వేసుకుని టికెట్లు ఇవ్వాలని చెబుతున్నారు.
నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు
డిజిటల్ వైపు మారండి: ప్రింటెడ్ బిల్లులు తీసుకోవడానికి బదులుగా SMS, వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా డిజిటల్ బిల్లులు తీసుకునే అలవాటు చేసుకోండి.
గ్లౌజులు వాడండి: షాపుల్లో లేదా బిల్లింగ్ కౌంటర్లలో పనిచేసేవారు, రోజూ రసీదులు పట్టుకునేవారు కాటన్ లేదా రబ్బర్ గ్లౌజులు వేసుకోవడం మంచిది.
చేతులు కడుక్కోవాలి: రసీదులు పట్టుకున్న వెంటనే ఎలాంటి ఆహారం తినకూడదు. సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
పిల్లలకు ఇవ్వకండి: చిన్న పిల్లలకు ఏటీఎం స్లిప్పులు లేదా బస్ టికెట్లను ఆడుకోవడానికి అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే వారి సున్నితమైన చర్మం ఈ రసాయనాన్ని చాలా త్వరగా పీల్చుకుంటుంది. చిన్న బస్ టికెట్ లేదా బిల్లు మన ప్రాణాల మీదకు రాకముందే ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అని డాక్టర్లు సూచిస్తున్నారు.

