వాయు కాలుష్యం వల్ల ప్రాణాంతక రోగాలొస్తాయ్.. ఈ ఆహారాలు తింటే మీరు సేఫ్..
గాలి కాలుష్యం వల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలొస్తాయ్. దీనివల్ల గుండె, మూత్రపిండాలు, మెదడు దెబ్బతింటాయి. కాలుష్యం వల్ల ఎలాంటి రోగాలు రాకూడదంటే.. ఈ కూరగాయలను తప్పకుండా తినండి..

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు మరింత పెరిగిపోతోంది. అంతెందుకు దేశంలో హైదరాబాద్ తో సహా ఎన్నో నగరాల్లో ఈ వాయుకాలుష్యం పెరుగుతోంది. కానీ కలుషితమైన గాలి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటాయి. వాయుకాలుష్యం వల్ల.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, పిల్లలు, వృద్ధులు ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. కలుషితమైన గాలి వల్ల చాలా మంది శ్వాసకోశ సమస్యలు వస్తయ్. అలాగే కళ్ళు, గొంతులో నొప్పి వస్తుంది.
air pollution
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కలుషితమైన గాలి వల్ల మన ఆరోగ్యం ఎన్నో విధాలుగా ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాల్ని పెంచుతుంది. వాయు కాలుష్యం ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వాయు కాలుష్యం ఊపిరితిత్తులను, మూత్రపిండాలను, గుండె, మెదడును దెబ్బతీస్తుంది. ఈ కాలుష్యం వల్ల ఎలాంటి సమస్యలు రాకూడదంటే.. ఈ ఆహారాలను రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
బ్రోకలీ
బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలలో సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని వాయు కాలుష్యం నుంచి రక్షిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపుతుంది. దీనిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
అవిసె గింజలు
అవిసె గింజల్లో ఫైటోఈస్ట్రోజన్ సమ్మేళనాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఉబ్బసం రోగుల్లో అలెర్జీ వల్ల కలిగే సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అవిసె గింజల నీటిని రోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉసిరి కాయ
విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఉసిరికాయ సెల్యులార్ డ్యామేజీని నివారిస్తుంది. పర్యావరణం వల్ల కలిగే హానిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉసిరికాయ జ్యూస్ ను తాగడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
పసుపు
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. పసుపు పాలు లేదా నీటిలో కలుపుకుని తాగే బదులు 500 మి.గ్రా కర్కుమిన్ సప్లిమెంట్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శోథ నిరోధక ప్రభావానికి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడానికి పసుపును మోతాదులోనే తీసుకోవాలి.
అల్లం
అల్లం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఈ అల్లం మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గొంతు నొప్పి, తాపజనక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లంలో దీర్ఘకాలిక నొప్పి, కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఉంటాయి. అంతేకాదు ఈ అల్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.