గుప్పెడు గింజలతో ఈ రోగాలన్నీ దూరం..
నట్స్ లో విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక బరువు నుంచి ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.

రోజూ గుప్పెడు గింజలను తింటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో రోజూ నట్స్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు మరి. దీనిలో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. బాదం పప్పు, పిస్తా పప్పులు, జీడిపప్పులు, వేరు శెనగలను కలిపి గుప్పెడు తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందంటున్నారు నిపుణులు.
నట్స్ లో హెల్తీ ఫ్యాట్స్, మినరల్స్, ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. నట్స్ ఓవర్ వెయిట్ ను సులువుగా తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ గింజలు ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ ఈ గింజలను తినడం వల్ల చాలా సులువుగా బరువు తగ్గుతారని తేలింది.
బాదం పప్పులు
బాదం లో ఫైబర్, మోనోశాచురేటెడ్ కొవ్వులు, కాల్షియం, ఫైబర్, విటమిన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ ఎముకలను బలంగా చేయడంతో పాటుగా కండరాలు బలోపేతం అవుతాయి. ఈ పోషకాలు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. బాదంలో ఉండే హెల్తీ కొవ్వు, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బాదం పప్పులు గట్ ను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది లాక్టోబాసిల్లస్, బిఫిడో బ్యాక్టీరియాతో పాటు ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. బాదం పప్పుల్లో ఫ్లేవనాయిడ్లు అనబడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి బాదం పప్పులు రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడమే కాదు చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
పిస్తా
పిస్తాలో ఇతర గింజల కంటే కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. అలాగే దీనిలో ఉండే ఫైటోస్టెరాల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. పిస్తాలో జియాక్సంతిన్, లుటిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పిస్తాలను తినడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. పిస్తాలో పుష్కలంగా ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి.
జీడిపప్పులు
100 గ్రాముల జీడిపప్పుల్లో 18.22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాల గుణాలు కూడా ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి మధుమేహులకు ఔషదంలా పనిచేస్తాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి.
వాల్ నట్స్
వాల్ నట్స్ ఒక్కటేమిటీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. 100 గ్రాముల వాల్ నట్స్ లో 15.23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఫినోలిక్ ఆమ్లం, ప్లేవనాయిడ్లు, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుప్పెడు వాల్ నట్స్ ను తింటే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రించబడతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
వేరుశెనగ
వేరు శెనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వేరుశెనగల ద్వారా శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఇవి ఊబకాయాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. దీనిలో ఫోలెట్,మాంగనీస్, విటమిన్ ఇ, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. వేరుశెనగలను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బుల ప్రమాదం కూకడా తగ్గుతుంది. దీనిలో ఉండే సమ్మేళనాలు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.