Growing Kothimeera: ఇంట్లోనే కొత్తిమీరను ఇలా సులువుగా పెంచేయండి, బాగా పెరిగే సీజన్ ఇదే
Growing Kothimeera: కొత్తిమీర లేకుండా ఎన్నో వంటలు పూర్తికావు. కొత్తిమీర కొనే అవసరం లేకుండా ఇంట్లోనే సులువుగా పెంచేయచ్చు. కొత్తిమీర బాగా పెరిగే సీజన్ ఇదే. కాబట్టి ఇంట్లోనే ఎలా పెంచాలో తెలుసుకోండి.

కొత్తిమీర ఎందుకు ప్రత్యేకం
ఇంటి వంటల్లో కొత్తిమీరది ప్రత్యేక స్థానం.సాంబార్, కూరలు, చట్నీలు, బిర్యానీలు... ఇలా ఎందులోనైనా కొత్తిమీర వాసన, రుచి తగలాల్సిందే. మార్కెట్ నుంచి ప్రతిరోజూ కొనడం ఖర్చుతో పాటు సమయం కూడా వేస్టవుతుంది. అందుకే ఇంట్లోనే కుండలో కొత్తిమీర పెంచుకుంటే చాలా లాభం ఉంటుంది. పైగా తాజాగా కత్తిరించి కూరల్లో వేసుకోవచ్చు. చిన్న ఇల్లు అయినా, బాల్కనీ ఉన్నా, కిటికీ పక్కన చోటు ఉన్నా సరిపోతుంది. కొత్తిమీర పెంపకానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా శ్రద్ధ పెడితే చాలు కొత్తిమీర అధికంగా పండుతుంది. సరైన కుండ, సరైన మట్టి ఉంటే కొన్ని రోజులలోనే పచ్చని ఆకులతో కొత్తిమీర పెరిగేస్తుంది. ఇంట్లో పండిన కొత్తిమీరలో రసాయనాలు ఉండవు. కాబట్టి ఎంతో ఆరోగ్యకరం కూడా.
ఎలా పెంచాలి?
కొత్తిమీర పెంచాలంటే ముందుగా సరైన కుండను ఎంపిక చేసుకోవాలి. ఎనిమిది నుంచి పది అంగుళాల లోతు ఉన్న కుండ అయితే చాలు. కుండ అడుగున నీరు బయటకు వెళ్లేందుకు రంధ్రాలు పెట్టాలి. మట్టి విషయంలో కూడా జాగ్రత్త అవసరం. సాధారణ తోట మట్టిలో కొద్దిగా కంపోస్ట్ కలిపితే మంచిది. ఈ మిశ్రమం మొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది. కొత్తిమీర గింజలు అంటే ధనియాలను చేతితో కొంచెం నలపాలి. ఇలా నలిపితే మొలకలు త్వరగా వస్తాయి. గింజలను మట్టిలో అర అంగుళం లోతులో ఉండేలా నొక్కాలి. పైన కొంచెం మట్టి వేయాలి. వెంటనే నీరు ఎక్కువగా పోయకూడదు. తడిగా ఉండేంత మాత్రాన సరిపోతుంది.
సూర్య కాంతి తగిలేలా
కొత్తిమీర మొక్కలకు వెలుతురు అవసరం ఉంటుంది. రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల సూర్యకాంతి పడే చోట కుండను ఉంచితే ఆకులు బాగా పెరుగుతాయి. ఎండ ఎక్కువగా ఉండే సమయంలో నేరుగా వేడి తగలకుండా కొద్దిగా నీడ కలిగేలా చూడాలి. నీరు ప్రతిరోజూ అవసరం లేదు. పై మట్టి పొర ఎండినట్టు అనిపించినప్పుడు మాత్రమే నీరు పోయాలి. నీరు ఎక్కువైతే వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. విత్తనాలు ఏడు నుంచి పది రోజుల్లో మొలకెత్తుతాయి. కొద్ది రోజులకే పచ్చని చిన్న ఆకులు కనిపిస్తాయి. ఈ దశలో కుండను తరచూ కదపకుండా ఒకేచోట ఉంచటం మంచిది.
ఎప్పుడు కోయాలి?
కొత్తిమీర ఆకులను చిన్నగా ఉన్నప్పుడే కోసేయకూడదు.మొక్క నాలుగు అంగుళాల ఎత్తు వచ్చిన తరువాత మాత్రమే ఆకులు కోయాలి. ఒకేసారి మొత్తం మొక్కను కోయకూడదు. పై భాగంలో కొంత మాత్రమే కత్తిరిస్తే మిగతా భాగం మళ్లీ పెరుగుతుంది. ఇలా చేస్తే కొన్ని వారాల పాటు కొత్తిమీరను ఇంటి అవసరాలకు అందుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చిన్న పురుగులు కనిపించవచ్చు. అప్పుడు రసాయన మందులు వాడకుండానే వేపనూనె నీటిలో కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. ఇంట్లో కుండీలో కొత్తిమీర సాగు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం ఇస్తుంది. రోజూ తాజా ఆకులు అందుతాయి. వంటలకు రుచి పెరుగుతుంది.

