- Home
- Life
- Baking Powder Vs Baking Soda: బేకింగ్ పౌడర్ కీ బేకింగ్ సోడా కీ తేడా ఏంటి? దేనిని దేనికి వాడాలో తెలుసా?
Baking Powder Vs Baking Soda: బేకింగ్ పౌడర్ కీ బేకింగ్ సోడా కీ తేడా ఏంటి? దేనిని దేనికి వాడాలో తెలుసా?
Baking Powder Vs Baking Soda: బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా చూడటానికి రెండూ ఒకేలా ఉంటాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి.. ఒక దానికి బదులు ఒకటి వాడుతూ ఉంటారు. అసలు.. ఈ రెండింటికీ ఉన్న తేడా ఏంటి?

రెండూ ఒకేలా ఉన్నా తేడా ఇదే...
ఇంట్లో కేకులు చేసినా, బజ్జీలు వేసేటప్పుడు పిండి గుల్లగా రావడానికి ఎక్కువగా ఈ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వాడుతూ ఉంటారు. చూడటానికి కూడా రెండూ ఒకేలా ఉంటాయి. అందుకే, చాలా మంది రెండూ ఒకటే అనుకొని పొరపాటుపడుతూ ఉంటారు. కానీ, ఈ రెండింటి పనితీరు విషయంలో మాత్రం భూమి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఒకదానికి బదులు మరొకటి వాడితే... వంట రుచి మారిపోతుంది. మరి, ఈ రెండింటి తేడా ఏంటి? దేనిని దేనికి వాడాలో ఇప్పుడు చూద్దాం...
ఈ రెండింటికీ తేడా ఏంటి?
బేకింగ్ సోడాని మనం వంట సోడా అని కూడా పిలుస్తాం. దీని శాస్త్రీయ నామం బైకార్బోనేట్. ఈ బేకింగ్ సోడా ఒంటరిగా పనిచేయదు. దీనికి పెరుగు, మజ్జిగ, నిమ్మరసం,వెనిగర్ లాంటి యాసిడ్ ఫుడ్స్ తో కలిసినప్పుడు ఇదే పని చేస్తుంది. వీటితో కలవకపోతే...ఈ బేకింగ్ సోడా సరిగా పనిచేయదు. పైగా ఫుడ్ రుచి కూడా చేదుగా మారుతుంది.
బేకింగ్ పౌడర్ అనేది ఒక కంప్లీట్ మిశ్రమం. ఇందులో బేకింగ్ సోడాతో పాటు, పొడి రూపంలో ఉండే ఆమ్లం, తేమను పీల్చుకోవడానికి కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిసి ఉంటాయి. ఇది న్యూట్రల్‌గా ఉంటుంది. దీనికి బయటి నుండి ఎలాంటి పులుపు పదార్థాలు కలపాల్సిన అవసరం లేదు. దీనికి కొద్దిగా నీరు లేదా పాలు తగలగానే, ఆ తర్వాత ఓవెన్/స్టవ్ వేడి తగలగానే దానంతట అదే రియాక్ట్ అయి పిండిని పొంగేలా చేస్తుంది. దీన్ని డబుల్ యాక్టింగ్ అని కూడా అంటారు. దీనిని ఎక్కువగా కేక్ లాంటి వాటికి వాడతారు.
ఈ రెండూ ఎలా పని చేస్తాయంటే...
బేకింగ్ సోడా అనేది చాలా శక్తివంతమైనది. బేకింగ్ పౌడర్ కంటే ఇది 3-4 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆమ్లం కలిపిన వెంటనే ఇది పనిచేయడం మొదలవుతుంది. కాబట్టి దీన్ని చాలా తక్కువగా అంటే చిటికెడు లేదా పావు స్పూన్ మాత్రమే వాడాలి. అలాగే బేకింగ్ సోడా వేసిన పిండిని ఎక్కువసేపు బయట ఉంచకూడదు, వెంటనే వండేయాలి. లేదంటే పిండి పాడైపోతుంది.
బేకింగ్ పౌడర్ విషయానికి వస్తే, ఇది బేకింగ్ సోడాతో పోలిస్తే కాస్త మృదువైనది. తడి తగిలినప్పుడు ఒకసారి, వేడి తగిలినప్పుడు మరోసారి ఇది పొంగుతుంది. దీన్ని కాస్త ఎక్కువ పరిమాణంలో అంటే 1 టీస్పూన్ వరకు వాడవచ్చు. వేడి తగిలినప్పుడే ఇది పూర్తిగా పనిచేస్తుంది కాబట్టి కాస్త సమయం తీసుకున్నా పర్వాలేదు.
మన రోజువారీ వంటల్లో వేసే బజ్జీలు, బోండాలు, పకోడీలు క్రిస్పీగా, గుల్లగా రావడానికి; ఇడ్లీ, దోశ పిండి త్వరగా పులియడానికి; శనగలు, రాజ్మా వంటివి త్వరగా ఉడకడానికి, పెరుగు లేదా మజ్జిగ వాడి చేసే బనానా బ్రెడ్, చాక్లెట్ కేకులు, కుకీల తయారీలో బేకింగ్ సోడాను వాడాలి.
ఎలాంటి పులుపు పదార్థాలు వాడకుండా కేవలం పాలు, గుడ్లు, మైదాతో చేసే స్పాంజ్ కేకులు, కప్ కేకులు, మఫిన్స్ మెత్తగా పొంగడానికి; అలాగే పాన్‌కేక్స్, వాఫిల్స్ , బిస్కెట్ల తయారీలో బేకింగ్ పౌడర్‌ను వాడాలి.













