Anti Aging Tips: 30 ఏళ్లకే 50 ఏళ్ల వారిలా కనిపిస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
Anti Aging Tips: చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, కళ్ల కింద డార్క్ సర్కిల్స్, ముఖంలో కాంతి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయా? 30 ఏళ్లకే 50 ఏళ్ల వారిలా కనిపిస్తున్నామని బాధపడుతున్నారా? మరి చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

యాంటీ ఏజింగ్ చిట్కాలు
వయసు పెరగడాన్ని ఎవరూ ఆపలేరు. కానీ మన రోజువారీ జీవనశైలి మార్పులతో చర్మం త్వరగా ముడతలు పడకుండా, ఆరోగ్యంగా, తాజాగా, కాంతివంతంగా ఉండేలా చేసుకోవచ్చు. నిపుణుల ప్రకారం.. వయసు ప్రభావం త్వరగా కనిపించకుండా ఉండేందుకు పాటించాల్సిన ఈజీ యాంటీ ఏజింగ్ టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కంటి నిండా నిద్ర
శరీరంలో కణాలు సహజంగా పునరుత్పత్తి కావాలంటే నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమి వల్ల కళ్ల కింద వాపు, డార్క్ సర్కిల్స్ వస్తాయి. ముఖం అలసిపోయినట్లు, కళావిహీనంగా కనిపిస్తుంది. రోజూ ఒకే సమయానికి పడుకోవడం, కనీసం 7 గంటల పాటు నిద్రపోవడం వల్ల చర్మం దానంతట అదే రిపేర్ చేసుకుంటుంది.
ఎండ నుంచి చర్మ రక్షణ
సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలు చర్మం దృఢత్వానికి కారణమయ్యే 'కొల్లాజెన్', 'ఎలాస్టిన్'లను దెబ్బతీస్తాయి. దీంతో చిన్న వయసులోనే ముడతలు, మచ్చలు వస్తాయి. చర్మం రంగు మారుతుంది. దీన్ని నివారించడానికి సన్‌స్క్రీన్ వాడాలి. ఎండలో వెళ్లేటప్పుడు రక్షణగా ఉండే దుస్తులు ధరించాలి. మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారం, నీరు
ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉండే ఫుడ్ శరీరంలో మంటను కలిగించి చర్మం యవ్వనాన్ని దెబ్బతీస్తాయి. వీటికి బదులుగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. సిట్రస్ పండ్లు, బెర్రీలు, గింజలు, కూరగాయలు తినాలి. రోజూ తగినంత నీరు తాగడం చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
ఒత్తిడి తగ్గించుకోవడం
అధిక పనిభారం, విశ్రాంతి లేకపోవడం వల్ల వచ్చే నిరంతర ఒత్తిడి శరీరంలో 'కార్టిసాల్' హార్మోన్‌ను పెంచుతుంది. ఇది చర్మ రక్షణ పొరను దెబ్బతీసి మొటిమలు, చర్మం ఎర్రబడటం, అలసటకు దారితీస్తుంది. వ్యాయామం, ధ్యానం, మంచి నిద్ర ద్వారా ఒత్తిడిని నియంత్రించుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
రెగ్యులర్ స్కిన్ కేర్
చర్మానికి తగినంత తేమను అందించకపోవడం, తప్పు ఉత్పత్తులను వాడటం వల్ల చర్మం పొడిబారి, గరుకుగా మారుతుంది. రోజూ మైల్డ్ క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడాలి. అవసరమైతే చర్మ నిపుణుల సలహాతో రెటినాయిడ్స్, విటమిన్ సి, నియాసినామైడ్ లేదా హైలురోనిక్ యాసిడ్ ఉపయోగించవచ్చు. ఈ టిప్స్ ని రెగ్యులర్ గా ఫాలో కావడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.














