Gold cleaning: బంగారు నగల మెరుపు తగ్గిందా? అయితే ఇలా చేయండి!
బంగారం ఇష్టం లేని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు. అవకాశం వస్తే ఎంత బంగారం వేసుకోవడానికైనా రెడిగా ఉంటారు. ఆర్థిక స్థితిని బట్టి ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటారు. కొందరు కొన్ని నగలు రోజూ పెట్టుకుంటారు. మరికొందరు కొన్నింటిని దాచి పెట్టుకుంటారు. అయితే ఎలా చేసినా దుమ్ము, మురికి కారణంగా బంగారం మెరుపు కాస్త తగ్గిపోతుంది. మరి అలాంటప్పుడు ఈజీగా బంగారాన్ని దగదగ ఎలా మెరిపించాలో ఇక్కడ చూద్దాం.

ఆడవాళ్లకు బంగారు నగలంటే ఎప్పుడూ ఇష్టమే. వీలు దొరికితే చాలు రకరకాల డిజైన్ల నగలు కొని ఇంట్లో పెట్టుకుంటారు. కానీ బంగారు నగలు వాడటం వల్ల వాటిపై మురికి, నూనె పేరుకుపోయి మెరుపు కాస్త తగ్గిపోతుంటుంది. కొనేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా లేదే అనిపిస్తుంటుంది.
ఇంట్లోనే గోల్డ్ ఎలా శుభ్రం చేయాలి?
దీంతో చాలామంది ఆడవాళ్లు బంగారు షాపుకు వెళ్లి పాలిష్ చేయించుకుంటారు. కానీ పాలిష్ చేసేటప్పుడు నగల్లో కొంచెం బంగారం తగ్గే అవకాశం ఉంటుంది. బంగారం ధరలు ఆకాశాన్నంటే ఈ రోజుల్లో పాలిష్ చేసి బంగారం తగ్గించుకోవడం ఎందుకు? ఇంట్లోనే సులువుగా బంగారం శుభ్రం చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం.
డిష్ వాష్ తో ఇలా చేస్తే?
ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకోండి. అందులో కొన్ని చుక్కల డిష్‌వాష్ వేసి బాగా కలపండి. తర్వాత బంగారు నగలను అందులో వేయండి. 15 నిమిషాల తర్వాత టూత్‌బ్రష్‌తో నగల్లోని మురికిని మెల్లగా రుద్ది శుభ్రం చేయండి. తర్వాత నీటితో నగలను కడగండి. చివరగా ఒక క్లాత్ తో నగలను తుడిచి ఆరబెట్టండి.
వేడి నీళ్లతో..
ఒక పెద్ద గిన్నెలో కొద్దిగా వేడి నీళ్లు తీసుకోండి. అందులో బంగారు నగలను వేయండి. కొన్ని నిమిషాల్లోనే నగలకు పట్టిన మురికి, నూనె వదిలిపోతుంది. తర్వాత మెత్తటి బ్రష్‌తో నగలను శుభ్రం చేసి క్లాత్ తో తుడవండి.
టూత్ పేస్ట్
కొంచెం టూత్‌పేస్ట్ తీసుకుని నగలపై మెల్లగా రుద్దండి. తర్వాత ఒక మెత్తటి బట్టతో నగలను శుభ్రం చేయండి. దీంతో నగలకు పట్టిన దుమ్ము, ధూళి పోతుంది. తర్వాత నీటితో నగలను కడగండి. టూత్‌పేస్ట్ నగలకు పట్టిన మురికిని వదిలించి మెరిసేలా చేస్తుంది.
షాంపూ
వేడి నీటిలో కొంచెం షాంపూ కలిపి, మెత్తటి బ్రష్‌తో నగలను సున్నితంగా శుభ్రం చేయాలి. ముత్యాలు, పగడాలు పొదిగిన నగలను షాపులో శుభ్రం చేయించడమే మంచిది.