Hot Porridge: చలికాలంలో చిటికెడు ఉప్పు వేసుకుని వేడి వేడి గంజి తాగారంటే ఎన్నో లాభాలు
Hot Porridge: పూర్వం గంజిని ప్రతిరోజూ తాగేవారు, గంజి అన్నమే తినేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గంజి అంటే చాలామందికి తెలియదు. నిజానికి చలికాలంలో వేడి వేడి గంజి తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఒకప్పుడు గంజే ఔషధం
గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు గంజినే తాగేవారు. ఇప్పుడంటే రకరకాల బ్రేక్ ఫాస్ట్‌లు వచ్చాయి. కానీ అప్పట్లో ఉదయాన అల్పాహారంగా గంజి అన్నం తినేవారు. అందుకే ఆరోగ్యంగా ఉండేవారని చెప్పుకుంటారు. పూర్వకాలం నుంచి వస్తున్న గంజి మన ఆహారాల్లో ముఖ్యమైనది. బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి ధాన్యాలతో అనేక రకాల గంజిల్ని తయారుచేస్తారు. ఉదయం లేదా రాత్రి వేడివేడి గంజి తాగడం వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యం లభిస్తుందని చెబుతారు. ముఖ్యంగా చలికాలంలో వేడివేడి గంజిలో చిటికెడు ఉప్పు వేసుకొని ఉదయాన్నే తాగితే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్న నేటి యువత వారానికి రెండు మూడు సార్లు అయినా గంజి తాగాల్సిన అవసరం ఉంది. ఇది శరీరానికి ఎంతో హాయిని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
ఈ సమస్యలు మాయం
వేడివేడి గంజి తాగడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. గంజి చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారం. పొట్టపై భారం పడనివ్వదు. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు.. రోజూ గంజి తాగేందుకు ప్రయత్నించాలి. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, విరేచనాలు అవుతున్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు గంజి తాగితే త్వరగా కోలుకుంటారు. ఇక కడుపులో ఇబ్బంది, మంట, అసౌకర్యం ఉన్నవాళ్లు వేడి గంజిని తినడం, తాగడం వల్ల ఆ సమస్య నుంచి త్వరగా బయటపడతారు. పిల్లలు, వృద్దులు కూడా గంజిని తాగడం చాలా అవసరం. పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు గంజిని తాగితే అవి త్వరగా తగ్గుతాయి.
బియ్యం గంజే కాదు
గంజిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కొంతమేర ప్రోటీన్లు నిండి ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి. శారీరక శ్రమ చేసేవారు గంజిని ప్రతిరోజూ తాగితే రోజంతా చురుగ్గా పనిచేయగలుగుతారు. ఇక జ్వరము, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు వేడి గంజిని తాగితే శరీరానికి ఉష్ణోగ్రత అందుతుంది. దీనివల్ల ఆ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. కేవలం బియ్యంతోనే కాదు, రాగి, జొన్నలతో కూడా గంజి చేస్తారు. వాటిలో ఐరన్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ఇలా రాగి, జొన్నలతో చేసిన గంజిని తాగితే మంచిది.
గంజితో షుగర్, బీపీ కంట్రోల్
ప్రస్తుత కాలంలో అధిక బరువు, షుగర్, బీపీ వంటి వ్యాధులతో బాధపడేవారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వీరు గంజి వంటి సాంప్రదాయ ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. గంజిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుతుంది. రాత్రి భోజనంగా వేడి గంజి తీసుకుంటే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుందని చెబుతారు. ఖరీదైన ఆహారాల కన్నా తక్కువ ఖర్చుతో తయారయ్యే గంజి ఆరోగ్యానికి వరమనే చెప్పాలి.

