శనివారం ఈ తప్పులు అస్సలు చేయకండి.. శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు
హిందు శాస్త్రంలో ఎన్నో నమ్మకాలు ఉంటాయి. ముఖ్యంగా శని భగవానుడి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రంగా భావించే శనివారం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఇంతకీ శనివారం ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అసలు శాస్త్రం ఏం చెబుతోంది? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనివారం ఎట్టి పరిస్థితుల్లో కొత్త చీపురు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. శనివారం రోజున కొత్త చీపురు కొనుగోలు చేస్తే శని దేవుడు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే శనివారం ఈ పనిని వాయిదా వేసుకోవడం మంచిది. ఇక శనివారం నల్లటి దుస్తులు ధరిస్తే మంచిదని భావిస్తుంటారు. అయితే బ్లాక్ షూస్ ధరించడం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. మరీ ముఖ్యంగా ఏదైనా శుభ కార్యం కోసం బయటకు వెళితే, అపజయం వచ్చే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు.
శనివారం ఎట్టి పరిస్థితుల్లో కత్తెర కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈరోజున కత్తెర కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కత్తెర సంబంధంలో చీలిక తెస్తుందని నమ్ముతారు. అందుకే శనివారం కత్తెర కొనుగోలు చేయకూడదు. శనివారం రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఎరుపు రంగులో ఉన్న వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదని అంటున్నారు.
సాధారణంగా ఎరుపు రంగును అంగారకుడికి సూచనగా భావిస్తుంటారు. కుజుడు ,శని రెండు వ్యతిరేక గ్రహాలు కావడంతో ఇబ్బందులకు దారి తీస్తయని విశ్వసిస్తారు. శనివారం రోజును ఎవరికీ ఉప్పును దానంగా ఇవ్వకూడదని నిపుణులు అంటున్నారు. శనివారం రోజున ఉప్పును దానం చేసినా, లేదా స్వీకరించినా రుణగ్రస్తుడిగా మారుతారని నమ్ముతారు. అంతేకాకుండా శనివారం రోజున ఉప్పును కొనుగోలు చేయడం కూడా మంచిది కాదని అంటున్నారు. ఇలా చేస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
rosemary oil
ఇక శనివారం రోజు ఇనుముతో చేసిన వస్తువులను కొనుగోలు చేయడం కూడా మంచిది కాదని శాస్త్రం చెబుతోంది. శనివారం రోజున ఇలాంటి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల శనిదేవుని ఆగ్రహానికి దారితీస్తుంది. ఇక ఇంట్లో కొత్తగా కొనగోలు చేసిన ఇనుము వస్తువులు ఉన్నా సరే వాటిని శనివారం మొదటిసారి ఉపయోగించకూడదని అంటున్నారు. అలాగే శనివారం రోజున ఆవనూనె కొనకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనివారం నాడు శనికి నూనె నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ కాబట్టి ఈ రోజు ఎవరికైనా దానం చేస్తేనే నూనె కొనండి. అలాగే శనివారం నాడు కొనే ఆవనూనెను ఆహారంగా వాడితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటుంటారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.