ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకుంటే పిల్లలు నల్లగా పుడతారా?
గర్భిణులు సాధారణంగా ఐరన్ ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు. అయితే ఈ ట్యాబ్లెట్ల వల్ల పిల్లల రంగు మారుతుందని కొందరు అంటున్నారు. మరి దీనిపై గైనకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే..
గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టైంకి తినాలి. విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైన తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా డాక్టర్ సజెస్ట్ చేసిన మందులను తప్పకుండా వేసుకోవాలి. అయితే ఐరన్ మాత్రలను మహిళలు ఆరోగ్యానికి, సంతానోత్పత్తికి ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో పిల్లల ఎదుగుదల, తల్లి ఆరోగ్యం బాగుండాలని ఐరన్ మాత్రలను ఇస్తుంటారు డాక్టర్లు. గర్భధారణ సమయంలో తల్లికి ఐరన్ చాలా అవసరం. వీరి శరీరలో తగినంత ఇనుము తీసుకోకపోతే.. రక్తహీనత సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
pregnancy
గర్భిణీ స్త్రీలలో ఐరన్ లోపం తలెత్తకుండా చాలా మంది వైద్యులు ఐరన్ మాత్రలను సిఫార్సు చేస్తుంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ మాత్రలను తీసుకోవడం వల్ల శిశువు రంగు నల్లగా మారుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? ఐరన్ మాత్రలు శిశువు రంగును ప్రభావితం చేస్తాయో? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భధారణ సమయంలో ఐరన్ మాత్రలను వేసుకోవడం వల్ల పిల్లల రంగు ఏ మాత్రం మారదు. అయితే గర్భిణులకు ఐరన్ కంటెంట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్ తయారుచేయడానికి సహాయపడుతుంది. తల్లులు తగినంత ఇనుము తీసుకోకపోతే రక్తహీనత సమస్య బారిన పడే ప్రమాదముంది. ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
ఐరన్ మాత్రలను వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి ఐరన్ కంటెంట్ ఎక్కువగా అవసరమవుతుంది. శరీరంలో ఐరన్ లెవల్స్ బాగా ఉంటే జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఐరన్ లోపంతో రక్తహీనత సమస్య వస్తే .. పిల్లలు డెలివరీ డేట్ కంటే ముందే పుట్టే అవకాశం ఉంది.
తల్లి శరీరంలో ఐరన్ లోపించడం వల్ల బిడ్డ మానసిక, శారీరక అభివృద్ధిపై చెడు ప్రభావం పడుతుంది. చాలా మంది మహిళల్లో ప్రెగ్నెన్సీ ప్రారంభంలో వారి శరీరంలో తక్కువ హిమోగ్లోబిన్ ఉంటుంది. గర్భధారణ సమయంలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. శిశువు శారీరక, మానసిక ఎదుగుదల కోసం గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఐరన్ మాత్రమే వేసుకోవాలి. ఈ మాత్రలను రెండవ త్రైమాసికం ప్రారంభం నుంచి ప్రతిరోజూ వేసుకోవాలి. గర్భధారణ అయిపోయే వరకు, తల్లి పాలిచ్చేటప్పుడు కూడా ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇనుము చాలా ముఖ్యమైనది కాబట్టి.. మీరు ఐరన్ ట్యాబ్లెట్లతో పాటుగా మీరు తినే ఆహారం ద్వారా కూడా దీన్ని పొందొచ్చు. దీని కోసం మీ ఆహారంలో ధాన్యాల పరిమాణాన్ని పెంచండి. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలను ఎక్కువగా తినండి. సరైన ఆహారం, ఐరన్ మాత్రల సహాయంతో మీ శరీరానికి ఇనుమును అందించొచ్చు.