వెల్లుల్లి తింటే క్యాన్సర్ ఎప్పటికీ రాదా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
వెల్లుల్లి తింటే చాలు క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని కణాలు చనిపోతాయని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కానీ, నిజంగా వెల్లుల్లికి క్యాన్సర్‌ను నయం చేసే శక్తి ఉందా? దీనిపై వైద్య పరిశోధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.

వెల్లుల్లి తింటే క్యాన్సర్ రాదా?
భారతీయ వంటల్లో వెల్లుల్లి కచ్చితంగా ఉంటుంది. ఇది కూరల రుచిని పెంచడమే కాదు.. మంచి సువాసనను అందిస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికంగానే ఉంటాయి. అయితే ఎవరైతే రోజూ రోజూ వెల్లుల్లి తింటారో వారికి క్యాన్సర్ రాదనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఇదెంత వరకు నిజమో తెలుసుకోండి.
వైద్యులు చెబుతున్న ప్రకారం వెల్లుల్లి క్యాన్సర్‌కు మందు కాదు. వెల్లుల్లిని కోసినప్పుడు లేదా దంచినప్పుడు, అందులోని కొన్ని సమ్మేళనాలు 'అల్లిసిన్' వంటి సల్ఫర్ కాంపౌండ్స్‌ను ఏర్పరుస్తాయి. పరిశోధనల్లో, వెల్లుల్లిలోని కొన్ని బయోయాక్టివ్ కాంపౌండ్స్... క్యాన్సర్ ఏర్పడటానికి కారణమయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్, కణాల పెరుగుదల వంటి ప్రక్రియలపై ప్రభావం చూపుతాయని తేలింది. 'వెల్లుల్లి క్యాన్సర్‌ను నాశనం చేస్తుంది' అనే అభిప్రాయం రావడానికి ఇదే కారణం కావచ్చు. కానీ పరిశోధనల్లో ఒక సమ్మేళనం క్యాన్సర్ కణాలపై ప్రభావం చూపడం వేరు. మనుషులు వెల్లుల్లి తినడం వల్ల అప్పటికే ఉన్న క్యాన్సర్ నయం కావడం జరగదు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
వెల్లుల్లి వంటి అల్లియమ్ కూరగాయల వాడకం, క్యాన్సర్ రిస్క్‌పై అనేక అధ్యయనాలు జరిగాయి. దాని ప్రకారం అల్లియమ్ కూరగాయలను ఎక్కువగా తినడం వల్ల మొత్తం క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందనడానికి ఆధారాలు లేవు. కాబట్టి వెల్లుల్లి క్యాన్సర్‌ను నివారిస్తుందని లేదా చికిత్స చేస్తుందని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు.
క్యాన్సర్ ఉంటే వెల్లుల్లి తినవచ్చా?
క్యాన్సర్ వచ్చే అవకాశాలకు జన్యుపరమైన కారణాలు, వయస్సు, పొగాకు, మద్యపానం, శరీర బరువు, వ్యాయామం, ఆహారపు అలవాట్లు, కొన్ని ఇన్ఫెక్షన్లు, పర్యావరణ కారకాలు ఇలా ఎన్నో ఉంటాయి. క్యాన్సర్ ఉన్న వెల్లుల్లి తినకూడదని ఎక్కడా చెప్పలేదు. వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడ బలంగా మారుతుంది. క్యాన్సర్ ఉన్నవారు డాక్టర్లు సూచించిన సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి చికిత్సలను వెల్లుల్లి లేదా మరే ఇతర ఇంటి చిట్కా కోసమో ఆపకూడదు, ఆలస్యం చేయకూడదు.

