Curd in Winter: చలికాలంలో పెరుగు తింటే జలుబు వస్తుందా? పిల్లలకు పెట్టవచ్చా?
Curd in Winter: చలికాలంలో పెరుగు తినకూడదని, తింటే జలుబు చేస్తుందని కొంతమంది నమ్మకం. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం పెరుగు శీతాకాలంలో తినవచ్చా? లేదా? పిల్లలకు పెట్టవచ్చా? అనే విషయాలు తెలుసుకోండి.

పెరుగుతో ఆరోగ్యం
పెరుగు ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. పెరుగులో ఉండే ఎన్నో పోషకాలు మన శరీరానికి అత్యవసరం. మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పోషకాలు దీనిలో నిండుగా ఉన్నాయి. కానీ చలికాలంలో పెరుగు తినకూడదని, జలుబు చేస్తుందని ఎంతోమంది అనుకుంటారు. ఇందులో నిజమెంత? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.
చలువ చేసే గుణం
చలికాలంలో వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. చలిగాలులు వీస్తూ ఉంటాయి. ఇక పెరుగు కూడా చల్లగానే ఉంటుంది. ఇది చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి చల్లగా ఉన్న పెరుగు లేదా ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. అలాంటి పెరుగు తినడం వల్ల గొంతు నొప్పి లేదా జలుబు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకే చల్లగా ఉన్న పెరుగును తినకూడదు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగునే తినాలి.
చలికాలంలో పెరుగు తింటే
పెరుగులోని ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తాయి. పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జలుబు, దగ్గు నుంచి రక్షణ కల్పిస్తుంది. చలికాలంలో జీర్ణక్రియను సులువుగా మార్చి అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
పెరుగు తింటే లాభాలు
చలికాలంలో ఎవరికైనా చర్మం పొడిబారుతుంది. కాబట్టి చర్మం కోసం పెరుగు తినాల్సిన అవసరం ఉంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పెరుగును ఫేస్ ప్యాక్‌గా వేసుకోవాలి. పెరుగులోని కాల్షియం, విటమిన్ డి వంటివి అధికంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు, దంతాలు బలంగా మారుస్తాయిి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఫ్రిజ్‌లోంచి తీసి వెంటనే పెరుగు ఎప్పుడూ తినకండి. దీనివల్ల గొంతునొప్పి, దగ్గు, జలుబుకు కారణం కావచ్చు. గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగు తినడం మంచిది. రాత్రి పూట పెరుగు తినడం మంచిది కాదు. ఇలా తింటే శరీరంలో కఫం పెరిగిపోతుంది. అందుకే ఉదయం లేదా మధ్యాహ్నం పెరుగు తినాలి. దగ్గు, జలుబు ఉన్నవారు పెరుగను చాలా తక్కువగా తినాలి. జలుబు, దగ్గు లేదా సైనసైటిస్ తో బాధపడేవారు పెరుగు తినడం కొన్ని రోజులు తినకపోవడమే మంచిది.

