Lemon Water: నిమ్మనీళ్లు ప్రతిరోజూ తాగితే హైబీపీ తగ్గిపోతుందా?
Lemon Water: నిమ్మ రసం కలిపిన నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే హైబీపీ ఉన్నవారు ఈ నీళ్లను తాగితే ఏం జరుగుతుంది? బీపీ తగ్గే అవకాశం ఉందా?

నిమ్మనీళ్లపై నమ్మకం
నింబూ పానీ లేదా నిమ్మ నీళ్లు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే శరీరం శుద్ధి అవుతుందని, అనేక సమస్యలు దూరమవుతాయనే నమ్మకం ఉంది. ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవాళ్లు కూడా నిమ్మ నీళ్లు తాగితే బీపీ నియంత్రణలోకి వస్తుందనే అభిప్రాయ ఎక్కువ మందికి ఉంది. ఈ విషయంపై వైద్యులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి. నిమ్మ నీళ్లు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? అది రక్తపోటును ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం. వైద్యులు చెబుతున్న ప్రకారం నిమ్మ నీళ్లు తాగితే మంచిదే కానీ కేవలం దీని వల్లే అధికరక్త పోటు తగ్గిపోదు. ఇది ఒక సహాయక పానీయం మాత్రమే కానీ మందులకు ప్రత్యామ్నాయం కాదు అని వారు వివరించారు.
నిమ్మలో ఉండే పోషకాలు
నిమ్మ నీళ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహకరిస్తాయి. రక్తనాళాలు కొద్దిగా సాఫ్ట్‌గా ఉండేందుకు సహాయపడతాయి. దాంతో రక్తప్రసరణ కొంత మెరుగవుతుంది. ఈ కారణంగా కొందరిలో బీపీ స్థాయిలు స్వల్పంగా తగ్గినట్లు అనిపించవచ్చు. అంతేకాదు నిమ్మనీళ్లు తాగటం వల్ల శరీరానికి సరిపడా నీరు అందుతుంది. శరీరం బాగా హైడ్రేట్ అయినప్పుడు గుండె పనితీరు కూడా కొంత మెరుగ్గా ఉంటుంది. ఇవన్నీ కలిపి చూసినప్పుడు నిమ్ము పానీ రక్తపోటు ఉన్నవాళ్లకు కొంత మేలు చేయవచ్చని వైద్యులు అంటున్నారు.
బీపీ పూర్తిగా తగ్గిపోతుందా?
ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిమ్మనీళ్లు తాగితే బీపీ పూర్తిగా తగ్గిపోతుంది అనుకోవడం పొరపాటు. అధిక రక్తపోటు ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే డాక్టర్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడటం చాలా అవసరం. నిమ్ము పానీ తాగుతున్నాను కదా అని మందులు మానేయడం లేదా తగ్గించడం ప్రమాదకరం. వైద్యులు స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే నిమ్మనీళ్లు ఒక సహాయక డ్రింకు మాత్రమే. చికిత్,స మందులు, సరైన ఆహార నియమాలు, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ వంటి అంశాల మీదే ఆధారపడి ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
నిమ్మనీళ్లు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఎక్కువగా తాగితే దంతాలకు సమస్యలు రావచ్చు. నిమ్మ కయంలో ఉండే ఆమ్లం దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే కడుపు మంట, గ్యాస్ సమస్యలు ఉన్నవాళ్లకు ఇబ్బందులు కలగవచ్చు. అందుకే రోజూ ఎక్కువ మోతాదులో కాకుండా పరిమితంగా తాగడం మంచిది. మొత్తంగా చెప్పాలంటే నిమ్మ రసం ఆరోగ్యానికి మంచిదే. ఇది శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. రక్తనాళాల ఆరోగ్యానికి కొంత మేలు చేస్తుంది. కానీ అధిక రక్తపోటు సమస్యకు ఇది పూర్తిస్థాయి పరిష్కారం కాదు. డాక్టర్ సూచించిన చికిత్సతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తేనే బీపీ నియంత్రణలో ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.

