గోర్లను కొరికే అలవాటుందా? అయితే మీకు ఈ జబ్బులొస్తయ్ జాగ్రత్త..
చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మందికి గోర్లను కొరికే అలవాటు ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడో, ఒత్తిడి పెరిగినప్పుడో.. ఈ అలవాటు బయటపడుతుంది. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

గోర్లను కొరికే అలవాటు చాలా మందికి ఉంటుంది. చిన్నపిల్లలు, యువత, మధ్యవయస్కులు అంటూ వందలో యాభై మందికి ఈ అలవాటు పక్కాగా ఉంటుంది. ఈ గోర్లను వివిధ సందర్భాల్లో కొరుకుతుంటారు. యువత, పెద్దవారు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు, ఒక విషయం గురించి తీక్షణంగా ఆలోచిస్తున్నప్పుడు గోర్లను తెగ కొరికేస్తుంటారు. ఇక చిన్నపిల్లలైతే సమయం, సందర్భం అంటూ ఏదీ లేకుండా ఎప్పుడూ చూసినా గోర్లను కొరుకుతూనే ఉంటారు.
కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య పరిభాషలో గోర్లు కొరికే అలవాటును ఒనికోఫాగియా (Onychophogia) అంటారు. ఇది కూడా ఒకలాంటి వ్యాధే. ఆందోళన (Anxiety), ఒత్తిడి (Stress) పెరిగినప్పుడు గోర్లను తెగ కొరికేస్తుంటారు.
కొన్ని నివేధికల ప్రకారం.. గోర్లను కొరకడం కూడా వ్యాధే. ఇది మనసులో ఆలోచనలు పెరిగిపోయినప్పుడు, నిస్సహాయంగా ఉన్నప్పుడు, ఒత్తిడి, ఆందోళనలు పెరిగినప్పుడు ఇలా చేయాలనిపిస్తుంది. అయితే గోర్లను కొరికే అలవాటుకు చాలా కారణాలుంటాయని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్తలు వెల్లడిస్తున్నాయి. టెన్షన్ గా ఫీలవ్వడం, ఒత్తిడి, నీరసం వంటి కారణాల వల్ల కొంతమంది గోర్లను కొరుకుతారు. మరికొంతమందేమో.. ఆకలిగా ఉంటే కూడా గోర్లను కొరుకుతారు.
కానీ ఇలా గోర్లను కొరకడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మానసికంగా హెల్త్ పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక గోర్ల చుట్టూ ఉండే స్కిన్ లో ఎన్నో క్రిమికీటకాలుంటాయి. గోర్లను కొరకడం వల్ల అవి పొట్టలోకి పోయి.. ఎన్నో సమస్యలను పుట్టిస్తాయి. దీనివల్ల ఉదర సమస్యలు వస్తాయి. గోర్ల చిగుళ్లు , పొత్తి కడుపు వాపు, వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఫంగస్, బ్యాక్టీరియాలు నోటిని దెబ్బతీస్తాయి. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో కాల్షియం లోపం ఉంటే కూడా గోర్లను కొరకాలనిపిస్తుందట. అందుకే కాల్షియం ఎక్కువగా ఉండే.. పాలను, పాల ఉత్పత్తులను తీసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు.
ఇక గోర్లను కొరకాలనిపించినప్పుడల్లా.. మీ మనస్సును వేరే దానిపై మళ్లించాలి. ఒక ఆందోళన, ఒత్తిడి పెరగకుండా ధ్యానం, యోగాను చేయాలి.
గోర్లను కొరికే అలవాటు మానాలంటే.. గోర్లను పెరగకుండా జాగ్రత్త పడండి. ఎప్పటికప్పుడు కత్తిరించండి. ఎందుకంటే గోర్లు మరీ చిన్నగా ఉన్నప్పుడు వాటిని మీరు కొరకలేరు. ఒకవేళ కొరికినా చిగుళ్లు నొప్పి పుడతాయి. దీంతో గోర్లను కొరికే అలవాటు పోతుంది.