Rice Water: బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తున్నారా? ఆ నీటిని ఎలా వాడాలో తెలుసా?
Rice Water: అన్నం వండటానికి ముందు బియ్యం కడగడం అందరూ చేస్తారు. కానీ, ఆ బియ్యం కడిగిన నీటిని ఏం చేస్తున్నారు? పారబోస్తున్నారా? ఆ నీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

బియ్యం నీటిని పారబోస్తున్నారా?
బియ్యం కడిగిన నీళ్లు వేస్ట్ అనుకొని పారబోస్తున్నారా? అయితే, మీరు ఒక అద్భుతమైన నేచురల్ బ్యూటీ అండ్ హోమ్ కేర్ సీక్రెట్ మిస్ అవుతున్నట్లే. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఈ బియ్యం నీరు.. ఖరీదైన కండిషనర్లు, టోనర్లకు ఏ మాత్రం తీసిపోదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే ఈ బియ్యం నీటిలో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? ఆ నీటిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం...
హెయిర్ కండిషనర్...
బియ్యం నీటిలో అమైనో యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే జుట్టును అందంగా మార్చడానికి ఈ నీటిని వాడుకోవచ్చు. ఈ నీటిని జుట్టు కోసం ఎలా వాడాలి అంటే... షాంపూతో తలస్నానం చేసిన తర్వాత, బియ్యం కడిగిన నీటిని జుట్టుకు పట్టించి మృదువుగా మసాజ్ చేయాలి. కొన్ని నిమిషాలపాటు అలానే ఉంచి, తర్వాత సాధారణ నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. జుట్టు చిక్కులు కూడా పడవు. జుట్టు స్మూత్ గా పట్టుకుచ్చులా మారుతుంది.
ఫేస్ టోనర్ గా....
మీ చర్మానికి బియ్యం నీళ్లు ఒక అద్భుతమైన టోనర్ లా పని చేస్తుంది. ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత.. ఈ బియ్యం నీటిలో కాటన్ ముంచి.. ముఖం మొత్తం అద్దుకోవాలి. ఇందులో పోషకాలు చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి, ముఖానికి సహజమైన కాంతిని ఇస్తాయి. మరింత మెరుగైన ఫలితం కోసం బియ్యం నీటిని 30 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచి చల్లగా వాడితే.. ముఖం మరింత తాజాగా కనపడుతుంది.
మొక్కలకు సహజ ఎరువు..
మీ ఇంటి తోటలోని మొక్కలకు కూడా బియ్యం నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. మొక్కల ఎదుగుదలకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఇందులో మెండుగా ఉంటాయి. ఎలా వాడాలి అంటే... బియ్యం కడిగిన నీళ్లు లేదా అన్నం వార్చిన గంజి చల్లారిన తర్వాత వారానికి ఒకసారి ఇండోర్ , అవుట్డోర్ మొక్కలకు పోయండి. అయితే ఆ నీటిలో ఉప్పు లేదా ఇతర మసాలాలు కలవకుండా జాగ్రత్త పడండి.
4. చర్మ సమస్యలకు ఉపశమనం..
మీకు పొడి చర్మం లేదా సెన్సిటివ్ స్కిన్ సమస్య ఉంటే, బియ్యం నీటి స్నానం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా వాడాలి అంటే... మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా బియ్యం నీటిని కలిపి 10-15 నిమిషాల పాటు స్నానం చేయండి. బియ్యం నీటిలోని స్టార్చ్ చర్మంపై వచ్చే మంటను తగ్గించి, తేమను అందిస్తుంది. ముఖ్యంగా ఎండ వల్ల కమిలిన చర్మానికి ఇది ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది.
5. కిచెన్ క్లీనర్‌గా వాడుకోవచ్చు..
బియ్యం నీటిలో సహజమైన శుభ్రపరిచే గుణాలు ఉంటాయి. ఒక శుభ్రమైన క్లాత్ ని బియ్యం నీటిలో ముంచి, వంటగది కౌంటర్ టాప్స్, సింక్లు ఇతర ఉపరితలాలను తుడవండి. ఇందులోని స్వల్ప ఆమ్లత్వం ఎలాంటి కఠినమైన రసాయనాలు లేకుండానే మొండి మరకలను, జిడ్డును సులభంగా తొలగిస్తుంది.
పెంపుడు జంతువుల స్నానానికి..
మీ ఇంట్లో కుక్కలు లేదా పిల్లులు వంటి పెంపుడు జంతువులు ఉంటే, వాటి ఆరోగ్యానికి కూడా బియ్యం నీళ్లు ఎంతో మంచివి. వాటికి షాంపూతో స్నానం చేయించిన తర్వాత, ఉప్పు కలపని సాధారణ బియ్యం నీటిని వాటి శరీరంపై పోసి కొన్ని నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది సహజమైన కండీషనర్‌లా పనిచేసి, వాటి బొచ్చు మృదువుగా, మెరిసేలా చేస్తుంది.













