Alcohol Combinations: ఆల్కహాల్‌తో పాటు ఈ మూడు వస్తువులను తీసుకోకండి, శరీరంలో విషం చేరినట్టే
Alcohol Combinations: పాత ఏడాది ముగిసిపోయి కొత్త ఏడాదికి స్వాగతం పలికే రోజు ఇది. మందు పార్టీలతో డిసెంబర్ 31 రాత్రి దద్దరిల్లిపోతుంది. అయితే ఆల్కహాల్ తో పాటు కలిపి తినకూడనివి, తాగకూడనివి, చేయకూడనివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోండి.

ఆల్కహాల్ తో జాగ్రత్త
నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు అందరూ సిద్ధమైపోతారు. గట్టిగానే పార్టీ చేసుకునేందుకు ఈపాటికి ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి. స్నేహితులతో మందు కొట్టి చిందేసేందుకు యువత కూడా సిద్ధంగా ఉంటుంది. అయితే ఆల్కహాల్ హానికరం అని మీకు తెలిసిందే. కాబట్టి మితంగా తీసుకోవడమే ఉత్తమం. అయితే ఆల్కహాల్ తాగేటప్పుడు కొన్ని రకాల పనులు చేయకూడదు. అలాగే మధ్యలో కొన్ని పానీయాలు కలపకూడదు. అలా చేస్తే మీరు విషం తాగినట్టే అని ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో తెలియజేసింది.
పెయిన్ కిల్లర్స్ వద్దు
పోషకాహార నిపుణురాలు శ్వేతా షా చెబుతున్న ప్రకారం ఆల్కహాల్ తో తాగే రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే ఆల్కహాల్ తాగడానికి, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడానికి మధ్య కనీసం 8 నుండి 10 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. లేకుంటే ఇది కాలేయంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. వెంటనే తల తిరగడం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఎనర్జీ డ్రింక్స్ ను ఆల్కహాల్ లో కలిపి తీసుకోవడానికి ఎంతో మంది ఇష్టపడతారు. ఇది నిజానికి చాలా విషపూరితమైన కలయిక. ఆల్కహాల్ అనేది ఒక డిప్రెసెంట్. ఇక ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ ఉత్సాహాన్ని ప్రేరేపించే పానీయాలు. ఈ రెండింటివి వేర్వేరు గుణాలు. అలాంటిది ఈ రెండింటిని కలిపి తాగడం వల్ల మానసిక ఆందోళన, డిహైడ్రేషన్, గుండె దడ వంటివి పెరిగిపోతాయి. ఆల్కహాల్ ను ఎప్పుడైనా సోడాతో లేదా నీటితో కలిపి తీసుకోవడమే ఉత్తమం.
ఈ పనులు చేయకూడదు
చాలామంది ఒకపక్క ఆల్కహాల్ తాగుతూ, మరోపక్క స్మోకింగ్ చేయడం వంటివి చేస్తారు. ఈ రెండూ నిజానికి విషపూరితమైన పనులు. హుక్కా తాగుతూ మధ్యలో లిక్కర్ తాగడం వంటి పనులు కూడా చేయకూడదు. ఆల్కహాల్ తాగాక రక్తనాళాలు విస్తరిస్తాయి. ఇక సిగరెట్ లో ఉన్న లేదా హుక్కాలో ఉన్న నికోటిన్ ఆ రక్తనాళాలను సంకోచించేలా చేస్తుంది. దీని వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. చర్మం నీరసంగా మారి హ్యాంగోవర్ విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని తట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. వీలైనంతవరకు ఆల్కహాల్ కు దూరంగా ఉంటేనే మంచిది. పార్టీలో తప్పదనిపిస్తే చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి.. అయితే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్కహాల్ తాగితే ఆరోజు మీరు నీరు అధికంగా తీసుకోవాలి. అప్పుడే ఆల్కహాల్ శరీరంపై తక్కువ ప్రభావాన్ని చూపించగలదు.

