Face Serum: మెరిసే చర్మం కోసం ఈ సీరమ్‌లను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు!
మెరిసే చర్మం కోసం చాలామంది రకరకాల ప్రాడక్టులు వాడుతుంటారు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు. ముఖం అందంగా మార్చుకోవడానికి ఎంత ఖరీదైన ఉత్పత్తులనైనా వారు కొనడానికి వెనకాడరు. కానీ చర్మ సౌందర్యానికి ఖరీదైన సీరమ్ లతో పనిలేకుండా ఇంట్లోనే సహజ పదార్థాలతో కొన్ని సీరమ్‌లను తయారు చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా?

ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలని అందరు కోరుకుంటారు. అందుకు రకరకాల క్రీములు, సీరమ్స్, ఇతర ప్రాడక్టులు వాడుతుంటారు. అయితే వాటిలో కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది. వాటివల్ల కొన్నిసార్లు మంచి జరగకపోగా.. చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సహజ పదార్థాలతో ఇంట్లోనే సీరమ్ తయారు చేసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. సహజంగానే ముఖాన్ని మెరిపించుకోవచ్చు. మరి ఇంట్లోనే సీరమ్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.
విటమిన్ సి బ్రైటెనింగ్ సీరమ్
కావాల్సినవి: 1 టీస్పూన్ విటమిన్ సి పొడి., 2 టేబుల్ స్పూన్లు డిస్టిల్డ్ వాటర్. 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు. 5 చుక్కల విటమిన్ ఇ ఆయిల్.
తయారీ విధానం: విటమిన్ సి పొడిని డిస్టిల్డ్ వాటర్‌లో వేసి బాగా కలపాలి. తర్వాత కలబంద గుజ్జు, విటమిన్ ఇ నూనె వేసి బాగా కలపాలి. ఈ సీరమ్‌ను గాలి చొరబడని డార్క్ కంటైనర్‌లో నిల్వ చేయాలి.
ఉపయోగించే విధానం: రోజూ రాత్రి చర్మం శుభ్రం చేసుకున్నాక కొద్దిగా సీరమ్ రాసుకోవాలి.
హైలురోనిక్ యాసిడ్ సీరమ్
కావాల్సినవి:1 టీస్పూన్ హైలురోనిక్ యాసిడ్ పొడి. 1 కప్పు రోజ్ వాటర్. 3 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్.
తయారీ విధానం: హైలురోనిక్ యాసిడ్ పొడిని రోజ్ వాటర్‌లో వేసి ఉండలు కట్టకుండా కలపాలి. తర్వాత లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ సీరమ్‌ను గ్లాస్ డ్రాపర్ బాటిల్‌లో వేసుకోవాలి.
ఉపయోగించే విధానం: ఉదయం, సాయంత్రం కొన్ని చుక్కలు ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
నియాసినమైడ్ సూథింగ్ సీరమ్
కావాల్సినవి: 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు. 1 టీస్పూన్ నియాసినమైడ్ పొడి. 1 టేబుల్ స్పూన్ డిస్టిల్డ్ వాటర్
తయారీ విధానం: నియాసినమైడ్ పొడిని డిస్టిల్డ్ వాటర్‌లో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కలబంద గుజ్జుతో బాగా కలపాలి. ఈ సీరమ్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి.
ఉపయోగించే విధానం: చర్మం శుభ్రం చేసుకున్నాక ఈ సీరమ్‌ను రాయాలి. రోజుకు రెండుసార్లు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.