- Home
- Life
- Chicken Vs Mutton: చిన్న పిల్లలకు మటన్ పెట్టొచ్చా? ఎవరు చికెన్ తినాలి? ఎవరు మటన్ తినాలి..?
Chicken Vs Mutton: చిన్న పిల్లలకు మటన్ పెట్టొచ్చా? ఎవరు చికెన్ తినాలి? ఎవరు మటన్ తినాలి..?
Chicken Vs Mutton: చికెన్, మటన్ రెండూ ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఏ వయసు వారు ఏది తినాలి? చిన్న పిల్లలకు చికెన్ లేదా మటన్ ఈ రెండింటిలో ఏది పెట్టడం మంచిది?

చికెన్, మటన్ రెండింటిలో ఏది బెస్ట్?
నాన్ వెజ్ అంటే ఇష్టం లేనివాళ్లు చాలా అరుదు అని చెప్పొచ్చు. నాన్ వెజ్ అనగానే వారికి ముందుగా గుర్తుకొచ్చేది మనకు చికెన్ ,మటన్. టేస్ట్ పరంగా ఈ రెండూ ఎప్పుడూ టాప్ లోనే ఉంటాయి. ఈ రెంరడింటిలోనూ మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ముఖ్యంగా ఏ వయసు వారు ఏది తింటే మంచిది?
1.చిన్న పిల్లలకు మటన్, చికెన్ .. ఏది మంచిది?
పిల్లల మెదడు చురుగ్గా పని చేయడానికి, ఎముకలు, కండరాల బలమైన ఎదుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం. ఈ ప్రోటీన్ చికెన్ లో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు, మటన్ తో పోలిస్తే... చికెన్ పిల్లలకు సులభంగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా లీన్ ప్రొటీన్ ఉండే చికెన్ బ్రెస్ట్ లేదా ఇంట్లోనే తయారుచేసిన చికెన్ సూప్ ఇస్తే వారికి త్వరగా శక్తి అందుతుంది. మటన్ జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, చిన్న పిల్లలకు దానిని చాలా పరిమితంగా, మెత్తగా ఉడికించి పెట్టడం మంచిది.
2.ఫిట్నెస్ ప్రియులకు...
ఫిట్‌నెస్ కోరుకునేవారు ముఖ్యంగా.. జిమ్ కి వెళ్లేవారు, మజిల్స్ పెంచుకోవాలి అనుకునేవారు కూడా ఎక్కువగా చికెన్ ని తమ డైట్ లో భాగం చేసుకుంటూ ఉంటారు. చికెన్ లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ శాతం ఎక్కువగా కూడా ఉంటుంది. దీని వల్ల చికెన్ తింటే బరువు పెరిగే సమస్య కూడా ఉండదు. అయితే... శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు లేదా ఐరన్ లోపం ఉన్నవారు మటన్ తీసుకోవడం మంచిది. దీని వల్ల ఐరన్, జింక్, విటమిన్ బి 12 లోపం తగ్గుతుంది. అయితే.. అది కూడా కాస్త మితంగా తీసుకోవడమే మంచిది.
3.వృద్ధులు ఏది తినడం మంచిది..?
వయసు పెరుగుతున్న కొద్దీ జీర్ణశక్తి సహజంగానే మందగిస్తుంది, కాబట్టి ఈ దశలో తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వృద్ధులకు చికెన్ సులువుగా జీర్ణమవుతుంది కాబట్టి ఇది ఉత్తమ ఎంపిక. ముఖ్యంగా గుండె జబ్బులు, హై బీపీ, లేదా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు మటన్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ మటన్ తినాలనిపిస్తే, నూనె తక్కువగా వేసి ఉడకబెట్టిన సూప్ రూపంలో లేదా చాలా అరుదుగా తీసుకోవడం ఆరోగ్యానికి సురక్షితం.

