Ajwain vs Saunf: భోజనం తర్వాత వాము లేదా సోంపు.. రెండింటిలో ఏది తీసుకోవాలి?
Ajwain vs Saunf: భోజనం చేసిన తర్వాత కడుపులో కాస్త హెవీగా అనిపిస్తోందా? అప్పుడు.. వాము నీరు తాగాలా? లేక... సోంపు నీరు తాగాలా? రెండింటిలో ఏది ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తుంది?

అజీర్తి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
పండగలప్పుడు, లేదా రెస్టారెంట్స్ కి వెళ్లినప్పుడు తెలీకుండానే కాస్త భోజనం ఎక్కువగా తినేస్తూ ఉంటాం. దీని వల్ల.. తిన్న దగ్గర నుంచి.. పొట్టలో హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా పొట్టలో హెవీగా ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవారు.. వాము తినాలని, సోంపు తినాలని చెబుతూ ఉంటారు. నిజానికి, ఈ రెండింటిలో ఏది ఎక్కువగా పని చేస్తుంది? ఏది తీసుకంటే కడుపు ఉబ్బరం తొందరగా తగ్గుతుంది? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
వాము నీరు తాగితే కలిగే ప్రయోజనాలు...
భోజనం తర్వాత గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు చాలా ఇళ్లల్లో వామును ఉపయోగిస్తూ ఉంటారు. హెవీగా తిన్నప్పుడు కలిగే అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి వాము నిజంగానే ఉపయోగపడుతుంది. వాములోని థైమోల్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.
అవిసెన్నా జర్నల్ ఆఫ్ ఫైటోమెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, కడుపు ఉబ్బరం, కడుపు నిండిన భావన వంటి డిస్పెప్సియా సమస్యలతో బాధపడుతున్న 150 మందిపై పరిశోధన జరిపారు. వీరందరికీ రెగ్యులర్ గా వాము నీరు భోజనం తర్వాత ఇవ్వడం వల్ల.. కొన్ని వారాలకే ఆ సమస్య తగ్గినట్లు పరిశోధనలో తేలడం విశేషం.
సోంపు నీరు తాగితే ఏమౌతుంది?
భోజనం తర్వాత సోంపు గింజలు లేదా సోంపు నీటిని తీసుకోవడం మరొక సాధారణ పద్ధతి. భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు చాలా మంది సోంపు నీటిని తాగుతుంటారు. భోజనం తర్వాత వచ్చే కడుపు ఉబ్బరానికి ఇది సహాయపడే పానీయాలలో ఒకటిగా పోషకాహార నిపుణురాలు మన్‌ప్రీత్ కౌర్ కూడా పేర్కొన్నారు. సోంపులో 'అనెథోల్' వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కూడా హెవీ భోజనం తర్వాత కాస్త కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
వాము, సోంపు రెండింటిలో ఏది బెటర్..?
ఏది ఎంచుకోవాలి? సాంప్రదాయకంగా చూస్తే, గ్యాస్, ఉబ్బరం , కడుపు బరువుగా అనిపించినప్పుడు ఎక్కువగా వామును ఎంచుకుంటారు. మరోవైపు సోంపును చాలా మంది భోజనం తర్వాత ఇష్టపడే ఒక తేలికపాటి ప్రత్యామ్నాయంగా చూస్తారు. కాబట్టి, మీ ఆరోగ్య సమస్యలను బట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు.

