Chicken vs Fish: చికెన్, చేప.. ఈ రెండింటిలో ఏది తింటే మంచిది?
Chicken vs Fish: చికెన్ లేదా చేప.. ఈ రెండింటినీ నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగానే తింటారు. ఈ రెండింటిలోనూ పోషకాలు ఉంటాయి. అయితే చికెన్ చేపలలో ఏది తింటే ఎక్కువ ఆరోగ్యకరమో తెలుసుకోండి. ఏది తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు?

చికెన్ లేదా చేప?
ఆదివారం వచ్చిందంటే నాన్-వెజ్ ఉండాల్సిందే. కొందరు వారానికి 2-3 సార్లు నాన్ వెజ్ తినేందుకు ఇష్టపడతరు. చికెన్, మటన్, చేపలు, పీతలు, రొయ్యలు ఇలా నాన్ వెజ్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిలో ఏది తిన్నా బోర్ కొట్టదు. అయితే ఎక్కువ మంది తినేది మాత్రం చికెన్ లేదా చేపలనే. తక్కువ ధరకు దొరికేవి కూడా ఇవే. అయితే రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి వయస్సు, ఆరోగ్య స్థితి, జీవనశైలి ఆధారంగా చికెన్ తినాలా లేక చేపలు తినాలా ఎంపకి చేసుకోవాలి. నిజానికి ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువుపరంగా చూస్తే చికెన్ కన్నా చేపలే బెటర్ అంటారు. ఈ రెండు మన ఆరోగ్యానికి ఏం చేస్తాయో తెలుసుకుంటే ఏది తినాలో నిర్ణయించుకోవచ్చు.
చికెన్ తినడం వల్ల లాభాలు
చికెన్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకం. చికెన్ లో ప్రోటీన్ తో పాటూ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. చికెన్ తినడం వల్ల శరీర ఎదుగుదల ఉంటుంది. అలాగే మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మం తీసివేసిన చికెన్ తింటే కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కండలు పెంచాలనుకునేవారు, వ్యాయామాలు చేసేవారు చికెన్ ఎక్కువగా తింటే మంచిది. చికెన్ లో విటమిన్ B6, B12, నయాసిన్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంతో పాటూ నరాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో అలాగే చికెన్ తిన్నాక త్వరగా జీర్ణం అవుతుంది. పిల్లలు, వృద్ధులు కూడా చికెన్ సులువుగా నమిలి తినగలుగుతారు.
అయితే చికెన్‌లో కొలెస్ట్రాల్ పరిమాణం కొంచెం ఎక్కువగా ఉంటుంది. రోజూ తినేవారు లేదా అధిక మోతాదులో తినేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే ఫ్రైడ్ చికెన్, ఎక్కువ నూనె వేసి వండినది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. హార్మోన్లు, యాంటీబయాటిక్స్ వాడిన చికెన్ తినడం వల్ల దీర్ఘకాలంలో సమస్యలు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.
ముఖ్యంగా బ్రాయిలర్ చికెన్ తినడాన్ని మానేస్తే మంచిది. దానికి బదులుగా నాటు కోడి తినవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నాటు కోడిలోని పోషకాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
చేపలు తింటే...
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అత్యవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని రాసాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చేపలలో ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది కండరాలను బలోపేతం చేసి ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఎ ఇందులో అధికంగా ఉంటుంది. చేపలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడంలో ఇవి సహాయపడతాయి.
పెద్దల్లో వయస్సుతో పాటూ మతిమరుపు వ్యాధి వచ్చేస్తుంది. ఆ వ్యాధి రాకుండా తగ్గించే శక్తి చేపలకు ఉంటుంది. గర్భిణీలు కూడా చేపలు తినడం మంచిది. అయితే కలుషితమైన సముద్రంలో పెరిగిన చేపలలో మెర్క్యూరీ చేరిపోతుంది. చిన్న చేపలతో పోలిస్తే పెద్ద చేపల్లోనే ఈ పాదరసం అధికంగా ఉంటుంది. కాబట్టి పెద్ద చేపలను మాత్రం తినకూడదు. అయితే ప్రతి చేప ఒకేలా ఉండదు. సముద్ర చేపలు, నదీ చేపలు పోషకాల పరంగా తేడాగా ఉంటాయి. నది చేపల్లో పాదరసం తక్కువగా ఉంటే అవకాశం ఉంది. ఏదైనా కూడా తాజా చేపలు తినడం ముఖ్యం. సరిగా నిల్వ చేయని చేపలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అలాగే ఎక్కువ ఉప్పు, మసాలాలతో వండితే చేపల ప్రయోజనాలు చాలా వరకు తగ్గిపోతాయి. వారానికి 2-3 సార్లు చేపలు తింటూ ఎంతో మంచిది. ప్రాసెస్ చేసిన సముద్రపు ఆహారానికి బదులుగా, తాజాగా దొరికే సముద్రపు ఆహారాన్ని తినడం అన్ని విధాలా మేలు చేస్తుంది..
రెండింటిలో ఏది బెటర్?
చికెన్ లేదా చేప ఏదైనా కూడా వండే విధానంపైనే వాటిలోని పోషకాలు ఆధారపడి ఉంటాయి. ఉడికించడం, ఆవిరితో ఉడకబెట్టడం, గ్రిల్ చేయడం వంటి పద్ధతుల్లో వండిన చికెన్,చేపలు ఆరోగ్యానికి మంచివి. ఎక్కువ నూనెలో వేయించడం, రెడీమెడ్ మసాలాలు వాడడం వల్ల పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంది. గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు, బరువు నియంత్రణ కోరుకునే వారికి చేపలు మేలు చేస్తాయి. కండరాల పెరుగుదల, శక్తి కావాలనుకునేవారికి చికెన్ మంచిది. నిజానికి ఈ రెండింటినీ తినడం చాలా ముఖ్యం. వారంలో రెండు సార్లు చికెన్, రెండు సార్లు చేపలు తింటే పోషకాలు శరీరంలో పుష్కలంగా చేరుతాయి.

