Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ 3 సూత్రాలు పాటిస్తే డబ్బుకు లోటే ఉండదు!
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వేల సంవత్సరాల క్రితమే.. ఇప్పటికీ ఉపయోగపడే ఎన్నో విషయాలను పొందుపరిచాడు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలకు సంబంధించి ఆయన బోధించిన మూడు సూత్రాలు పాటిస్తే డబ్బుకు లోటే ఉండదని చెప్పాడు. మరి ఆ సూత్రాలేంటో తెలుసుకుందామా..

చాణక్య నీతి సూత్రాలు
ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారుండరు. ఆయన చెప్పిన నీతి సూత్రాలు పాటిస్తే జీవితంలో తిరుగే ఉండదని చాలామంది నమ్ముతారు. వేల సంవత్సరాల క్రితమే.. ఆయన మానవ జీవితాలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి? ఎలాంటి వారితో స్నేహం చేయాలి? ఎలాంటి అమ్మాయి లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి? జీవితంలో విజయం సాధించాలంటే ఏ నియమాలు పాటించాలి? వంటి ఎన్నో విషయాలు తన బోధనల్లో వివరించాడు. అంతేకాదు ఒక వ్యక్తి తన జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కోకూడదంటే ఎలాంటి నియమాలు పాటించాలో చాణక్యుడు బోధించాడు. మరి ఆ సూత్రాలేంటో తెలుసుకుందామా..
ధనవంతులకైనా, మధ్యతరగతి వారికైనా, పేదవారికైనా.. ఎవరికైనా సరే ఎప్పుడో ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు రావడం సహజం. చాలామంది డబ్బు సంపాదించడానికి కష్టపడతారు. కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం అంత శ్రద్ధ చూపించరు. నెల చివరికి వచ్చేసరికి జేబులు ఖాళీ అవుతాయి. అప్పుడు డబ్బు ఎక్కడికి పోయింది? ఎక్కడ తప్పు చేస్తున్నామనే ప్రశ్న తలెత్తుతుంది.
ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వేల ఏళ్ల క్రితమే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చెప్పారు. డబ్బు సమస్యలు రాకుండా ఉండాలంటే మూడు ప్రత్యేక నియమాలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. వాటిని పాటిస్తే ఏ వ్యక్తి కూడా ఎప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోడనేది ఆయన నమ్మకం. మరి మన జీవితాలకు ఉపయోగపడే ఆ సూత్రాలేంటో తెలుసుకుందామా..
చాణక్యుడి మొదటి నియమం
ఒకరి ఆదాయం ఎంత ఉన్నా.. ఖర్చులు నియంత్రించకపోతే పేదవారిగానే ఉంటారని చాణక్యుడు నమ్మేవారు. చాణక్య నీతి ప్రకారం.. అనవసరంగా ఖర్చు చేసే వ్యక్తి ఎప్పటికీ ధనవంతుడు కాలేడు. ప్రస్తుత కాలంలో నెల మొదట్లోనే బడ్జెట్ వేసుకొని... దాన్ని కచ్చితంగా పాటించడం ముఖ్యం. లేకపోతే నెల మధ్యలోనే చేతిలో డబ్బులు ఖాళీ అవుతాయి. ఇబ్బంది పడాల్సి వస్తుంది.
చాణక్యుడి రెండవ నియమం
డబ్బు పొదుపు చేయడమంటే ఖర్చు తగ్గించడం మాత్రమే కాదు.. పొదుపు చేసిన డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం కూడా ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. సరైన చోట పెట్టుబడి పెడితే అది పెరుగుతుంది. ఈ రోజుల్లో ప్రజలు షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బంగారంపై ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. దానివల్ల తక్కువ టైంలో డబ్బు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది.
చాణక్యుడి మూడవ నియమం
చాణక్య నీతి ప్రకారం డబ్బును సంపాదించడం, పొదుపు చేయడం మాత్రమే కాదు.. ఆ డబ్బును ఎప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలి. తమ సంపదను ఎలా కాపాడుకోవాలో తెలియకపోతే.. మూసిన పిడికిలి నుంచి నీరు జారిపోయినట్లు డబ్బు చేజారిపోతుంది అంటాడు చాణక్యుడు. కాబట్టి మనం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బ్యాంక్ సేవింగ్స్, బీమా వంటివి చేసుకోవడం ముఖ్యం.