Bone health: ఈ జ్యూస్ లు తాగితే.. ఎముకలు బలంగా అవుతాయి..!
Bone health: శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే తిరిగి ఎముకలు బలంగా అవుతాయి.

మనం నిటారుగా నిలబడటానికి, నడవడానికి, పని చేయడానికి, బరువులు ఎత్తడానికంటూ ప్రతి పనికి ఎముకలు ఆరోగ్యంగా , బలంగా ఉంటేనే ప్రతిదీ సాధ్యం అవుతుంది. కానీ మనం తీసుకునే చెడు ఆహారాలు, గతితప్పిన జీవనశైలి వంటి వివిధ కారణాల వల్ల ఎముకలు బలహీనపడుతున్నాయి. దీంతో వంద అడుగులు కూడా నడవలేకపోతున్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, వేళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవన్నీ మీ ఎముకలు బలహీనంగా ఉండటం వల్లే వస్తాయి.
కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలు శరీరంలో కాల్షియం, విటమిన్ డి లోపం వల్లే వస్తాయి. ఈ సమస్యలను అలాగే వదిలేస్తే కొన్ని రోజులకు మీకు నడవడమే కష్టం అవుతుంది. అందుకే దీన్ని మొదటి దశలోనే తగ్గించుకోవాలి. ఎముకలు బలంగా ఉండాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను తినాలి. ముఖ్యంగా స్మోకింగ్ కు దూరంగా ఉండాలి.
bone
పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే కొన్ని రకాల జ్యూస్ లు కూడా ఎముకలను బలంగా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ద్రాక్షరసం (grape juice)
ద్రాక్ష రసంలో ఎముకలను బలంగా చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే ఈ జ్యూస్ ఎముకలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కలిగిస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం.. ద్రాక్షరసం ను తాగడం వల్ల ఎముకలు హెల్తీగా ఉండటంతో పాటుగా ఎముక ఖనిజ స్థాయి కూడా పెరుగుతుంది.
పాశ్ఛరైజ్డ్ పాలు
పాలు కాల్షియం కి గొప్ప వనరు. పాశ్చరైజ్డ్ పాలలో విటమిన్ డి తో పాటుగా కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి. అందుకే ఎముకలు బలహీనంగా ఉండేవారు రోజూ ఒక గ్లాస్ పాలను తాగాలని నిపుణులు చెబుతున్నారు.
ఆకు కూరల జ్యూస్
ఆకు కూరల్లో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ కాల్షియం బచ్చలి కూర, పాలకూరలో పెద్ద మొత్తంలో ఉంటుంది. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి. వీటిని కూరగా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా.. మంచి ఫలితం ఉంటుంది.
సోయా, బాదం పాలు
బాదం పప్పుల్లో ఎముకలను బలంగా చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎముకలు బలంగా ఉండాలంటే బాదం పాలను, సోయా పాలను రోజూ తాగాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎముకలను స్ట్రాంగ్ గా చేసే విటమిన్ డి, కాల్షియం లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.