Cooking Oil: ఈ వంటనూనెలు గుండె జబ్బులను రానియ్యవు..
Cooking Oil: మనం ఉపయోగించే వంట నూనెలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే గుండెకు మేలు చేసే నూనెలనే వాడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నూనె లేకుండా వంటలను చేయడం దాదాపుగా అసాధ్యం. అందుకే వంటల్లో నూనెకు ప్రత్యేక స్థానముంది. ఈ నూనెలు మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్నిచూపుతాయి. కొన్ని రకాల నూనెలు మనల్ని ఆరోగ్యంగా ఉంచితే.. మరి కొన్ని నూనెలు మాత్రం మనల్ని ఎన్నో జబ్బుల పాలు చేస్తాయి. ముఖ్యంగా ఈనూనెలు గుండెపై తీవ్రమైన ప్రభావాన్నిచూపుతాయి. అయితే గుండె జబ్బులు ఉన్నవారు ఈ వంట నూనెల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండెకు మేలు చేసే వంట నూనెలనే ఉపయోగించాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్నిరకాల వంట నూనెలు గుండె రోగులకు మేలు చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
peanut oil
వేరుశెనగ నూనె (Peanut oil)
వేరుశెనగ నూనె గుండెకు ఉత్తమమైన వంట నూనెలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ నూనెలో విటమిన్ ఇ, మోనోశాచురేటెడ్ కొవ్వులు (Monounsaturated fats), పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు (Polyunsaturated fats)అధికంగా ఉంటాయి. విటమిన్ ఇ గుండెకు మేలు చేయడంతో పాటుగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఈ నూనె సహాయపడుతుంది. ఒమేగా -6 (Omega-6), ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు (Omega-3 fatty acids) పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ నూనెలో వేరుశెనగ నూనెను కలిపి తీసుకున్నా మంచే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఆలివ్ ఆయిల్ (Olive oil)
ఆలివ్ ఆయిల్ అత్యంత ప్రాచుర్యం పొందిన ఆరోగ్యకరమైన వంట నూనెల్లో ఒకటి. ఇది పాలీఫెనాల్స్ అని పిలువబడే మొక్కల ఆధారిత సమ్మేళనాలతో నిండి ఉంటుంది. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ముందుంటాయి. ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి . దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. అలాగే బరువు కూడా తగ్గిస్తాయి.
పొద్దుతిరుగుడు నూనె (Sunflower oil)
పొద్దు తిరుగుడు నూనె హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇతర నూనెలతో పోలిస్తే పొద్దుతిరుగుడు నూనెలో విటమిన్ ఇ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెకు చాలా మంచిది.
ఆవనూనె (Mustard oil)
ఈ నూనె గుండెకు మాత్రమే కాకుండా చర్మం, కీళ్లు, శరీరంలోని ఇతర భాగాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా వంటకాల్లో ఈ నూనెనే ఎక్కువగా వాడుతుంటారు. ఈ నూనెలో మోనోశాచురేటెడ్ (Monosaturated), పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (Polyunsaturated fatty acids), ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఆవనూనె జీర్ణక్రియ, ఆకలిని మెరుగుపరుస్తుందని కూడా నమ్ముతారు.
రైస్ బ్రాన్ ఆయిల్ (Rice bran oil)
రైస్ బ్రాన్ ఆయిల్ గుండెకు ఉత్తమమైన వంట నూనెలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిలో గుండెకు మేలు చేసే మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. సలాడ్లు, కుకీలు, కేకులు తయారీలో ఈ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు.
సోయాబీన్ ఆయిల్ (Soybean oil)
సోయాబీన్ నూనెను సోయాబీన్స్ నుంచి తీస్తారు. ఇది మొత్తం శరీరానికి ప్రయోజనం చేకూర్చే కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. సోయాబీన్ ఆయిల్ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.
కుసుమ నూనె (Safflower oil)
ఈ నూనె శరీరంలోని కొలెస్ట్రాల్ ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.గుండె జబ్బుల ప్రమాదాలను తగ్గిస్తుంది. దీని లక్షణాలు ధమనులు గట్టిపడకుండా నిరోధించడానికి సహాయపడతాయి.