- Home
- Life
- Sperm Count: మగవారు ఇష్టంగా తినే ఈ ఆహారాలన్నీ వారి స్పెర్మ్ కౌంటును తగ్గించేస్తాయి, జాగ్రత్త
Sperm Count: మగవారు ఇష్టంగా తినే ఈ ఆహారాలన్నీ వారి స్పెర్మ్ కౌంటును తగ్గించేస్తాయి, జాగ్రత్త
ఆధునిక కాలంలో మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోయి సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతున్నాయి. వారు తినే కొన్ని ఆహారాలు వారి స్పెర్మ్ కౌంట్ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు ఆధునిక అధ్యయనాలు చెబుతున్నాయి.

స్పెర్మ్ కౌంట్ తగ్గించే ఆహారాలతోనే సమస్య
సంతానోత్పత్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పిల్లలు సహజంగా కలగక ఐవిఎఫ్, సరోగసి వంటి దారుల్లో ఎంతోమంది ప్రయాణిస్తున్నారు. పిల్లలు పుట్టక పోవడానికి కేవలం మహిళల్లో ఉండే లోపాలే కాదు.. పురుషుల్లో కూడా ఆ లోపం ఉండవచ్చు. ముఖ్యంగా పురుషుడిలో వీర్యకణాల సంఖ్య తగ్గిపోయినా లేక వాటి నాణ్యత లేకపోయినా కూడా వారికి సంతాన సమస్యలు ఏర్పడతాయి. వీర్యకణాల ఆరోగ్యమనేది ఎంతోమంది పురుషులను ఇబ్బంది పెడుతున్న అనారోగ్యంగా మారిపోయింది.
పిల్లలు పుట్టక జంటల బాధ
గత 38 ఏళ్లతో పోలిస్తే మగవారిలో స్పెర్మ్ కౌంటు 59% తగ్గినట్టు తాజా అధ్యయనం తెలిసింది. దీనివల్లే ప్రపంచంలో 35 శాతం జంటలలో పిల్లలు పుట్టడం లేదు. ఎంతోమంది భార్యాభర్తలు సంతానోత్పత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషుల్లో స్పెర్మ్ కౌంటు పెరిగి పడిపోవడానికి కారణాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఆధునిక యుగంలో లాప్ టాప్ లను ఒడిలో పెట్టుకుని పనిచేసే వారి సంఖ్య అధికంగానే ఉంది. అలాంటి మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెప్పాయి. అలాగే సెల్ ఫోన్లను ప్యాంటు జేబుల్లో పెట్టుకోవడం వల్ల ఉత్పత్తి అయ్యే వేడి వల్ల కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్టు చెబుతున్నారు. ఊబకాయం కూడా దీనికి ప్రధాన కారణంగానే వివరిస్తున్నారు. ఊబకాయం వల్ల కూడా పురుషుల్లో స్పెర్మ్ సంబంధిత సమస్యలు అధికంగా వస్తున్నాయి.
ఇలాంటి మాంసం వద్దు
అయితే స్పెర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మగవారు కొన్ని రకాల ఆహారాలను తినడం చాలా వరకు తగ్గించాలి. అధికంగా ఉప్పు వేసిన ఆహారాలను తినకూడదు. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాలను కూడా తినకూడదు. ఇవి స్పెర్మ్ ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మాంసాహారం తినాలనిపిస్తే ఇంట్లో వండిన కూరలే తినాలి. బయట నిల్వ పద్ధతిలో దొరికే మాంసాలను తినకూడదు. పిజ్జాల్లో, బర్గర్లో వేసినవి అన్నీ కూడా ప్రాసెస్ చేసిన మాంసాలే. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
సముద్రపు ఆహారంతో సమస్యలు
సీ ఫుడ్ సాధారణంగా మంచిదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సముద్రపు ఆహారంలో పాదరసం అధికంగా చేరుతుంది. దీనివల్ల ఒమేగా త్రీ పోషకాలు తగ్గిపోతున్నాయి. ఇవి కూడా వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గేలా చేస్తాయి. కాబట్టి సీ ఫుడ్ కన్నా నదుల నుంచి వచ్చే చేపలు, రొయ్యలు వంటివి తినేందుకు ప్రయత్నించండి. సముద్రపు ఆహారాలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ముఖ్యంగా సంతానోత్పత్తికి ప్రయత్నిస్తున్న వయసులో ఉన్న మగవారు సముద్రపు ఆహారానికి దూరంగా ఉండాలి.
ఇప్పటి యువతకి అధిక చక్కెర వేసిన కూల్డ్రింకులు, ఆల్కహాలు, కెఫీన్ పానీయాలు అంటే ఎంతో ఇష్టం. పార్టీ అంటే అవన్నీ అక్కడ ఉండాల్సిందే. కానీ ఇవన్నీ కూడా మగవారిలోని స్పెర్మ్ ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి వారిలో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి పిల్లల్ని కనే వయసులో ఉన్నవారు వీటిని తీసుకోవడం చాలా వరకు తగ్గిస్తే మంచిది.
చీజ్ మానేయండి
చీజ్ వంటి అధిక కొవ్వు, పాల ఉత్పత్తులు కూడా స్పెర్మ్ కౌంటు పై ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే సోయాతో చేసిన ఉత్పత్తులు కూడా వీర్యకణాలను దెబ్బతీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని తక్కువగా తినాలి. ప్రతిరోజు తినే పద్ధతిని తగ్గించుకోవాలి.
పిల్లల కోసం ప్రయత్నిస్తున్న మగవారు తమ ఆహారంలో పాలకూర, బాదం, వాల్ నట్స్, బ్రోకలీ వంటి తాజా ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఇంట్లో వండిన ఆహారాలను తినేందుకే ప్రయత్నించాలి. కొవ్వు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.